= అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
= పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యం
= ప్రతిభ ఆధారంగా ఎంపిక
= ఈ పథకానికి మరిన్ని నిధులు
= ‘అన్న భాగ్య’తో ప్రజా సంక్షేమానికి పెద్దపీట
= మతతత్వ శక్తులను అణిచేస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీట్లు లభించని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,500 వంతున చెల్లించడానికి ఉద్దేశించిన విద్యా సిరి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం గురువారం ఆయన సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి ఇంకా నిధులు పెంచుతామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రణాళికా వ్యయం కూడా అనుకున్న మేరకే జరుగుతోందని తెలిపారు. కిలో రూపాయి బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు ఏటా రూ.4,500 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని చెప్పారు.
ఈ దశలో...ఏపీఎల్ కార్డుదారులకు బియ్యం లేకుండా చేశారు కదా అని జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి నిష్టూరమాడినప్పుడు, జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చిన తర్వాత, ఏపీఎల్ కార్డులకు బియ్యం ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. తమ ప్రభుత్వం రూ.6,589 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజ వేయలేదని చెప్పారు. కాగా రాజ్యాంగంలో 371 (జే) చేర్పుతో హైదరాబాద్-కర్ణాటకకు ప్రత్యేక హోదా లభించినందున, ఆ ప్రాంతానికి ఎక్కువ నిధులను కేటాయించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని కోరామని వెల్లడించారు.
మత తత్వ శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తాం
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశంతో కొందరు రాష్ట్రంలో మత ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం అలాంటి శక్తులను ఉక్కు పాదంతో అణచి వేస్తుందని హెచ్చరించారు. శాంతి, సామరస్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని ఆయన తెలిపారు.
మచ్చ లేని రాజకీయాలు
1978లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి స్వచ్ఛమైన రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చానని తెలిపారు. గతంలో తాను వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వివిధ కారణాల వల్ల పదవులకు రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈ దశలో బీజేపీ సభ్యుడు బసవరాజ్ బొమ్మయ్ కలుగజేసుకుని తమ భయం కూడా అదేనని పేర్కొన్నారు. ‘మనమిద్దరం ఒకే పార్టీలో పని చేశాం కదా, నా గురించి నీకు తెలుసు కదా బొమ్మయ్’ అని సీఎం అన్నప్పుడు....ఇప్పుడు కూడా అదే విధంగా రాజీనామా చేసేస్తారేమోనని భయపడుతున్నా అని బొమ్మయ్ సమాధానమిచ్చారు.
అయితే తాను రాజీనామా చేసే పరిస్థితే రాబోదని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన వక్క సాగును నిషేధిస్తారంటూ బీజేపీ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోను వక్క సాగును నిషేధించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి డీకే. శివ కుమార్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని అంటూ, సంతోష్ లాడ్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. ఈ దశలో బీజేపీ సభ్యులు ‘ఆహా, ఓహో’ అనడంతో ముఖ్యమంత్రి సైతం నవ్వసాగారు.
ఈ ఏడాది నుంచే విద్యా సిరి
Published Fri, Jan 31 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement