శ్రీశైలం ప్రాజెక్టు బాబు జాగీర్‌ కాదు | Harish Rao slams Congress & TDP at Nagarkurnool election campaign | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ప్రాజెక్టు బాబు జాగీర్‌ కాదు

Published Thu, Oct 25 2018 5:19 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

Harish Rao slams Congress & TDP at Nagarkurnool election campaign - Sakshi

బుధవారం నాగర్‌కర్నూలు రోడ్‌షోలో విల్లు ఎక్కుపెట్టిన మంత్రి హరీశ్‌రావు

నాగర్‌కర్నూల్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం నుంచి తెలంగాణకు తీసుకుంటున్న నీటిని నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి ఉత్తరం రాశారని.. కానీ, వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుపడినా తెలంగాణ రైతన్నలకు నీరు ఇచ్చి తీరుతామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ‘మర్రి యువ గర్జన’పేరిట నిర్వహించిన రోడ్డుషోకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ నాయకులు, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు చంద్రబాబు జాగీర్‌ కాదని అన్నారు. పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలంటూ లేఖ రాసిన చంద్రబాబుతో కాంగ్రెస్‌ నాయకులు పొత్తు పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతి ముందు పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమమని వాదిస్తే సీఎం కేసీఆర్‌ కూడా తన వాదనను వినిపించి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగించారని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో చిత్తూరుకు తాగునీటికోసం రూ.7,200 కోట్లు కేటాయిం చగా... తెలంగాణకు కూడా కేటాయించమని అడిగితే నిండు అసెంబ్లీలో ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదన్నారని గుర్తు చేశారు. అయినా అప్పటి మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ కనీసం నోరు మెదపలేదని తెలిపారు. ఆర్డీఎస్‌ తూములు పగలగొడితే కాంగ్రెస్‌ నాయకులు ఒక్క మాటా మాట్లాడలేదని, టీఆర్‌ఎస్‌ మాత్రమే పోరాటం చేసిందని హరీశ్‌రావు వివరించారు.

నీటి వాటా ఎలా వస్తుంది?
తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ దీక్ష చే య గా.. కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన విడుదల చేసినప్పుడు ఆంధ్రా ఎమ్మెల్యేల కపట రాజీనామా నాటకాలతో డిసెంబర్‌ 21న తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని హరీశ్‌రావు తెలిపారు. నాడు తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే టీడీపీ ఎమ్మెల్యేల నటన ను గుర్తించి ఆ సమయంలో కోదండరాం జేఏసీ నుంచి తెలంగాణ టీడీపీ నాయకులను సస్పెం డ్‌ చేశారని వివరించారు. వలసవాద పార్టీలను తరిమికొట్టండన్న కోదండరాం.. నేడు వారినే ముద్దాడుతున్నారని అన్నారు. మహా కూటమి గెలిస్తే తెలంగాణకు న్యాయపరమైన నీటి వాటా ఎలా వస్తుందో కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు 500 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తెలంగాణకు కేటాయించాల్సిందిగా వాదిస్తున్నామని, దీనికి అనుకూలమని చంద్రబాబును కాంగ్రెస్‌ నాయకులు ఒప్పిస్తారా అని హరీశ్‌ ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను నిలిపివేయాలన్న చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా తెల ంగాణ అమరులకు నివాళులర్పించారా? అని ప్రశ్నించారు.

బాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు..
ఆంధ్రా పాలకులే నయమన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. వారు ఏ విధంగా నయమయ్యారో చెప్పాలని, తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటవుతుందని వ్యాఖ్యానించినందుకా? లేక తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నందుకు నచ్చారా అన్నది చెప్పాలని అన్నారు. చంద్రబాబు ఇచ్చే డబ్బు సంచులతో కాంగ్రెస్‌ గెలవాలని చూస్తోందని.. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల అండతో అధికారంలోకి రావాలనుకుంటోందని హరీశ్‌రావు తెలిపారు. అసహజమైన పొత్తు పెట్టుకున్న పార్టీల నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని, సీట్ల కోసం తన్నుకుంటున్న నాయకులు పొరపాటున గెలిస్తే కుర్చీ కోసం ఎలా తన్నుకుంటారో ఆలోచించాలని ప్రజలను కోరారు. కోదండరాం రెండు సీట్ల కోసం కాంగ్రెస్‌కు గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు.

కోదండరాం ఎమ్మెల్యే సీటు కోసం సిద్ధాంతాలు మార్చుకున్నారా అని ప్రశ్నించారు. వలసవాద పార్టీలను తాము తెలంగాణ సరిహద్దులకు తరిమికొడితే, కాంగ్రెస్‌ పార్టీ వారిని భుజాలపై ఎత్తుకుని మళ్లీ తెలంగాణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వంద సీట్లు గెలవడం ఖాయమని హరీశ్‌రావు అన్నారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement