
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వెలిబుచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు, హింసాత్మక ఘటనలు 2022లో గత 4 దశాబ్దాల్లోకెల్లా అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ‘నక్సలిజం మానవత్వం పాలిట శాపం. దాన్ని అన్నివిధాలా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని అన్నారు. వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2015లో ’వామపక్ష తీవ్రవాదంపై జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 2010తో పోలిస్తే నక్సల్స్ హింసలో పోలీసు, పౌర మరణాలు 90 శాతం తగ్గాయని వివరించారు. ‘2004–14 మధ్య 17,679 నక్సల్ సంబంధిత హింసా ఘటనలు, 6,984 మరణాలు సంభవించాయి. 2014–23 మధ్య 7,659 ఘటనలు, 2,020 మరణాలు నమోదయ్యాయి‘ అని పేర్కొన్నారు.