సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాజెక్టులే ప్రచారాస్త్రాలుగా మారాయి. సరైన నీటివసతి లేక అల్లాడుతున్న మహబూబ్‌నగర్ ముఖచిత్రాన్ని మార్చేలా చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల పాశుపతాస్త్రాలు అవుతున్నాయి. ఎత్తిపోతల పథకాలన్నింటికీ అంకురార్పణ చేసిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకుంటుంటే.. సమస్యల సుడిగుండంలో పడేసిన ప్రాజెక్టులను గట్టెక్కించి పొలాలకు సాగునీరు పారించింది తామేనని టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రాజెక్టులతో సాగులోకి వచ్చిన 6 లక్షల ఎకరాల ఆయకట్టు, దానికి పారిన నీళ్లచుట్టూతా పాలమూరు రాజకీయమంతా తిరుగుతోంది.
ఒకరివి నిధులు.. ఇంకొకరివి నీళ్లు..
జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లను చేపట్టారు. మొత్తంగా 7.80 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్లతో వీటిని ఆరంభించారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వాయువేగంతో ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరిగాయి. 2009లో సెప్టెంబర్ నాటికి ఈ 4 ప్రాజెక్టుల కింద 60 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, ఆయన మరణానంతరం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రులు చిన్నచూపు చూశారు. వివిధ అవాంతరాలతో 2014 ముందు వరకు 39,300 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిక్కుముడులను పరిష్కరించి కొన్నిచోట్ల కొత్త ఆయకట్టును చేర్చడంతో ప్రాజెక్టుల అంచనాలూ పెరిగాయి.
ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు 6.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సాగులోకి వచ్చిన ఆయకట్టే 5.65 లక్షల ఎకరాలు ఉంది. అయితే, పనులన్నీ తమ హయాంలోనే పూర్తయినా, కేవలం కమీషన్ల కోసమే అంచనాలు పెంచి ప్రాజెక్టులు జాప్యం చేశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కల్వకుర్తి అంచనా రూ.4,896 కోట్లకు, నెట్టెంపాడు అంచనా రూ.2,331 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నిస్తోంది. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు–రంగారెడ్డిని మూడేళ్లయినా 30 శాతం పనులైనా ఎందుకు చేయలేదని నినదిస్తోంది. దీనికి టీఆర్‌ఎస్ గట్టిగానే బదులిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చి వలసలు ఆపామని, వెయ్యి చెరువులను నింపి పల్లెలను పచ్చగా మార్చామని చెబుతోంది. కాంగ్రెస్ వేసిన కోర్టు కేసులతోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం అవుతోందని ఎదురుదాడికి దిగుతోంది. కల్వకుర్తి కేటాయింపులను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచామని, నిల్వల కోసం కొత్త రిజర్వాయర్లు నిర్మించిన విషయాలను గట్టిగా చెబుతోంది. గద్వాల, అలంపూర్, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, దేవరకద్ర, కల్వకుర్తి, మక్తల్ నియోజకవర్గాల్లో ఇరు పార్టీల ప్రచారం అంతా వీటి కేంద్రీకృతంగానే సాగుతోంది.
విమర్శలు.. ప్రతి విమర్శలు
ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మాటల కత్తులు దూసుకుంటున్నాయి. నీళ్లిచ్చింది తామంటే తామని మాటల వేడి పెంచుతున్నాయి. పాలమూరు వలసలకు కాంగ్రెస్ కారణమైతే, వలసలను ఆపింది తామేనని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు జిల్లా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్టుకుంటుంటే, ఆయనతో చేతులు కలిపి కాంగ్రెస్ అంటకాగుతోందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల నాగర్‌కర్నూల్, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల పర్యటనల్లోనూ, కల్వకుర్తి, తుమ్మిళ్ల, పాలమూరు–రంగారెడ్డి, ఆర్టీఎస్ పనులను అడ్డుకునేందుకు బాబు చేస్తున్న కుట్రలనే ప్రధానంగా ప్రస్తావించి వేడి పెంచా రు. ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు తాగునీటి కోసం రూ.7,200 కోట్లు కేటాయించి, తెలంగాణకు మొండిచేయి చూపితే, అప్పటి మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ నోరు మెదపలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. మరో మంత్రి కేటీఆర్, వనపర్తిలో ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు ఇవే అంశా లతో ప్రచారం చేస్తున్నారు. అయితే, వీరికి కాంగ్రెస్ దీటుగానే సమాధానం ఇస్తోంది. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పథకాలను ప్రారంభించి, 2012 నాటికి దాదాపు పూర్తి చేసి నీరందించామని, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు పైపై మెరుగులు దిద్ది ఫొటోలకు ఫోజులిచ్చారే తప్ప, మిగిలిపోయిన పనులు చేపట్టలేదని డీకే అరుణ గట్టిగా జవాబిస్తున్నారు. ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పి నాలుగేళ్లు మాయమాటలతో కాలం వెళ్లదీశారని, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గట్టు ఎత్తిపోతల పథకం గుర్తొచ్చి ఆగమేఘాల మీద శంకుస్థాపనలు చేశారని ప్రతివిమర్శలకు దిగారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సైతం ప్రాజెక్టుల అంశంపై టీఆర్‌ఎస్‌ను నిలదీసే యత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment