ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో వింతైన రాజకీయాలు సాగుతున్నాయి. ఒక నాయకుడేమో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అని అంటారు. మరో నాయకుడేమో 175 సీట్లలో వైసిపి ని ఓడించడం అని అంటారు. గమ్మత్తు ఏమిటంటే ఈ ఇద్దరు నేతలు కూడా తాము అధికారంలోకి వస్తామని చెప్పలేని దుస్థితి. తమకంటూ ఒక ఎజెండాలేని నిస్సహాయత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి సడన్ గా ఎందుకు వెళ్లినట్లు? అక్కడ రెండురోజుల పాటు పడిగాపులు పడడం తప్ప ఏమి సాధించినట్లు?
టీడీపీని నమ్మని బీజేపీ
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ కొందరు బిజెపి ప్రముఖులను కలిసినా, వారు ఆశించిన లక్ష్యం నెరవేరలేదన్న సంగతి ఇట్టే తెలిసిపోతోంది. బిజెపి అద్యక్షుడు జెపి నడ్డాను కలిసి బయటకు వచ్చిన తర్వాత పొత్తుల గురించి స్పష్టత ఇవ్వలేకపోయారు. ఆ ఒక్కటే కాదు. ఏ విషయంలోను నిర్దిష్టంగా మాట్లాడలేకపోయారు.
నిజంగానే వారు ఆశించినట్లు తెలుగుదేశం తో కలవడానికి బిజెపి ఏ మాత్రం సుముఖత కనబరిచినా, వారి మొహంలో తేడా కనిపించేది. టిడిపి అదినేత చంద్రబాబు కళ్లలో వెలుగు చూడడం కోసం పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం ఉండడం లేదు. వైసిపి అదినేత, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు దత్తపుత్రుడు అని పేరు పెట్టినందుకు దానిని సార్దకం చేయడానికే పవన్ పని చేస్తున్నట్లుగా ఉంది. కాకపోతే ఇందుకు బిజెపి అడ్డుగోడగా మారింది. ప్రస్తుతానికి వారు తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదు.
బిజెపి నేతలు గుస్సా!
టిడిపి అధినేత చంద్రబాబు చేతిలో తమకు ఎదురైన దారుణమైన అవమానాలను మర్చిపోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా టిడిపి నుంచి పరాభవ అనుభవాలు ఉన్నా, ఆయన పెద్దగా ఫీల్ కావడం లేదు. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం దక్కడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్ది మాధవ్ కు మద్దతు ప్రకటించకపోవడంపై కేంద్ర బిజెపి నేతలు గుస్సా అయ్యారట. ఇదేమి మిత్రధర్మం అని ప్రశ్నించారట. దీనికి పవన్ వద్ద నీళ్లు నమలడం తప్ప సమాధానం సహజంగానే ఉండదు.
అదేమంటే వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అని అంటారు. ప్రతిపక్షాల ఓట్లు చీలరాదని చెబుతారు. అదెలా సాధ్యం. బిజెపితో పాటు కాంగ్రెస్, వామపక్షాలను కూడా ఆయన కలుపుకుంటారా? అసలు జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే ఆయన తంటాలు పడుతున్నారన్న వైసిపి విమర్శలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గత పదేళ్లలో పలురకాలుగా పార్టీల కూటములను మార్చిన పవన్ ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.
పక్కా ప్లాన్‌తో బీజేపీ గూటికి పవన్
2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన బిజెపి పెద్దల వద్దకు వెళ్లి బతిమలాడి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎలా విడిపోవాలా అని తంటాలు పడుతున్నారు. దాంతో ఇదంతా చూస్తే, చంద్రబాబే ఆయనను 2019లో బిజెపి గూటికి పంపించారని ధ్రువపడుతోంది. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచే పరిస్థితి లేదని బిజెపి భావిస్తోందని చెబుతున్నారు. ఆ క్రమంలో బిజెపి, జనసేన కలిసి గట్టిగా పనిచేస్తే, 2029 నాటికి తెలుగుదేశంకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని వారి భావన.
కాని అంతవరకు పవన్ ఆగలేకపోతున్నారు. పైగా చంద్రబాబు ఒత్తిడి ఎటూ ఉంది. వచ్చే ఎన్నికలలో గెలవలేకపోతే టిడిపి ఉనికి ప్రశ్నార్దకం అవుతుందన్న సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన వ్యూహం ఆయనది. అందులో పవన్ ను ఒక పావును చేసి ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్న చందంగా మారినట్లుగా ఉంది. అటు బిజెపికి విడాకులు ఇవ్వడానికి సాకులు వెతకలేక, ఇటు తెలుగుదేశంతో పెళ్లి చేసుకోవడం ఎలా అన్నది అర్ధం కాక ఆయన కిందా, మీద అవుతున్నారు.
అందువల్లే టిడిపి, జనసేన కూటమి ఏర్పాటు ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా 175 సీట్లలో ఓడించాలన్నదే తమ అభిప్రాయం అంటున్నారే తప్ప అన్ని సీట్లలో పోటీ చేస్తామని, అన్ని సీట్లలో తెలుగుదేశం గెలుస్తుందని నేరుగా చెప్పలేకపోతున్నారు. 175 సీట్లలో పోటీచేయండని వైసిపి సవాల్ చేయడం ఏమిటని అంటున్నారు. ఇంతవరకు తానే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధినని చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పడం లేదు. సాదారణంగా అయితే ఆయనే అవుతారు.
పవన్ వర్సెస్ లోకేష్
కాని ఒక వైపు సొంతపుత్రుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మితే తానే సి.ఎమ్. అభ్యర్ది అవుతానని చెప్పి ఉండేవారు. చంద్రబాబు వయసు రీత్యా కాని, పార్టీలో ఇటీవలికాలంలో టిక్కెట్లు మొదలు పలు నిర్ణయాలు చేస్తున్న తీరు గమనిస్తే ఆయనే పార్టీపై పెత్తనం చేస్తున్నట్లు కనిపించే యత్నం చేస్తున్నారనిపిస్తుంది. తనే సి.ఎమ్. అభ్యర్ధి అని చెప్పుకుంటే నష్టం జరుగుతుందని లోకేష్ భయపడుతుండాలి.
అదే సమయంలో పైకి చెప్పడం లేదు కాని అవకాశం వస్తే సి.ఎమ్. చైర్ పై ఆయనే ఖర్చీప్ వేస్తారన్న అభిప్రాయం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ను సి.ఎమ్. అభ్యర్ధి గా అంగీకరిస్తేనే టిడిపితో పొత్తు పెట్టుకోవాలన్న డిమాండ్ జనసేన కార్యకర్తలలో గట్టిగా ఉంది. వృద్ధ నేత చేగొండి హరి రామజోగయ్య ఆ సంగతి ఇప్పటికే చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కు సి.ఎమ్ కోరిక ఉందన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఆయనపై ఆయనకే నమ్మకం లేదు. అది వేరే సంగతి.
ఈ నేపధ్యంలో , లోకేష్ సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏ రకంగా పెట్టుకోవడం అన్నది చంద్రబాబుకు ఇంకా నిర్దారణ కాలేదు. పవన్ తోనే సి.ఎమ్. పదవి తనకు అక్కర్లేదని చంద్రబాబు చెప్పించినా ఆశ్చర్యం లేదన్నది కొందరి భావనగా ఉంది. అలా జరిగితే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా లోకేష్, పవన్ లు సి.ఎమ్. అభ్యర్ధిత్వానికి పోటీ పడితే చంద్రబాబుకు ఎటూ పాలుపోకపోవచ్చు. జనసేన ఏభైకి పైగా సీట్లను డిమాండ్ చేయడం చంద్రబాబుకు ఇరకాటమే. ఆ రకంగా చంద్రబాబు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
చంద్రబాబు సతమతం!
అందుకే ఆయన అన్ని సీట్లలో పోటీచేయమంటారేమిటని వైసిపిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తానే సి.ఎమ్. అభ్యర్ధినని చెప్పలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఆయనకు ఇలాటి పరిస్థితి రాలేదు. 1999, 2004లలో బిజెపితో జట్టు కట్టినా, 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో కూటమి కట్టినా, 2014లో బిజెపి, జనసేనలతో కలిసి పోటీచేసినా, ఆ కూటముల నుంచి ఎవరూ సి.ఎమ్. పదవికి చంద్రబాబుతో పోటీ పడలేదు. ఈసారి జనసేన అధికారంలో వాటా కోరుకుంటోంది.
సి.ఎమ్. సీటును తమకు కూడా ఇవ్వాలని కోరుతోంది. ఒకవైపు లోకేష్, మరో వైపు పవన్ కళ్యాణ్ .. ఇంకోవైపు అసలు అధికారం దక్కదేమో అన్న దిగులు మధ్య చంద్రబాబు కూడా సతమతం అవుతున్నారు. తత్ఫలితంగానే ఆయన తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీచేస్తుందని చెప్పలేకపోతున్నారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని గట్టిగా అనలేకపోతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment