
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం నిధులు వంటి అంశాలపై మాత్రమే సీఎం జగన్ అమిత్ షాను కలుస్తారని వివరించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయటంపై ఆయన స్పందిస్తూ..
తాము బలహీనులము కాదని, అలాగే తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్‌లో పూర్తి బాధ్యత టీడీపీదేనని పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పి దానిని నిజం చేయాలని చూస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు తామేమాత్రం వెరవమని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకోర్టు విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఇందులో కిలారి రాజేష్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, త్వరలో పెద్ద తలకాయలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.