చెత్త ఉద్యోగులపై చర్యలు
- సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక
- ‘బీవీజీ’ నిర్లక్ష్యం వల్లే చెత్త సిటీగా బెంగళూరు
- నిర్లక్ష్యపు గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి
సాక్షి, బెంగళూరు : చెత్త సేకరణ, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. మరోసారి బెంగళూరులో చెత్త సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. స్థానిక మహాలక్ష్మి లే అవుట్‌లో రూ.3 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు చెత్తసిటీగా పేరు తెచ్చుకోవడానికి చెత్త నిర్వహణ పనులు దక్కించుకున్న బీవీజీ సంస్థ నిర్వాహకమే కారణమని ఆరోపించారు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 130 వార్డులో చెత్త తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. ఈ చెత్త నిర్వహణలో విఫలమైన గుత్తేదారులపై చట్టపరమైన చర్యలకు వెనకాడవద్దని అధికారులను హెచ్చరించారు. పన్నుల వసూలు విషయంలో సంబంధిత అధికారులకు విధించించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయూలన్నారు.
ఇకనైనా జాగ్రత్తగా ఉండండి..
వాననీటిలో కొట్టుకుపోయి ఓ చిన్నారి మరణించిన ఘటనకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్షపడలేదని గీతాలక్ష్మి ఉదంతాన్ని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఉటంకించారు. ఇదే సంఘటన పాశ్చాత్య దేశాల్లో జరిగితే సంబంధిత అధికారికి ఎంతటి కఠిన శిక్ష విధించే వారో ఊహించలేనిదని బీబీఎంపీ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హితవు పలికారు. కార్యక్రమంలో మేయర్ శాంతకుమారి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.