చోటెవరికో?
- అమాత్య యోగంపై ఉత్కంఠ
- అనంత, వెంకయ్యకు అవకాశం?
- ‘అవినీతి’ ముద్ర ఉండటంతో యడ్డికి తిరస్కరణ
- అర్థం కాని మోడీ వ్యూహం
- బీజేపీ రాష్ర్ట నేతలు సతమతం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో గత పర్యాయంతో పోల్చుకుంటే సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, బీజేపీ ఏకంగా 17 స్థానాల్లో గెలుపొందడంతో కేంద్ర మంత్రి వర్గంలో చేరాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. అదే సమయంలో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ మదిలో ఏముందోననే గుబులు కూడా రాష్ట్ర నాయకుల్లో నెలకొంది.
బీజేపీ రాష్ట్ర శాఖ... అనంత కుమార్, యడ్యూరప్ప, సదానంద గౌడ, రమేశ్ జిగజిణగిలకు మంత్రి పదవులను ఇవ్వాలని అధిష్టానానికి సిఫార్సు చేసింది. అయితే కర్ణాటక నుంచి ఒకరిద్దరికి మాత్రమే అవకాశాలున్నాయని సంకేతాలు అందాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచే రాజ్యసభకు ఎన్నికైనందున, ఒక వేళ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా కర్ణాటక కోటా కిందే పరిగణించాలి. అంటే... మరొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి వల్ల అనంత కుమార్‌కు సులభంగా మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకుంటున్నా, మోడీ ఆలోచన వేరే రకంగా ఉందంటున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన ఆయనను ఏవైనా ఒకటి, రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా నియమించాలనే యోచన ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
యడ్యూరప్ప ఇదివరకే తనకు మంత్రి పదవి వద్దని మోడీకి లేఖ రాశారు. ఆయన కావాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు. యూపీఏ సర్కారు అవినీతిపై విస్తృత ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చినందున, యడ్యూరప్ప లాంటి వారిని తీసుకుంటే తలనొప్పులు తప్పవని మోడీ భావిస్తున్నారు. దీనిని గ్రహించే యడ్యూరప్ప పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ తనకు మంత్రి పదవి వద్దని ఆయనకు లేఖ రాశారు.
బిజాపుర నుంచి ఎన్నికైన రమేశ్ జిగజిణగి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎస్‌సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన వరుసగా ఐదో సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయనను మినహాయిస్తే ఎన్నికైన మిగిలిన ఎంపీలలో అంతగా పేరు పొందిన వారెవరూ లేరు. కనుక కర్ణాటకపై మోడీ ఆలోచనలేమిటో తెలియక బీజేపీ నాయకులు కొంత సతమతమవుతున్నారు. కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరిగే సోమవారం నాటికి కానీ దీనిపై స్పష్టత వచ్చే సూచనలు లేవు.