ముళ్లబాటేనా..!
- సీఎం సిద్ధరామయ్యకు అగ్ని పరీక్ష
- పార్టీ లక్ష్యాన్ని అందుకోలేక పోయిన నాయకులు
- నిరుత్సాహాన్ని మిగిల్చిన ఫలితాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే అగ్ని పరీక్షలా ఎదురైన లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చాయి. ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించలేక పోయినందుకు అధిష్టానం ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. కనీసం 20 స్థానాల్లో విజయం సొంతం చేసుకోవాలని, లేన ట్లయితే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధిష్టానం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో అసోంలో పేలవమైన ఫలితాల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేయడం కూడా సిద్ధరామయ్యపై ఒత్తిడి పెంచుతోంది. అధిష్టానం ఆమోదించేదీ, లేనిదీ తర్వాత...ముందుగా నామమాత్రంగానైనా ఆయన రాజీనామా లేఖను పంపించాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు పార్టీలోని అసమ్మతి వాదుల నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలను ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
అధికారంలోకి వచ్చిందిప్పుడే కదా, అంత త్వరగా విమర్శలు చేస్తే ఎలా...చేసినా అధిష్టానం ఊరకుంటుందా అని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన ప్రత్యర్థులు, ఇక విజృంభించనున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా మైసూరులో ఓడిపోవడం సీఎంకు ఊహించని పరిణామం. తన అనుయాయులైన మంత్రులకు మాత్రమే ముఖ్యమంత్రి అండదండలు అందిస్తున్నారని పార్టీలో విమర్శలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీనియర్లను సంప్రదించలేదనే ఆరోపణలున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం సీఎంకు కొంత ఊరట అనే చెప్పాలి. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఆనవాయితీ లేదు. కనుక సీఎం కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఓటమితో సొంత పార్టీలోని ప్రత్యర్థులనే కాకుండా, ఘన విజయం కారణంగా ఉత్సాహంతో ఉరకలేస్తున్న కమలనాథులను ఎదుర్కోవడం సీఎంకు అంత సులభం కాదు.