సాధించావప్పా
- ఆలస్యమైనా... నెరవేరిన యడ్డి లక్ష్యం
- జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్ష పదవి
- ప్రకటించిన పార్టీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా
కాస్త లేటైనా యడ్యూరప్ప అనుకున్నది సాధించారు. మొదటి నుంచి నరేంద్ర మోడీతో ఉన్న సత్సంబంధాల వల్ల ఆయన లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. బీజేపీని వీడిన యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకొని రావడంలో, లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నుంచి పోటీ చేయించడంలో మోడీ కీలక పాత్ర పోషించారు. అయితే యడ్డి గెలుపొందినా.. మోడీ మంత్రి వర్గంలో ఆయనకు స్థానం కల్పించలేదు. దీంతో యడ్డిని ఇక పక్కన పెట్టేసినట్లేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడాయనను ఈ పదవి వరించింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీలో కీలకమైన పదవిని సాధించాలనే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. పార్టీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో యడ్యూరప్పకు ఉపాధ్యక్ష పదవి లభించింది. పలు అవినీతి ఆరోపణల వల్ల 2011లో అధిష్టానం ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప, అప్పటి నుంచి పార్టీపై ఆగ్రహంతో ఉండేవారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందున, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని అప్పగించాలన్న ఆయన డిమాండ్‌ను అధిష్టానం అవుననకా, కాదనకా... కాలయాపన చేస్తూ వచ్చింది.
సహనం కోల్పోయిన యడ్యూరప్ప 2012 డిసెంబరులో కర్ణాటక జనతా పార్టీని స్థాపించారు. 2013 మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అన్న చందాన తాను గెలవలేకపోయినా మాతృ సంస్థ బీజేపీని ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టగలిగారు. 32 స్థానాల్లో ఓట్లను చీల్చడం ద్వారా వాటిని కాంగ్రెస్‌కు దఖలు పడేలా చేశారు. ఈ ఫలితాలను చూసిన కమలనాథులు యడ్యూరప్పను అలాగే బయట ఉంచితే పార్టీ పుట్టి మునగడం ఖాయమని గ్రహించారు.
పార్టీ రాష్ట్ర నాయకులు ఆయనను తిరిగి బీజేపీలోకి తీసుకు రావాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అనేక సమావేశాలు, రాయబారాల అనంతరం ఈ ఏడాది జనవరిలో యడ్యూరప్ప తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యడ్యూరప్ప సామర్థ్యాన్ని గుర్తెరిగి, ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు.
తద్వారా పార్టీలో యడ్యూరప్పకు సముచిత ప్రాధాన్యం లభించనుందనే సంకేతాలను వీరశైవ సామాజిక వర్గానికి పంపించడంలో సఫలీకృతులయ్యారు. ఎన్నికల్లో మోడీ యోచన అద్భుతంగా పని చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాదికే ఎన్నికలు వచ్చినందున పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోయినప్పటికీ తొమ్మిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
బీజేపీ ఏకంగా 17 స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచే యడ్యూరప్పకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. మోడీ మంత్రి వర్గంలో ఆయనకు స్థానం లభిస్తుందనుకున్నప్పటికీ, దక్కలేదు. ఇక యడ్యూరప్పను పక్కన పెట్టేసినట్లేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడాయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించింది.
ఆశ ఈడేరింది
ప్రధాని నరేంద్ర మోడీ సహచర్యంలో బీజేపీని బలోపేతం చేయాలనే ఆకాంక్ష నెరవేరిందని యడ్యూరప్ప తెలిపారు. బెల్గాం జిల్లా చిక్కోడి-సదలగ నియోజక వర్గం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యక్ష పదవికి తనను ఎంపిక చేసిన అమిత్ షాను అభినందిస్తానని తెలిపారు. తనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యంగ్యంగా మాట్లాడారని, ఈ నియామకంతో ఆయనకు గుణపాఠం చెప్పినట్లయిందని పేర్కొన్నారు.