ఢిల్లీలో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలుకుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్‌భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాయని, అలాంటి రాష్ట్రాలకు కుటుంబాల ప్రాతిపదికన ఎక్కువ శాతం రేషన్ కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ హేతుబద్ధత లేని విధానం వల్ల తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని గణాంకాలతో సహా వివరించారు. ఈ విధానాన్ని సరిదిద్ది రాష్ట్రంలోని అర్హులైన 1.47 కోట్ల రేషన్‌కార్డులకు రేషన్ అందేలా చూడాలని కోరారు. ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్రం.. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,229 కోట్లు వెంటనే చెల్లించాలని విన్నవించారు. శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.
కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయించారని తెలిపారు. 2015 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం కుటుంబాలకు.. పట్టణాలు, నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే రేషన్ ఇస్తున్నారని చెప్పారు. దీనివల్ల కేవలం 91 లక్షల రేషన్ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని తెలిపారు.
తద్వారా కేటాయింపులు 1,85,640 మెట్రిక్ టన్నుల నుంచి 1,54,148కి తగ్గించారని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోç ఇంటింటా సర్వే చేసి పారదర్శక పద్దతిలో 1.47 కోట్ల రేషన్‌కార్డుదారులను గుర్తించామని, వీరందరూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అమలయ్యే కార్యక్రమాలన్నింటికీ అర్హులని వివరించారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక, రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని.. తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కార్డుదారుల వివరాలన్నీ డిజిటలైజేషన్ చేశామని తెలిపారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు శుక్రవారం ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేస్తున్న సీఎం జగన్
ఎంఎస్‌పీతో ధాన్యం కొనుగోలు
రాష్ట్రంలో 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందుకు సంబంధించిన సొమ్ము సకాలంలో రైతులకు అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి విన్నవించారు.
పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సహకరించాలి
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయాన్ని సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేం«ద్ర ప్రధాన్‌తో ఆయన సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలపై విస్తృతంగా చర్చించారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి హెచ్‌పీసీఎల్ – గెయిల్ సంస్థలు రూ.32,900 కోట్లు ఖర్చయ్యే మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశాయని కేంద్రమంత్రికి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రాన్ని కోరిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రసుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారం మోయలేదని తెలిపారు. ప్రాజెక్టు విధివిధానాలు చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్ గ్రూపు సభ్యులను నామినేట్ చేశామని, కేంద్రం చర్చలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్పొరేట్ పన్నును కేంద్రం 25 శాతం తగ్గించిందని, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించండి
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వల్ల సుమారు 20 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదుల మీద ఈ పరిశ్రమ వచ్చిందన్నారు. 2002 –2015 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19,700 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు పైనే ఉంటుందన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్.. విస్తరణ నిమిత్తం పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందని తెలిపారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచే కష్టాలు వచ్చాయని వివరించారు.
సొంత గనులు కేటాయించాలి
సొంత గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిందని చెబుతూ, ప్లాంటు పునరుద్ధరణకు పలు ప్రత్యామ్నాయాలు కేంద్ర మంత్రికి సూచించారు. 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పని చేస్తోందని చెప్పారు. డిసెంబర్ 2020 నుంచి నెలకు రూ.200 కోట్ల లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. ఇదే పరిస్థితి రెండేళ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. ఇనుప ఖనిజాన్ని ఎన్‌డీఎంఈ, బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు టన్ను సుమారు రూ.5,260తో కొనుగోలు చేస్తోందన్నారు. పోటీ సంస్థలు 60 శాతం ఇనుప ఖనిజాన్ని సొంత గనుల నుంచే పొందుతున్నాయని, మిగతా ఎన్‌ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. సెయిల్‌కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్
మార్కెట్ ధరకు ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయడం వల్ల పరిశ్రమపై రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ఒడిశాలో లభ్యమయ్యే ఇనుప ఖనిజ గనులు విశాఖ ప్లాంటుకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు రూ.22 వేల కోట్లు రుణాలు ఉన్నాయని, వీటిపై 14 శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రుణాలు ఈక్విటీ రూపంలోకి మార్చాలని కోరారు. స్టాక్ ఎక్సేంజీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకొనే అవకాశాలు కూడా పరిశీలించాలన్నారు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకొనే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరోనా రెండో వేవ్ సమయంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు పరిశ్రమ అందించి, లక్షల మంది ప్రాణాలు కాపాడిందని తెలిపారు.
సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం శాఖ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విధివిధానాలు కూడా ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశం సమయంలో సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, భరత్, రెడ్డెప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ తదితరులు ఉన్నారు. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి చేరుకున్నారు.
ఏపీ సీఎంతో చర్చలు ఫలవంతం
– కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చలు ఫలవంతమయ్యాయని కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. శుక్రవారం సీఎం జగన్‌తో ఆయన గంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు వేగవంతం చేయడం.. కేజీ బేసిన్, తూర్పుగోదావరి జిల్లాను ప్రధాన హైడ్రో కార్బన్ హబ్‌గా స్థాపించడంపై ఫలవంతమైన చర్చలు జరిపాం. రాష్ట్రంలో చమురు, గ్యాస్ ప్రాజెక్టులు అమలు చేయడంలో మద్దతిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం కలిసి పని చేయడానికి అంగీకరించాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్థికాభివృద్ధిలో నూతన శకానికి నాంది పలికినట్లు అయింది’ అని ఆయన ట్వీట్ చేశారు.
అమిత్‌షాతో సీఎం డిన్నర్
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గురువారం రాత్రి సుమారు గంటన్నరకుపైగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి సమావేశమైన విషయం విదితమే. అమిత్‌షా, సీఎం జగన్‌లు డిన్నర్ చేస్తూ ఆయా అంశాలు చర్చించారు. కాగా, శుక్రవారం సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కారు వద్దకు వచ్చి ఆల్ ద బెస్ట్ అంటూ వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment