naxals affected areas
-
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
రెండేళ్లలో తీవ్రవాదానికి చరమగీతం: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వెలిబుచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు, హింసాత్మక ఘటనలు 2022లో గత 4 దశాబ్దాల్లోకెల్లా అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ‘నక్సలిజం మానవత్వం పాలిట శాపం. దాన్ని అన్నివిధాలా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని అన్నారు. వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2015లో ’వామపక్ష తీవ్రవాదంపై జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 2010తో పోలిస్తే నక్సల్స్ హింసలో పోలీసు, పౌర మరణాలు 90 శాతం తగ్గాయని వివరించారు. ‘2004–14 మధ్య 17,679 నక్సల్ సంబంధిత హింసా ఘటనలు, 6,984 మరణాలు సంభవించాయి. 2014–23 మధ్య 7,659 ఘటనలు, 2,020 మరణాలు నమోదయ్యాయి‘ అని పేర్కొన్నారు. -
దండకారణ్యానికి రహదారి మాల!
సాక్షి, హైదరాబాద్: దేశంలో తీవ్రవాద భావజాలాన్ని తగ్గించడానికి అభివృద్ధే అసలైన ఔషధం. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలు అందితే వారిలో మార్పు తీసుకురావచ్చు. ఇదే సూత్రాన్ని తెలంగాణలో కేంద్రం అమలు చేస్తోంది. అందుకే, మావోయిస్టు ప్రాబల్య మారుమూల దండకారణ్యాల్లోనూ రోడ్లను వేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రూ.1,300 కోట్ల నిధులతో 1,300 కి.మీ.ల దూరం మేర మూడు రాష్ట్రాల దండకారణ్యాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. కిలోమీటరు రోడ్డుకు రూ.కోటి ఖర్చు చేస్తున్నాయి. పథకాలు చేరువ చేయడానికి.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆది నుంచి మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో వెనకబడ్డ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలను చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు భౌగోళికంగా కలసే ప్రాంతాలను ఎంపిక చేసింది. 3 రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కలుపుతూ.. ఉత్తర తెలంగాణ, ఆగ్నేయ మహారాష్ట్ర, నైరుతి ఛత్తీస్‌గఢ్ పరిధిలో ఉన్న దండకారణ్యాల్లో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాలను కలిపేందుకు రోడ్ల కోసం రూ. 1,300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా 550 కి.మీ. మేర పనులకు నిధులు విడుదల కాగా, పనులు కూడా మొదలయ్యాయి. 20 రోడ్లు, 18 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇక మిగిలిన 750 కి.మీ.లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులు సాగుతున్నాయి. దీనికి ఆమోదం లభించగానే..ఆ పనులు కూడా మొదలవుతాయి. గోదావరిపై మూడు వారధులు.. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా 3 భారీ వంతెనలు కూడా నిర్మించాల్సి ఉంది. అవి పర్ణశాల (భద్రాద్రి కొత్తగూడెం), ముక్కనూరు (జయశంకర్ భూపాలపల్లి) వంతెనలను గోదావరి నదిపై నిర్మించనున్నారు. ఇక గోదావరికి ఉపనది అయిన మానేరుపై ఆరింద(పెద్దపల్లి) వద్ద భారీ వంతెనలను నిర్మిస్తారు. ఈ 3 కూడా కి.మీకు పైగా పొడవుంది. వీటి నిర్మాణానికి అనుమతులు కూడా వచ్చాయి. మూడు రాష్ట్రాలను కలపడంలో ఈ వంతెనలు కీలక పాత్ర పోషిస్తాయి. -
మీట నొక్కుడే
నేటి పోలింగ్‌కు సర్వం సిద్ధం ఓటేయనున్న 25,61,171 మంది ఓటర్లు బరిలో 184 మంది అభ్యర్థులు పార్లమెంట్‌కు 29.. అసెంబీకి 155 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే... కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన పోలింగ్ బుధవారం జరగ నుంది. రెండు నెలలుగా ఎన్నికల సన్నా హాల్లో ఉన్న యంత్రాంగం పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తంగా ఇక ఓటరు బూత్‌లోకి వెళ్లి ఈవీఎం మీట నొక్కడమే తరువాయి అన్నట్లు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. జిల్లాలో 25,61,171 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12 శాసన సభ, రెండు పార్లమెంట్ స్థానాలుండగా.. పార్లమెంట్ స్థానాల నుంచి 29మంది, అసెంబ్లీ స్థానాల నుంచి 155మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు. ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున పోలింగ్ కేంద్రల వద్ద షామియానాలు, తాగునీరు, వైద్య సదుపాయానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 3007 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 303 కేంద్రాలు సమస్యాత్మకం, 124 అతి సమస్యాత్మాకం, 142 కేంద్రాలు నక్సల్స్ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించారు. వీటిలో 300 కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 833 కేంద్రాల్లో సూక్ష్మపరీశీలకులు, 1030 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో మొత్తం 26,629 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. వీరిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మొత్తం 1527 వాహనాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 8350 బ్యాలెట్ యూనిట్లు, 6900 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు. రెండు చోట్ల 4గంటలవరకే పోలింగ్ జిల్లాలో మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల పరిదిలో పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే కొనసాగించనున్నారు. మిగతా నియోజకవర్గాల పరిధిలో యథావిధిగా సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారాలు పోలింగ్ ప్రక్రియను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈసారి యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్రీన్ ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వెబ్ కెమెరాలకు కనెక్ట్ చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడనున్నారు. కలెక్టరేట్లో కూడా పోలింగ్ ప్రక్రియ సమాచారం కోసం స్రీన్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇది కొనసాగుతుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటుపై విసృ్తత ప్రచారం జిల్లాలో ఈసారి 100శాతం పోలింగ్ నమోదును లక్ష్యంగా పెట్టుకున్న యత్రాంగం ఆ దిశగా ఓటర్లను సిద్ధం చేసేందుకు గ్రామ గ్రామాన ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈవీఎం వినియోగంపై కూడా ప్రత్యేక బృందాలతో అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు. బరిలో ఉన్న అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ నొక్కి తమ అభిప్రాయం వ్యక్తంచేయాలని అధికారులు చెపుతున్నారు. ఏడు వేల మందితో భద్రత పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం 7వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు హెలికాప్టర్లు మడికొండ, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణకు రెండు ప్రత్యేక హెలికాప్టర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏదైనా అత్యవసర సమయంలో వాటిని ఉపయోగించడానికి మడికొండలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో సిద్ధంగా ఉంచారు. వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు వినియోగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హెలికాప్టర్‌తో పాటు ప్రత్యేక బలగాలను సైతం అందుబాటులో ఉంచారు.