- మోడీ మంత్రి వర్గంలో పలువురికి దక్కని చోటు
- అధిష్టానం నుంచి లభించని స్పష్టమైన హామీ
- రిక్త హస్తాలతో బీజేపీ ఎంపీల తిరుగు ముఖం
- పైరవీలు చేయొద్దని సుతి మెత్తగా క్లాస్
- పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని ఉద్బోధ
- సీనియర్ల నేతృత్వంలో మంత్రి వర్గం కూర్పుపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో ఈ నెల 26న ఏర్పడబోయే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో చేరాలని ఆశించిన అనేక మంది ఎంపీలకు నిరాశ ఎదురైంది. మోడీతో పాటు బీజేపీ అధిష్టానం వారి ఆశలపై నీళ్లు చల్లింది. మంత్రి పదవులకు పైరవీలు చేయొద్దని సుతి మెత్తగా వారించింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడలతో పాటు కొత్తగా ఎన్నికైన సురేశ్ అంగడి, శోభా కరంద్లాజె, రాజ్య సభ సభ్యుడు ఆయనూరు మంజునాథ్ ఢిల్లీకి వెళ్లారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన కనిపించక పోవడంతో వారంతా మంగళవారం రాత్రి బెంగళూరుకు తిరుగు ముఖం పట్టారు.
కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసే రోజున తిరిగి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. కర్ణాటక భవన్ సమీపంలోనే ఉన్న గుజరాత్ భవన్‌లో వారంతా మోడీని కలుసుకున్నారు. కేంద్ర మంత్రులు కావాలన్న తమ ఆకాంక్షను ఆయన ముందు బయట పెట్టారు. అయితే మంత్రి పదవుల కోసం పైరవీలు చేయవద్దని మోడీ వారికి సూచించినట్లు తెలిసింది. గుజరాత్‌లో కూడా తాను ఇలాంటి పరిణామాలను ప్రోత్సహించ లేదని చెప్పారని సమాచారం.
పైగా మంత్రి పదవిలో ఏముంటుందని వారినే ప్రశ్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చినందున, పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఉద్బోధించారు. కాగా వీరంతా పార్టీ అగ్ర నాయకులను కలుసుకున్నప్పుడు కూడా సానుకూల స్పందన లభించలేదు.
పార్టీ అధిష్టానానికి ప్రతి నాయకుని బలం, బలహీనతలు తెలుసునని, దానిని బట్టే మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో నిర్ణయమవుతుందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోని సీనియర్లు కొందరు ఇదివరకే మంత్రి వర్గం కూర్పుపై కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది. మోడీ మూడ్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అంతుబట్టదని, కనుక ఆయనతో ఎదురు మాట్లాడకుండా తిరిగి వచ్చేశామని ఢిల్లీకి వెళ్లిన ఎంపీలలో ఒకరు తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, కేంద్ర మాజీ మంత్రి అనంత కుమార్‌లతో కలసి ఢిల్లీకి వెళ్లిన ఎంపీలు రాష్ట్ర ప్రతినిధిబృందంగా అధిష్టానాన్ని, మోడీని కలుసుకున్నారు.