సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలను అసమ్మతి వర్గాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బరిలో నిలిచే అశావహులు ఎక్కువగా ఉండడంతో పలు స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి నెలన్నర రోజులు గడుస్తున్నా అసమ్మతి రాగాలు ఏ మాత్రం తగ్గడం లేదు. పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగి సర్దిచెప్పినా వినడంలేదు. టికెట్లు ఆశించి భంగపడిన వారు రానున్న ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలవాలనే యోచనతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పోటీ తీవ్రంగానే ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలు మినహా మిగతా చోట్ల ఆశావహుల జాబితా నానాటికీ పెరుగుతోంది. దీంతో దసరా లోపు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ ముఖ్యులు... ఆ సాహసం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న వారు పార్టీలో గాడ్ ఫాదర్ల సహకారంతో అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరైతే కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే స్వతంత్రంగానైనా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఇలా మొత్తం మీద అసమ్మతి నేతలు ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
అసంతృప్తి జ్వాల
టీఆర్‌ఎస్‌లో అసంతృప్త జ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఇది జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా అసమ్మతి నేతల వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. పార్టీ ముఖ్యులు, జిల్లాకు చెందిన మంత్రులైన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు అసమ్మతి నేతలకు ఎంతగా నచ్చజెప్పినా వినడం లేదు. అంతేకాదు పార్టీలో నంబర్ 2గా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ కూడా జిల్లా అసమ్మతినేతలను పిలిపించుకొని మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కల్వకుర్తి, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ అసమ్మతి కొనసాగుతోంది.
కల్వకుర్తిలో అసమ్మతి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కసిరెడ్డిని సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. అనుచరుల ఒత్తిడి మేరకు కల్వకుర్తి బరిలో నిలవాలని కసిరెడ్డి నిర్ణయించారు. అలాగే మక్తల్‌లో కూడా అర డజను మంది నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.
వీరిలో ఎవరో ఒకరు బరిలో నిలవాలని నిర్ణయించుకోగా.. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్న సతీశ్ ముదిరాజ్ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇటీవల కోస్గిలో భారీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. రానున్న ఎన్నికల బరిలో కొడంగల్ నుంచి బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల వైఖరి.. బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
- మహబూబ్‌నగర్ నుంచి ఐదుగురు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా లేని విధం గా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒబేదుల్లా కొత్వాల్ మరోసారి పోటీకి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి మరో నలుగురు కూడా కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎం.సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ ఇబ్రహీం, టీడీపీ నుంచి వచ్చిన ఎన్.పీ.వెంకటేశ్‌తో పాటు మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి ముగ్గురు పేర్లతో కూడిన జాబితా పంపించారు. వీరిలో ఎవరికి టికెట్ దక్కపోయినా మిగతా వారిలో ఒకరిద్దరు ఖచ్చితంగా బరిలో నిలవాలని తహతహలాడుతున్నారు.
- జడ్చర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన మల్లు రవి మరో దఫా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవ ల పార్టీలో చేరిన పారిశ్రామిక వేత్త జనుంపల్లి అని రు«ధ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. స్థానికత అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్లో సెంటిమెంట్ రగిలిస్తున్నారు.
- నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచేందుకు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఉన్న కొండా మణెమ్మ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
- కొల్లాపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన బీరం హర్షవర్దన్‌రెడ్డి మరో సారి బరిలో నిలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రచారయాత్రను మొ త్తం ఆయనే ముందుండి నడిపించారు. అలాగే ఇక్కడి నుంచి జగదీశ్వర్‌రావు, సుధాకర్‌రావు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి మాత్రం బీ రం హర్షవర్ధన్‌రెడ్డితో పాటు జగదీశ్వర్‌రావు పేర్లు మాత్రమే వెళ్లినట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది వేచి చూడాల్సిందే.
- దేవరకద్ర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున డోకూరు పవన్‌కుమార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోయారు. పదేళ్లుగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండడంతో ఈసారి కూడా బరిలో నిలవాలని పట్టుబడుతున్నారు. అయితే పవన్‌తో పాటు హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌గౌడ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరి ముగ్గురి పేర్లు కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్లాయి. వీరిలో ఎవరో ఒకరికే టికెట్ దక్కితే.. మిగతా వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
- మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గత ఎన్నికల్లో గెలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గెలిచినప్పటికీ... ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అక్కడ పార్టీ సీనియర్ నేతలు శ్రీనివాస్‌గుప్తా, నిజాం పాషా, డీసీసీబీ చైర్మన్ కె.వీరారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి ఈసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నలుగురు పోటీ పడుతున్నప్పటికీ ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపినట్లు తెలుస్తోంది.
- నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సరాఫ్ కృష్ణ.. ఈసారీ బరిలో నిలవా లని యత్నిస్తున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ నుంచి కె.శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడంతో ఈసారి కాం గ్రెస్ తరఫున నిలవాలని భావిస్తు న్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండాల్సిందే.
కాంగ్రెస్‌లో ఆరు స్థానాలకు ఓకే
రాష్ట్ర మొత్తంలో కాంగ్రెస్‌కు కాస్త అనుకూలంగా పాలమూరు జిల్లాలో టికెట్ దక్కించుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తాజా మాజీలు ఉన్న స్థానాల్లో మాత్రం అంతా సానుకూలంగానే ఉంది. లేదు. కొడంగల్‌లో ఎనుముల రేవంత్‌రెడ్డి, గద్వాలలో డీకే.అరుణ, అలంపూర్‌లో సంపత్‌కుమార్, వనపర్తిలో జి.చిన్నారెడ్డి, కల్వకుర్తిలో చల్లా వంశీచంద్‌రెడ్డి అభ్యర్థి త్వాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అలాగే అచ్చంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కాకపోయినా.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు పోటీగా మరెవరూ లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే చెబుతున్నారు..
Comments
Please login to add a commentAdd a comment