సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గురువారం మందలించింది. దీనిపై సీఎం ఇచ్చిన వివరణను తిరస్కరించింది. భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. గత నెల 23న సిద్ధరామయ్య మైసూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీని నర హంతకుడిగా అభివర్ణించారు.
క్షమాపణ చెప్పను..: మోడీ నర హంతకుడని తానెప్పుడూ చెప్పలేదని, మోడీ సర్కారు నర హంతక ప్రభుత్వమని మాత్రమే చెప్పానని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మోడీకి తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చారు.
మైసూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను అనని మాటలకు ఎందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కాగా తనకు వివాహమైనట్లు నామినేషన్‌ను దాఖలు చేసిన సందర్భంగా మోడీ1 అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవని పేర్కొన్నారు.
సీఎంకు ఎన్నికల కమిషన్ మందలింపు
Published Fri, Apr 11 2014 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement