National Food Security Act
-
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో తీసుకుని రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పథకం గడువుని పొడిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అమలు కానుంది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత పొడిగింపు నిర్ణయం అమలు తర్వాత, ఈ స్కీమ్ ప్రయోజనం NFSA (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద లబ్ధిదారులకు ప్రయెజనాలను అందివ్వనున్నారు. 2020 నుంచి ప్రత్యేక PMGKAY పథకం కింద ప్రజలకు లబ్ధిచేకూరేది. నివేదికల ప్రకారం, దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా.. తాజాగా మరో ఏడాదికి ప్రయోజనాన్ని పెంచింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
మరో 1.58 కోట్ల మందికి ఆహార భద్రత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల్లో కొత్త ఆశలు ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
గరీబ్ కల్యాణ్ అన్నయోజన... ఐదు నెలలపాటు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోని 81.35 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు వర్తింపజేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల ఏడో తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రమే ఉచిత టీకాలిస్తుందని, నవంబరు వరకు ఉచిత రేషన్‌ను అందజేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉచిత రేషన్‌కు ఆమోదం తెలిపింది.ఈ పథకాన్ని కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో తొలుత 2020 మార్చిలో ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు మూడో విడతలుగా ఈ పథకం అమలైంది. నాలుగో విడతలో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 81.35 కోట్ల మందికి మరో 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల వంతున ఉచితంగా అదనపు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తారు. ఇందుకు రూ. 64,031 కోట్ల మేర ఆహార సబ్సిడీపై వెచ్చించాల్సి వస్తుందని అంచనా. రైల్‌సైడ్ వేర్‌హౌజ్ కంపెనీ విలీనం సెంట్రల్ రైల్ సైడ్ వేర్‌హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్‌డబ్ల్యూసీ)ను దాని మాతృసంస్థ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)లో విలీనం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
YS Jagan: ‘ఆహార భద్రత’లో లోపాలు సవరించాలి
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాయని, అలాంటి రాష్ట్రాలకు కుటుంబాల ప్రాతిపదికన ఎక్కువ శాతం రేషన్ కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ హేతుబద్ధత లేని విధానం వల్ల తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని గణాంకాలతో సహా వివరించారు. ఈ విధానాన్ని సరిదిద్ది రాష్ట్రంలోని అర్హులైన 1.47 కోట్ల రేషన్‌కార్డులకు రేషన్ అందేలా చూడాలని కోరారు. ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్రం.. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,229 కోట్లు వెంటనే చెల్లించాలని విన్నవించారు. శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయించారని తెలిపారు. 2015 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం కుటుంబాలకు.. పట్టణాలు, నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే రేషన్ ఇస్తున్నారని చెప్పారు. దీనివల్ల కేవలం 91 లక్షల రేషన్ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని తెలిపారు. తద్వారా కేటాయింపులు 1,85,640 మెట్రిక్ టన్నుల నుంచి 1,54,148కి తగ్గించారని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోç ఇంటింటా సర్వే చేసి పారదర్శక పద్దతిలో 1.47 కోట్ల రేషన్‌కార్డుదారులను గుర్తించామని, వీరందరూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అమలయ్యే కార్యక్రమాలన్నింటికీ అర్హులని వివరించారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక, రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని.. తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కార్డుదారుల వివరాలన్నీ డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు శుక్రవారం ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేస్తున్న సీఎం జగన్ ఎంఎస్పీతో ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందుకు సంబంధించిన సొమ్ము సకాలంలో రైతులకు అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి విన్నవించారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సహకరించాలి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయాన్ని సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేం«ద్ర ప్రధాన్‌తో ఆయన సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలపై విస్తృతంగా చర్చించారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి హెచ్‌పీసీఎల్ – గెయిల్ సంస్థలు రూ.32,900 కోట్లు ఖర్చయ్యే మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశాయని కేంద్రమంత్రికి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రాన్ని కోరిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రసుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారం మోయలేదని తెలిపారు. ప్రాజెక్టు విధివిధానాలు చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్ గ్రూపు సభ్యులను నామినేట్ చేశామని, కేంద్రం చర్చలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్పొరేట్ పన్నును కేంద్రం 25 శాతం తగ్గించిందని, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించండి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వల్ల సుమారు 20 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదుల మీద ఈ పరిశ్రమ వచ్చిందన్నారు. 2002 –2015 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19,700 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు పైనే ఉంటుందన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్.. విస్తరణ నిమిత్తం పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందని తెలిపారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచే కష్టాలు వచ్చాయని వివరించారు. సొంత గనులు కేటాయించాలి సొంత గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిందని చెబుతూ, ప్లాంటు పునరుద్ధరణకు పలు ప్రత్యామ్నాయాలు కేంద్ర మంత్రికి సూచించారు. 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పని చేస్తోందని చెప్పారు. డిసెంబర్ 2020 నుంచి నెలకు రూ.200 కోట్ల లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. ఇదే పరిస్థితి రెండేళ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. ఇనుప ఖనిజాన్ని ఎన్డీఎంఈ, బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు టన్ను సుమారు రూ.5,260తో కొనుగోలు చేస్తోందన్నారు. పోటీ సంస్థలు 60 శాతం ఇనుప ఖనిజాన్ని సొంత గనుల నుంచే పొందుతున్నాయని, మిగతా ఎన్ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. సెయిల్‌కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ మార్కెట్ ధరకు ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయడం వల్ల పరిశ్రమపై రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ఒడిశాలో లభ్యమయ్యే ఇనుప ఖనిజ గనులు విశాఖ ప్లాంటుకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు రూ.22 వేల కోట్లు రుణాలు ఉన్నాయని, వీటిపై 14 శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రుణాలు ఈక్విటీ రూపంలోకి మార్చాలని కోరారు. స్టాక్ ఎక్సేంజీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకొనే అవకాశాలు కూడా పరిశీలించాలన్నారు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకొనే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరోనా రెండో వేవ్ సమయంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు పరిశ్రమ అందించి, లక్షల మంది ప్రాణాలు కాపాడిందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం శాఖ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విధివిధానాలు కూడా ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశం సమయంలో సీఎం జగన్ వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, భరత్, రెడ్డెప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ తదితరులు ఉన్నారు. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి చేరుకున్నారు. ఏపీ సీఎంతో చర్చలు ఫలవంతం – కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చలు ఫలవంతమయ్యాయని కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. శుక్రవారం సీఎం జగన్‌తో ఆయన గంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు వేగవంతం చేయడం.. కేజీ బేసిన్, తూర్పుగోదావరి జిల్లాను ప్రధాన హైడ్రో కార్బన్ హబ్‌గా స్థాపించడంపై ఫలవంతమైన చర్చలు జరిపాం. రాష్ట్రంలో చమురు, గ్యాస్ ప్రాజెక్టులు అమలు చేయడంలో మద్దతిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం కలిసి పని చేయడానికి అంగీకరించాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్థికాభివృద్ధిలో నూతన శకానికి నాంది పలికినట్లు అయింది’ అని ఆయన ట్వీట్ చేశారు. అమిత్‌షాతో సీఎం డిన్నర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గురువారం రాత్రి సుమారు గంటన్నరకుపైగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి సమావేశమైన విషయం విదితమే. అమిత్‌షా, సీఎం జగన్‌లు డిన్నర్ చేస్తూ ఆయా అంశాలు చర్చించారు. కాగా, శుక్రవారం సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్.. సీఎం జగన్మోహన్రెడ్డి కారు వద్దకు వచ్చి ఆల్ ద బెస్ట్ అంటూ వీడ్కోలు పలికారు. -
ఇక ఎక్కడికెళ్లినా రేషన్ తిప్పలు ఉండవు!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేసే ప్రణాళికలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లి్లష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్ కార్డ్ హోల్డర్లకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు వన్ నేషన్ వన్ రేషన్ కింద జరిగాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభించిన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్ నాటికి తక్కువ వ్యవధిలో వేగంగా విస్తరించగలిగామని అన్నారు. ప్రస్తుతం వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థలో దేశంలోని దాదాపు 69 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతీ నెల సగటున 1.5 –1.6 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు నమోదు అవుతున్నాయని పాండే తెలిపారు. -
మార్చి నుంచి రేషన్ డీలర్ల దేశవ్యాప్త సమ్మె
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే విధమైన పారితోషికం లేక ఒకే కమీషన్ చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 1 నుంచి రేషన్ డీలర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. డీలర్లకు నెలకు రూ.50 వేల వేతనం లేని పక్షంలో, క్వింటాల్ ధాన్యానికి రూ.300 కమీషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీలర్ల సంఘం కేంద్ర కమిటీ సన్నాహాలు చేస్తుండగా, చేపట్టబోయే కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. రేషన్ డీలర్లకు 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ కింద ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కమీషన్ కేవలం రూ.20 మాత్రమే ఉండగా, దాన్ని ఆగస్టులో రూ.70కి పెంచారు. రూ.500 కోట్లు ఉన్న బకాయిల్లో కొన్నింటిని సైతం ప్రభుత్వం చెల్లించింది. మిగతా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం.. బియ్యంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా కమీషన్ విధానం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బియ్యంపై క్వింటాల్‌కు రూ.180 వరకు చెల్లిస్తున్నారు. కేరళలో రేషన్ డీలర్లకు కనీస వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల నిర్వహణ భారంగా మారుతుండటం, వచ్చే కమీషన్ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో కనీస వేతనాలు చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సగటున రూ.3,700 మేర నికరంగా ఆదాయం నెలకు వస్తుంది. కొన్ని దుకాణాలకు రూ.6 వేల వరకూ ఉంటుంది. షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించి దుకాణ నిర్వహణ కష్టసాధ్యంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కమీషన్ బదులుగా కనీస వేతనం చెల్లించాలన్నది డీలర్ల వాదన. దీంతో తమకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని డీలర్లు చెబుతున్నారు. లేనిపక్షంలో క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చిన కేంద్ర కమిటీ, మార్చి నుంచి సమ్మెకు దిగేందుకు సమాయత్తమవుతోంది, ఇక రాష్ట్రంలోనూ శనివారం రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహించి సమ్మె అంశమై కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయ్కోటి రాజు తెలిపారు. - సాంకేతిక కారణాల రీత్యా రెండు రైళ్లను పూర్తిగా, మరో రెండింటిని పాక్షి కంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సి.హెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నంబర్ 57657 మణుగూరు–కాజీపేట, 57658–కాజీపేట–మణుగూరు రైళ్లను 15,16,17 తేదీల్లో, 12967 చెన్నై సెంట్రల్–జైపూర్ సూపర్‌ఫాస్ట్ రైలును 17న పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 67245 విజయవాడ–భద్రా చలం, 67246 భద్రాచలం–విజయ వాడ రైలును భద్రాచలం–డోర్నకల్ మధ్య 15,16,17వ తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
1 నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం
కేంద్ర పథకానికి రాష్ట్రం తోడు సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చే నెల 1వ తేదీ నుంచి తమిళనాడులో అమలులోకి రానుంది. రేషన్‌కార్డుదారులకు అదనంగా ఉచిత బియ్యం అందనుంది. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి పన్నీర్ సెల్వం ఈనెల 24వ తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆహారభద్రతా చట్టం అమలు చేయాలన్న అంశం కూడా ఒకటి. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రస్తుతం దారిద్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసే బియ్యాన్ని కిలో రూ.8.30లకు బదులుగా రూ.22.54లకు సరఫరా చేయగలమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీకి 3.23 ల క్షల మెట్రిక్ టన్నులు అవసరం. అరుుతే నెలకు 2.96 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే కేం ద్రం ఇస్తోంది. అదనంగా అవసరమవుతున్న 27,969 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది జూలై తరువాత నుంచి నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి 38.93 లక్షల మెట్రిక్ టన్నుల బియాన్ని సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,393 కోట్లు అదనంగా భారం పడుతోంది. ఈ ఆహారభద్రతా చట్టాన్ని యథాతథంగా అమలు చేసిన పక్షంలో రాష్ట్రంలోని 50.55 శాతం ప్రజలు మాత్రమే లబ్ధిపొందగలరు. జాతీయ చట్టాన్ని తమిళనాడు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేయాలని రాష్ట్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారమైనా రేషన్‌కార్డు దారులంతా చౌకధర బియ్యాన్ని పొందేలా మార్పులు చేశారు. ఈ చట్టం ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉన్నా జాతీయ స్థారుులో అనుసంధానం కావడం వల్ల బియ్యం సరఫరాలో రాష్ట్రవాటాతో పాటు కేంద్ర వాటా కూడా చేరుతుంది. జాతీయ చట్టం కింద ఒక కుటుంబంలో ఒక మనిషి మాత్రమే ఉంటే నెలకు 5 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల అందజేస్తోంది. అలాగే ఇద్దరికి 10కిలోలకుగానూ 16 కిలోలు అందజేయడం కొనసాగుతుంది. ఒక కుటుంబానికి రూ.20 కిలోల బియ్యం అందుతుండగా, ఇకపై 25 కిలోల చొప్పున అందజేస్తారు. అలాగే ఒక కుటుంబంలో 7 మంది సభ్యులు ఉంటే 35 కిలోలు, 10 మంది ఉంటే 50 కిలోలు అందజేస్తారు. అంత్యోదయా అన్నయోజన పథకం కింద ప్రస్తుతం అందజేస్తున్న 35 కిలోల ఉచిత బియ్యం యథావిధిగా పొందవచ్చు. -
పోటాపోటీ హక్కుల తీర్మానాలు
ఆజాద్‌పై స్వామి.. రక్షణ మంత్రిత్వశాఖపై కాంగ్రెస్ ♦ పెయిడ్ న్యూస్‌పై చర్చించాలన్న స్వామి ♦ రాజ్యసభలో తన వ్యాఖ్యలు తొలగింపుపై సవాల్ ♦ అగస్టా టెండరు రూల్సు ఎందుకు మార్చారు? సోనియాకు షా ప్రశ్న న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో అధికార, విపక్షాల మధ్య వివాదం రోజురోజకూ ముదురుతోంది. శుక్రవారం ఇరు పార్టీలు రాజ్యసభలో ఒకరిపై ఒకరు సభా హక్కుల తీర్మానాలు ఇచ్చుకున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ మాతృసంస్థ అయిన ఫిన్మెకానికా సంస్థను యూపీఏ హయాంలోనే బ్లాక్‌లిస్టులో పెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌పై సుబ్రమణ్యస్వామి హక్కుల తీర్మానం ఇచ్చారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా రక్షణ మంత్రిత్వ శాఖపై హక్కుల తీర్మానం ఇచ్చింది. పార్లమెంటు సెషన్ జరుగుతుండగా అగస్టా వెస్ట్లాండ్పై ప్రకటన విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధమని ఈ తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు శాంతారామ్ నాయక్, హుస్సేన్ దల్వాయ్ పేర్కొన్నారు. ‘చెల్లింపు’ వార్తలపై చర్చకు డిమాండ్ అగస్టా డీల్ విషయంలో భారత మీడియాలో అనుకూలమైన వార్తలు (పెయిడ్ న్యూస్) వచ్చేలా కొందరు మధ్యవర్తులు ప్రయత్నించారంటూ వచ్చిన వార్తలపై చర్చకు స్వామి రాజ్యసభలో పట్టుబట్టారు. మన ప్రజాస్వామ్యంలో పెయిడ్ న్యూస్ కేన్సర్‌లా మారిందన్నారు. గురువారం కూడా లోక్‌సభలో ఈకేసులో మీడియాను అనుకూలంగా మార్చుకునేందుకు రూ.50 కోట్ల ఒప్పందం కుదిరిందనే విషయంపై దుమారం రేగింది. కాగా, మైనారిటీ సంస్థపై చర్చ విషయంలో తనవ్యాఖలను తొలగించటంపై సుబ్రమణ్య స్వామి రాజ్యసభలో సవాల్ చేశారు. ఈ చర్య నిరంకుశం, అకారణమని సభానియమాలకు విరుద్ధమన్నారు. సోనియాపై మళ్లీ బీజేపీ చీఫ్ విమర్శలు బీజేపీ చీఫ్ అమిత్ షా మరోసారి సోనియా గాంధీపై మండిపడ్డారు. అగస్టా కంపెనీ విషయంలో ఎవరి ప్రోద్బలంతో నిబంధనలు మార్చారని ప్రశ్నించారు. ‘అసలైన తయారీదారులు మాత్రమే టెండరు వేయాలి. కానీ అసలు తయారీ దారైన ఫిమెక్కానికా కాకుండా ఈ డీల్‌కు మధ్యవర్తై అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ టెండరు వేసేలా నిబంధలను ఎవరు ఉల్లంఘించారు? దీనికి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్ సోనియానే వెల్లడించాలి’ అని షా అన్నారు. బీజేపీ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కేంద్రంపై విపక్షాల ‘దళిత’ బాణం దళితుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ విపక్షాలు లోక్‌సభలో ధ్వజమెత్తాయి. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణని ముకుమ్మడిగా విమర్శించాయి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి. హిజ్రాల కోసం బిల్లు హిజ్రాల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ బిల్లుకు సంబంధించి కేబినేట్ నోట్‌ను సామాజిక న్యాయ శాఖ సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. ‘ఆహార భద్రత’పై కేంద్రానికి కాగ్ అక్షింతలు జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాగ్ తీవ్రంగా మండిపడింది. శుక్రవారం పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్లమెంటు ఆమోదం లేకుండానే 3సార్లు ఈ పథకాన్ని ప్రారంభించటంపై అక్షింతలు వేసింది. రైల్వేల్లో ప్రయాణికుల సేవల విభాగంలో నష్టాలను పూడ్చుకోవాల కాగ్ సూచించింది. దీంతోపాటు 2012-15 మధ్యలో జారీచేసిన 27 లక్షల పాస్‌పోర్టులకు సంబంధించిన వివరాలు కేంద్ర విదేశాంగ శాఖ వద్ద లేవని కాగ్ మండిపడింది. కాగా, కాగ్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని, ఇందుకు కాలం చెల్లిన చట్టాల్ని మార్చాలని పీఏసీ ఉప సంఘం సూచించింది. -
రేషన్ గోధుమలు ఇక చౌక
కిలో రెండు రూపాయలకే అందించాలని నిర్ణయం? సాక్షి, హైదరాబాద్: రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించనుంది. గోధుమలను చౌకధరలకు అందించాలని, వాటి పరిమాణం పెంచాలని నిర్ణయించింది. రూ.2కే కిలో గోధుమలను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతోంది. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్రం నిర్ణయించిన ధరల్లో గోధుమలు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. రాష్ట్రానికి అవసరమైన గోధుమలన్నింటినీ కేంద్ర ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్రానికి సమకూర్చనుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ నెల నుంచి కేంద్రం గోధుమలు సరఫరా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణకు 8,260 మెట్రిక్ టన్నుల మేర గోధుమలను కేంద్రం కేటాయించింది. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే అమ్మహస్తం రూ.7కు కిలో చొప్పున కిలో గోధుములు, మరో కిలో గోధుమపిండి సరఫరా చేస్తున్నా వాటికి డిమాండ్ ఉండటం లేదు. 1500 మెట్రిక్ టన్నుల మేర గోధుమలను కొనేందుకు ముందుకు రాకపోవడంతో వాటి స్థానంలో అదనపు బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్రం విన్నవించింది. దీనిపై సానుకూలత తెలపని కేంద్రం గోధుమల సరఫరాకే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 2 కిలోలు, పట్టణాల్లో 5 కిలోల చొప్పున రూ.2కే గోధుమలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఈ ఏడాది నుంచే విద్యా సిరి
= అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన = పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యం = ప్రతిభ ఆధారంగా ఎంపిక = ఈ పథకానికి మరిన్ని నిధులు = ‘అన్న భాగ్య’తో ప్రజా సంక్షేమానికి పెద్దపీట = మతతత్వ శక్తులను అణిచేస్తాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీట్లు లభించని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,500 వంతున చెల్లించడానికి ఉద్దేశించిన విద్యా సిరి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం గురువారం ఆయన సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి ఇంకా నిధులు పెంచుతామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రణాళికా వ్యయం కూడా అనుకున్న మేరకే జరుగుతోందని తెలిపారు. కిలో రూపాయి బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు ఏటా రూ.4,500 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని చెప్పారు. ఈ దశలో...ఏపీఎల్ కార్డుదారులకు బియ్యం లేకుండా చేశారు కదా అని జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి నిష్టూరమాడినప్పుడు, జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చిన తర్వాత, ఏపీఎల్ కార్డులకు బియ్యం ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. తమ ప్రభుత్వం రూ.6,589 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజ వేయలేదని చెప్పారు. కాగా రాజ్యాంగంలో 371 (జే) చేర్పుతో హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా లభించినందున, ఆ ప్రాంతానికి ఎక్కువ నిధులను కేటాయించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని కోరామని వెల్లడించారు. మత తత్వ శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తాం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశంతో కొందరు రాష్ట్రంలో మత ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం అలాంటి శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తుందని హెచ్చరించారు. శాంతి, సామరస్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు. మచ్చ లేని రాజకీయాలు 1978లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి స్వచ్ఛమైన రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చానని తెలిపారు. గతంలో తాను వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల పదవులకు రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈ దశలో బీజేపీ సభ్యుడు బసవరాజ్ బొమ్మయ్ కలుగజేసుకుని తమ భయం కూడా అదేనని పేర్కొన్నారు. ‘మనమిద్దరం ఒకే పార్టీలో పని చేశాం కదా, నా గురించి నీకు తెలుసు కదా బొమ్మయ్’ అని సీఎం అన్నప్పుడు....ఇప్పుడు కూడా అదే విధంగా రాజీనామా చేసేస్తారేమోనని భయపడుతున్నా అని బొమ్మయ్ సమాధానమిచ్చారు. అయితే తాను రాజీనామా చేసే పరిస్థితే రాబోదని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన వక్క సాగును నిషేధిస్తారంటూ బీజేపీ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోను వక్క సాగును నిషేధించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి డీకే. శివ కుమార్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని అంటూ, సంతోష్ లాడ్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. ఈ దశలో బీజేపీ సభ్యులు ‘ఆహా, ఓహో’ అనడంతో ముఖ్యమంత్రి సైతం నవ్వసాగారు.