- సీఎం సిద్ధరామయ్య
- మోడీకి పూర్తిగా సహకరిస్తాం
- ‘అక్రమ-సక్రమ’నియమావళి సిద్ధం
- త్వరలో అమలు చేస్తాం
- రాష్ర్ట రాబడి 13 శాతం పెరిగింది
- విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదు
- త్వరలో పలు ఉద్యోగాల భర్తీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నందున రాజ్యాంగ బద్ధంగా కేంద్రం రాష్ట్రాలకు సహకరించి తీరాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని విధాన సౌధలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సాధన బాటలో ఏడాది-చెప్పినట్లే నడుచుకున్నాం’ పేరిట వివిధ శాఖల సాధనలతో కూడిన 108 పుటల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉండడం కాకతాళీయమని, అయితే అభివృద్ధికి, దీనికి సంబంధం ఉండబోదని అన్నారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నానని చెబుతూ, ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. అదే విధంగా తమకూ సహకారం లభిస్తుందని ఎదురు చూస్తున్నామని చెప్పారు.
అక్రమ-సక్రమకు నియమావళి
బెంగళూరులో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన అక్రమ-సక్రమ పథకానికి నియమావళిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే అక్రమ-సక్రమను అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వ ఏడాది సాధనలను వివరించారు. పన్ను రాబడి తగ్గిందన్న విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదంటూ, 13 శాతం పెరిగిందని తెలిపారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశలవారీ నెరవేరుస్తామని చెప్పారు. దేశంలో అభివృద్ధి సాధించిన తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కర్ణాటకకు చోటుండాలనేది తమ లక్ష్యమన్నారు. గుడిసె రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.
పోస్టుల భర్తీ
రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. ఇంకా 8,500 మంది పోలీసు సిబ్బంది, 816 మంది ఎస్‌ఐలను నియమిస్తామన్నారు. కాగా బెంగళూరు మెట్రో రైలు తొలి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. రెండో దశకు కేంద్రం రూ.26,405 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.