న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు.
‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment