అవ్వా.. నామీద నమ్మకం ఉంచు
నారాయణపేట బీజేపీ అభ్యర్థి కే.రతంగపాండురెడ్డి తరపున ప్రచార సభలో పాల్గొనేందుకు స్టార్ క్యాంపెయినర్ పరిపూర్ణానంద స్వామి శుక్రవారం దామరగిద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు పక్కవారితో తన బాధను వ్యక్తం చేస్తుండడాన్ని గమనించిన స్వామి ఆమెను వేదికపైకి పిలిపించి మాట్లాడారు. ఉండటానికి ఇల్లు, సెంటు భూమి కూడా లేదని ఆమె వాపోయింది. అందుకు సమాధానంగా టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలే కారణమని పేర్కొన్న స్వామి.. ఈసారి తనపై నమ్మకంతో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు.
– నారాయణపేట రూరల్
నాన్నకు ఓ అవకాశం ఇవ్వండి
అన్నా.. నాన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ జడ్చర్ల స్వతంత్రఅభ్యర్థి రమేష్‌రెడ్డి తనయుడు డాక్టర్ రాఘవేందర్‌రెడ్డి కోరారు. రాజాపూర్ మండల కేంద్రంతో పాటు పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ వెల్డింగ్ షాపులో కొద్దిసేపు పనిచేసిన ఆయన.. జడ్చర్ల మార్కెట్ చైర్మన్‌గా మూడు పర్యాయాలు పని చేసిన తన తండ్రికి అన్నదాతల కష్టసుఖాలు తెలుసునని వివరించారు.
– రాజాపూర్
ఈ బాణానికి తిరుగులేదు..
లక్ష్మణ బాణానికి తిరుగులేదు.. టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు.. అన్నట్లు జడ్చర్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇలా విల్లును ప్రదర్శించారు. నవాబుపేటలో ప్రచారానికి వచ్చిన ఆయనకు అభిమానులు విల్లు బహూకరించారు. ఈ సందర్భంగా బాణం ఎక్కు ప్రచారానికి ఊపు తీసుకొచ్చారు
– నవాబుపేట
మీ పనిలో సాయం పంచుకుంటా..
మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి పద్మజారెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బోయపల్లి, బండమీదిపల్లి, జైనల్లిపూర్, ఫతేపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతుండగా ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. అక్కడ ఓట్లు అభ్యర్థించిన ఆమె కొద్దిసేపు పూరీలు చేసి వారి పనిలో పాలుపంచుకున్నారు.
– మహబూబ్‌నగర్ న్యూటౌన్
దరువెయ్.. ఓట్లు పట్టేయ్...
ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట బీజేపీ అభ్యర్థి కొత్తకాపు రతంగపాండురెడ్డి అప్పంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయనకు స్వాగతం పలికేందుకు మేళతాళాలతో వచ్చిన యువత, కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు తాను సైతం కొద్దిసేపు డప్పు వాయించారు.
– నారాయణపేట రూరల్
Comments
Please login to add a commentAdd a comment