
ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించరు?: సుప్రీం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్‌జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది.
‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment