సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల్లోని రెండింట్లో అభ్యర్థులకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నారాయణపేట స్థానానికి కుంభం శివకుమార్‌రెడ్డి, కొల్లాపూర్ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అధికారికంగా శుక్రవారం విడుదలయ్యే మూడో జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశం ఉంది.
దేవరకద్ర స్థానం మాత్రం అలాగే, మిగిలిపోయింది. ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు ఆశావహులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ స్థానంపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవరకద్ర టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన డోకూరు పవన్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద దేవరకద్ర టికెట్ దక్కుతుందనేది తేలాలంటే ఇంకా ఒకటి, రెండు రోజులు ఆగక తప్పదని సమాచారం.
మూడో జాబితా సిద్ధం
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. అసెంబ్లీని రద్దు చేసి దాదాపు రెండున్నర నెలలు కావొస్తున్నా.. ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. ఆఖరికి నామినేషన్ల ప్రక్రియ మొదలై నాలుగు రోజులు కావొస్తున్నా కొన్ని స్థానాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు, టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో మూడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
నారాయణపేట, కొల్లాపూర్, దేవరకద్ర స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే తాజాగా రూపొందించిన మూడో జాబితాలో జిల్లాకు చెందిన రెండు స్థానాల అభ్యర్థుల పేర్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో నారాయణపేట నుంచి కుంభం శివకుమార్‌రెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఆయన గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. అనేక అవాంతరాల నేపథ్యంలో శివకుమార్ అభ్యర్థిత్వానికి పార్టీ హైకమాండ్ ఓకే చేసింది. అలాగే కొల్లాపూర్ నుంచి కూడా బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేరు కూడా ఓకే అయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో... ఈసారి కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే హైకమాండ్ ఖరారు చేసింది.
పెండింగ్‌లోనే దేవరకద్ర
ఉమ్మడి జిల్లాలో మహాకూటమికి సంబంధించి అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినా.. దేవరకద్ర మాత్రం పెండింగ్‌లో ఉంచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో జిల్లాలోని డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ఇరువర్గాలు పంతానికి పోతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పార్టీ హైకమాండ్ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో మహాకూటమి తరఫున ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ ఒక్క స్థానం మాత్రమే బీసీలకు కేటాయించారు. మరోవైపు జనరల్ స్థానమైన జడ్చర్ల నుంచి ఎస్సీ సామాజికవర్గం నేతకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కూటమి తరఫున మరో స్థానాన్ని బీసీలకు కేటాయించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసిన పవన్‌కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఎంపిక ప్రక్రియ జఠిలంగా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేవరకద్రకు చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్ పేరు పేరు పరిశీలన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవరకద్ర నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది తెలుసుకునేందుకు మరో రెండు రోజులు వేచిచూడాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment