అసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు ఢిల్లీకి చేరారు. ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న నేతలంతా హస్తిన బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకొని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే పాలమూరులోని కొన్ని స్థానాల కోసం కూటమి భాగస్వామ్య పార్టీ లైన టీడీపీ, టీజేఎస్‌లు పట్టుబడుతున్నాయి.
ఆయా స్థానాల్లో కాంగ్రెస్ తరఫున కూడా తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి మిత్రపక్షాలకు చెందిన వారు సైతం తమ స్థానాలను పదిలం చేసుకోవడం కోసం ఢిల్లీ బాట పట్టారు. తమకున్న పరిచయాలు, ఇతరత్రా అంశాలను ఉపయోగించుకుంటూ సీటు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా సీట్ల కేటాయింపు, పొత్తులు రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో... పాలమూరు ప్రాంత రాజకీయా లు ఆసక్తికరంగా మారాయి.
పోటాపోటీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉన్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో టికెట్ల కోసం పోటీ తీవ్రమవుతోంది. దీంతో ఏడాది కాలంగా పలువురు పార్టీ లో చేరుతున్నారు. ఫలితంగా పలు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేరకు దరఖాస్తులు కూడా భారీగానే అందాయి. కొల్లాపూర్ వంటి కొన్ని చోట్ల పార్టీలో లేని వారు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టి... ముగ్గురు చొప్పున పేర్లతో కూడిన జాబితాను పార్టీ హైకమాండ్‌కు పంపించింది.
అయితే జిల్లాలో సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే ఎలాంటి పోటీ లేదు. దీంతో గద్వాల, కొడంగల్, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తితో పాటు అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇక మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలకు కాస్త పోటీ నెలకొంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకునేందుకు హస్తిన బాట పట్టారు.
జడ్చర్ల సీటు దక్కించుకునేందుకు పారిశ్రామికవేత్త జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం వద్ద మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన ఆశా వహులు కూడా వారం రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ ఆశావహులు భారీగా ఉన్న చోటనే మహాకూటమి మిత్ర పక్షాలు కూడా సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. దీంతో సీట్ల కేటాయింపు అంశం ఎటూ తేలక ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
కూటమి అభ్యర్థులు సైతం
టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి మహాకూటమిగా జతకట్టాయి. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే పాలమూరు ఉమ్మడి జిల్లాలో టికెట్ల కేటాయింపుపై తకరారు నెలకొంది. జిల్లాలో టీడీపీ మూడు స్థానాల కోసం గట్టిగా పట్టుబడుతోంది. మహబూబ్‌నగర్, మక్తల్‌తో పాటు జడ్చర్ల లేదా దేవరకద్ర నియోజకవర్గాలను ఆశిస్తోంది. అయితే వీటిలో రెండు స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మహబూబ్‌నగర్ స్థానం కోసం టీడీపీ గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలు స్తోంది. కానీ ఇదే స్థానం కోసం తెలంగాణ జన సమితి కూడా పట్టుబడుతోంది. ఈ మేరకు టీజేఎస్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో కేవలం ఒక్క మహబూబ్‌నగర్ టిక్కెట్టు ఇచ్చినా సరిపెట్టుకుంటామనే ప్రతిపాదనను కూటమి ఎదుట చేసినట్లు సమాచారం. ఇందుకోసం టీజేఎస్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఢిల్లీలో గట్టి పైరవీ చేస్తూ... మహబూబ్‌నగర్ స్థానాన్ని ఖరారు చేసుకొవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం మీద ఎవరికి వారు టికెట్ల కో సం హస్తినలో మంతనాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment