పోటాపోటీ హక్కుల తీర్మానాలు | Swamy on azad and congress on Ministry of Defence | Sakshi
Sakshi News home page

పోటాపోటీ హక్కుల తీర్మానాలు

Published Sat, Apr 30 2016 1:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పోటాపోటీ హక్కుల తీర్మానాలు - Sakshi

పోటాపోటీ హక్కుల తీర్మానాలు

ఆజాద్‌పై స్వామి.. రక్షణ మంత్రిత్వశాఖపై కాంగ్రెస్
♦ పెయిడ్ న్యూస్‌పై చర్చించాలన్న స్వామి
♦ రాజ్యసభలో తన వ్యాఖ్యలు తొలగింపుపై సవాల్
♦ అగస్టా టెండరు రూల్సు ఎందుకు మార్చారు? సోనియాకు షా ప్రశ్న
 
 న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో అధికార, విపక్షాల మధ్య వివాదం రోజురోజకూ ముదురుతోంది. శుక్రవారం ఇరు పార్టీలు రాజ్యసభలో ఒకరిపై ఒకరు సభా హక్కుల తీర్మానాలు ఇచ్చుకున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ మాతృసంస్థ అయిన ఫిన్‌మెకానికా సంస్థను యూపీఏ హయాంలోనే బ్లాక్‌లిస్టులో పెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌పై సుబ్రమణ్యస్వామి హక్కుల తీర్మానం ఇచ్చారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా రక్షణ మంత్రిత్వ శాఖపై హక్కుల తీర్మానం ఇచ్చింది. పార్లమెంటు సెషన్ జరుగుతుండగా అగస్టా వెస్ట్‌లాండ్‌పై ప్రకటన విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధమని ఈ తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు శాంతారామ్ నాయక్, హుస్సేన్ దల్వాయ్ పేర్కొన్నారు.

 ‘చెల్లింపు’ వార్తలపై చర్చకు డిమాండ్
 అగస్టా డీల్ విషయంలో భారత మీడియాలో అనుకూలమైన వార్తలు (పెయిడ్ న్యూస్) వచ్చేలా కొందరు మధ్యవర్తులు ప్రయత్నించారంటూ వచ్చిన వార్తలపై చర్చకు స్వామి రాజ్యసభలో పట్టుబట్టారు. మన ప్రజాస్వామ్యంలో పెయిడ్ న్యూస్ కేన్సర్‌లా మారిందన్నారు. గురువారం కూడా లోక్‌సభలో ఈకేసులో మీడియాను అనుకూలంగా మార్చుకునేందుకు రూ.50 కోట్ల ఒప్పందం కుదిరిందనే విషయంపై దుమారం రేగింది. కాగా, మైనారిటీ సంస్థపై చర్చ విషయంలో తనవ్యాఖలను తొలగించటంపై సుబ్రమణ్య స్వామి రాజ్యసభలో సవాల్ చేశారు. ఈ చర్య నిరంకుశం, అకారణమని సభానియమాలకు విరుద్ధమన్నారు.

 సోనియాపై మళ్లీ బీజేపీ చీఫ్ విమర్శలు
 బీజేపీ చీఫ్ అమిత్ షా మరోసారి సోనియా గాంధీపై మండిపడ్డారు. అగస్టా కంపెనీ విషయంలో ఎవరి ప్రోద్బలంతో నిబంధనలు మార్చారని ప్రశ్నించారు. ‘అసలైన తయారీదారులు మాత్రమే టెండరు వేయాలి. కానీ అసలు తయారీ దారైన ఫిమెక్కానికా కాకుండా ఈ డీల్‌కు మధ్యవర్తై అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ టెండరు వేసేలా నిబంధలను ఎవరు ఉల్లంఘించారు? దీనికి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియానే వెల్లడించాలి’ అని షా అన్నారు. బీజేపీ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.  

 కేంద్రంపై విపక్షాల ‘దళిత’ బాణం
 దళితుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ విపక్షాలు లోక్‌సభలో ధ్వజమెత్తాయి. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణని ముకుమ్మడిగా విమర్శించాయి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి.

 హిజ్రాల కోసం బిల్లు
 హిజ్రాల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ బిల్లుకు సంబంధించి కేబినేట్ నోట్‌ను సామాజిక న్యాయ శాఖ సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు.
 
 ‘ఆహార భద్రత’పై కేంద్రానికి కాగ్ అక్షింతలు
 జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాగ్ తీవ్రంగా మండిపడింది. శుక్రవారం పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్లమెంటు ఆమోదం లేకుండానే 3సార్లు ఈ పథకాన్ని ప్రారంభించటంపై అక్షింతలు వేసింది. రైల్వేల్లో ప్రయాణికుల సేవల విభాగంలో నష్టాలను పూడ్చుకోవాల కాగ్ సూచించింది. దీంతోపాటు 2012-15 మధ్యలో జారీచేసిన 27 లక్షల పాస్‌పోర్టులకు సంబంధించిన వివరాలు కేంద్ర విదేశాంగ శాఖ వద్ద లేవని కాగ్ మండిపడింది. కాగా, కాగ్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని, ఇందుకు కాలం చెల్లిన చట్టాల్ని మార్చాలని పీఏసీ ఉప సంఘం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement