Siddharamayya
-
నిర్ణయం బోర్డుదే
బోర్డు నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయి ఆర్బీసీ ఆధునికీకరణపై ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన కర్ణాటకలో ఆన్లైన్ ట్రేడింగ్ విధానం భేష్ : చంద్రబాబు ల్యాండ్‌పూలింగ్ ద్వారా రాజధాని నిర్మాణానికి భూమి సేకరణ ఈ చర్చ వల్ల ఒరిగింది శూన్యమన్న కర్ణాటక నీటిరంగ నిపుణులు బెంగళూరు : తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (ఆర్బీసీ) ఆధునికీకరణకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తుంగభద్ర నదీ జలాల పంపకం కోసం ఏర్పాటైన బోర్డుదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. బోర్డు నిర్ణయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయని వారు తెలిపారు. తుంగభద్ర నదీ జలాల పంపకం విషయమై ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య సోమవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిగాయి. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఆర్బీసీ ఆధునికీకరణ పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక నీరావరి నిగమ్ వద్ద ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం పరిశీలనలో ఉందన్నారు. ఇక్కడ నుంచి టెక్నికల్ సబ్ కమిటీకి అటుపై తుంగభద్ర బోర్డు ముందుకు ఆధునికీకరణ విషయం పరిశీలనకు వస్తుందన్నారు. ఆధునికీకరణకు సంబంధించి బోర్డు నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలు విధిగా అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఆధునికీకరణకు అవసరమైన నిధుల విషయంలో కూడా బోర్డు నిర్ణయం అనంతరం స్పష్టత వస్తుందన్నారు. కాగా, చర్చల అనంతరం వ్యవసాయ రంగంలో కర్ణాటక అవలంభిస్తున్న నూతన విధానాలపై సంబంధిత అధికారులు కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ సమక్షంలో సీఎం చంద్రబాబునాయుడుకు దాదాపు గంటపాటు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంబిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి దీనితో పాటు మరికొన్ని విధానాలను ఏపీలో అమలు చేయనున్నానని తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. డిజైన్‌లో మార్పులేదు - సిద్ధు తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ జరిగినా కాలువ డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుతం 190 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువలో పూడిక పేరుకుపోవడం వల్ల ఏడాదికి 32 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు కోల్పోతున్నాయన్నారు. ఈ పూడిక ఇలాగే కొనసాగితే 32 టీఎంసీలకు అదనంగా ప్రతి ఏటా 0.45 టీఎంసీల నీటిని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఆధునికీకరణ విషయం తుంగభద్ర బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాజా చర్చల్లో కేవలం ఆర్బీసీ ఆధునికీకరణకు సంబంధించిన విషయం మాత్రమే చర్చకు వచ్చిందని... వరద నీటి కాల్వ విషయం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. చర్చల్లో రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదలశాఖ మంత్రులు ఎంబీపాటిల్, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రయోజనం శూన్యం! తుంగభద్ర ఆర్బీసీ ఆధునికీకరణ విషయమై సోమవారం జరిగిన చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని కర్ణాటక నీటిరంగ నిపుణులతోపాటు చర్చల్లో పాల్గొన్న మంత్రులు పేర్కొంటున్నారు. తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు బోర్డుముందుకు తీసుకువెళ్లినా వాటిని కొట్టివేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బోర్డు ముందుకు నేరుగా వెళితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదని భావించడం వల్లనే ఏపీ ప్రభుత్వం నేరుగా కర్ణాటక దగ్గరకు వస్తోందని, అయితే ఈ చర్చల వల్ల కూడా ప్రయోజనం శూన్యమేనని చర్చల్లో పాల్గొన్న ఓ మంత్రి పేర్కొన్నారు. -
నేడు బెంగళూరు, విశాఖలకు ఏపీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు, విశాఖపట్నంలలో పర్యటించనున్నారు. ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు. అక్కడ కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. తుంగభద్ర నుంచి రాయలసీమకు నీటి విడుదలపై చంద్రబాబు చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు బయలుదేరి వెళ్తారు. అక్కడి జన్మభూమి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి. -
ఉండేనా..ఊడేనా?
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై అమాత్యుల ఆందోళన పదవి పోతుందని భయం సీనియర్ల గుండెల్లో రైళ్లు ఐదు లేదా ఆరుగురిపై వేటు నూతన జాబితాకు రాహుల్ ఓకే రాష్ట్ర మంత్రి వర్గానికి త్వరలోనే సర్జరీలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్ మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ సర్జరీల్లో భాగంగా మంత్రి వర్గం నుంచి తమనే తప్పించబోతున్నారా.. అన్న ఆలోచనలు సీనియర్ మంత్రులను వేధిస్తున్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంత మందిని తప్పించబోతున్నాం’ అని స్పష్టం చేశారు. దీంతో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. సీనియర్లే ఎందుకు.... ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండడం వల్ల ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. వీరితో పాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి నుంచి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మంత్రుల పనితీరుకు సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను అడిగిన సందర్భంలో కూడా సిద్ధరామయ్యపై సీనియర్ మంత్రు లు సీరియస్ అయ్యారు. ‘మమ్మల్నే వర్క్ రిపోర్ట్ అడుగుతారా..’ అని కొందరు ప్రశ్నిస్తే, మరికొందరేమో అధికారుల పనితీరు సరిగా లేదు, నిధులు రాలేదు అనే సాకులు చెబుతూ వర్క్ రిపోర్ట్‌ను ఇవ్వలేదు. దీంతో సీనియర్ మంత్రులను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ ఓకే.. ఇక ఢిల్లీ పర్యటన సమయంలో మంత్రి వర్గానికి యువ రక్తాన్ని చేర్చాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను ఆదేశించారు. దీంతో చాలా కాలంగా మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేపట్టేందుకు వేచి చూస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మంత్రి వర్గంలోని ఐదు లేదా ఆరుగురు సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 16న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమయంలో మంత్రి వర్గంలో చోటు కల్పించబోయే వారి జాబితాకు హైకమాండ్ నుంచి ఆమోదం పొందనున్నారని, అనంతరం మంత్రి వర్గ పునర్వవస్థీకరణను చేపట్టనున్నారని తెలుస్తోంది. -
కొంత మందిని తప్పిస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో ఈ వాఖ్యలు చేశారు. -
మరో శిరోభారం
‘వర్క్ రిపోర్టు’ను అడగడంతో సీఎం సిద్ధుపై సీనియర్లు సీరియస్ అధికారులు సహకరించకుండా, నిధులు రాకుండా పనులెలా చేస్తామంటూ సీఎంపై ఆగ్రహం సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో తలనొప్పి వచ్చిపడింది. మంత్రుల పనితీరును తెలుసుకునేందుకు గాను సీఎం సిద్ధరామయ్య మంత్రులను ‘వర్క్ రిపోర్ట్’ను అడగడమే అందుకు కారణం. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరు మంత్రులు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి పనులు చేయడం లేదని, అంతేకాక తమ శాఖల్లోని నిధులను సద్వినియోగం చేయడంపై సైతం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుందని భావించిన పార్టీ హైకమాండ్ మంత్రుల పనితీరుకు సంబంధించిన నివేదికను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేయాలి.. ఎవరెవరిని మంత్రి వర్గం నుంచి తొలగించాలి అన్న అంశాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘వర్క్ రిపోర్ట్’ అందజేయండి.... ఇక హైకమాండ్ ఆదేశాలతో తన మంత్రి వర్గ సహచరులను ‘వర్క్ రిపోర్ట్’ అందజేయాల్సిందిగా సిద్ధరామయ్య కోరారు. పదవిని చేపట్టిన అనంతరం మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు?, ఎన్నిసార్లు కార్యకర్తలతో సమావేశమయ్యారు?, బడ్జెట్లో ప్రకటించిన పనులు ఎంత వరకు అమలు చేశారు? ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తూ ప్రతి మంత్రి నివేదికను అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. అధికారులు సహకరించట్లేదు.... కాగా, తమని వర్క్ రిపోర్ట్ అడగడంపై మంత్రి వర్గంలోని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పనితీరుపై నిఘా ఉంచేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండడం తమకెంతో ఇబ్బందికరంగా ఉందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అంతేకాక ‘పని’ చేసేందుకు తమకున్న ఇబ్బందుల గురించి కూడా వారు సీఎంను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘మా శాఖల్లోని అధికారులు మాకు సహకరించట్లేదు. బడ్జెట్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇంకా పూర్తిగా అందనేలేదు. ఇలాంటి సందర్భంలో మా నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులతో పాటు బడ్జెట్లో ప్రకటించిన పథకాలు ఎలా పూర్తవుతాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా మా పనికి సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను కోరడం, ఆ నివేదిక ద్వారా మా పనితీరును బేరీజు వేయడం ఎంత వరకు సమంజసం’ అని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రుల వర్క్ రిపోర్ట్‌ను అందజేయాల్సిందిగా హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేక, వర్క్ రిపోర్ట్ విషయమై సీనియర్ మంత్రులను సమాధాన పరచలేక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తలపట్టుకున్నారు. -
కీచక పర్వంపైప్రజాగ్రహం
కేంబ్రిడ్జి పాఠశాల ఎదుట ఆందోళనలు భారీ బందోబస్తు ఏర్పాటు నిందితుడు జైశంకర్ అరెస్ట్ సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. విబ్‌గయార్, ఆర్కిడ్ సంఘటనలు మరచిపోకముందే కేంబ్రిడ్జి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ బోధనతో పాటు పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జై శంకర్ అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగుచూసిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో జైశంకర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో శుక్రవారం వెల్లడించారు. మరోవైపు నిందితుడు జైశంకర్‌ను బెంగళూరు న్యాయస్థానంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి అనుమతి మేరకు వారంరోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తు మల్లేశ్వరం ఉపవిభాగం ఏసీపీ సారాఫాతిమా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజా ఘటనల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనిఖీ రోజే ఆకృత్యం... కేంబ్రిడ్జ్ పాఠశాల బెంగళూరు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తుంది. పాఠశాలలో భద్రతా చర్యల కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్పై ఈనెల 28న బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి (బీఈఓ) రమేష్ నేతృత్వంలో కేంబ్రిడ్జ్ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నిందితుడు చిన్నారిని మొదటి అంతస్తులోని బాలుర శౌచాలయంలోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల పరిశీలనలో తేలింది. తర్వాతి రోజు (అక్టోబర్ 29న) కూడా ఇదే విధంగా చిన్నారిపై జైశంకర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి తన జననేంద్రియాల వద్ద సమస్యగా ఉందంటూ తల్లికి చెప్పడంతో ఆమె బాలికను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లింది. వైద్యుల పరీక్షల్లో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. తర్వాత వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సూచనల మేరకు బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక జీవన్‌భీమా నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా విచారణలో శంకర్ ఇంటి వద్ద హిందీ ట్యూషన్లు చెప్పేవాడని తేలింది. ఆ సమయంలో బాధిత విద్యార్థిని తల్లి హిందీ నేర్చుకోవడం కోసం జై శంకర్ వద్దకు గతంలో ట్యూషన్‌కు వెళ్లేవారిని సమాచారం. ఇదిలా ఉంటే నిందితుడి కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండటం గమనార్హం. అగ్నిగోళంగా మారిన ప్రజాగళం... చిన్నారిపై అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేశంతో రగిలిపోయారు. పాఠశాల వద్దకు చేరుకుని నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉదయం ఎనిమిది గంటలకే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అదేవిధంగా 11 గంటల సమయంలో సీ.వీ రామన్‌నగర్ శాసనసభ్యుడు (బీజేపీ) రఘు నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బెంగళూరులో ప్రతి రోజూ ఏదోఒక చోట పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి కే.జేజార్జ్తోపాటు సీఎం సిద్ధరామయ్య తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రఘు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పాఠశాల యాజమాన్యానికి చెందిన ఒక్కరు కూడా అటు విద్యాశాఖకు కానీ ఇటు పోలీసుశాఖకు కానీ అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం పాఠశాల పునఃప్రారంభం! పాఠశాల విద్యార్థినిపై అత్యాచార విషయం గురువారం రాత్రి వెలుగులోకి రావడంతో పాఠశాల యాజమాన్యం శుక్రవారం స్కూల్‌కు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సంఘటన పట్ల చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో భద్రతా చర్యలు సరిగా లేవ ంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడేంతవరకూ తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తేల్చిచెప్పారు. చివరికి అందరూ కలిసి పాఠశాలను బుధవారం పునఃప్రారంభించడానికి నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. నిర్లక్ష్యపు సమాధానాలు! కేంబ్రిడ్జ్ పాఠశాల ఉదంతం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కే.జే. జార్జ్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాజిక వేత్తలతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వ్యాఖ్యలు ప్రజలను కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి అద్ధం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత : పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లో జరిగే అత్యాచారాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆయా పాఠశాలల యాజమాన్యానిదే బాధ్యత. అయితే అకృత్యానికి పాల్పడినవారు ఎవరైనా చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తాం. - సీఎం తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత: పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల రక్షణ విషయంపై ఎక్కువ దృష్టి సారిస్తే ‘కేంబ్రిడ్’్జ వంటి ఘటనలు పునరావృతం కావు. ప్రతి చోటుకూ వెళ్లి పోలీసులు రక్షణ కల్పించడానికి వీలుకాదుకదా? - హోంశాఖ మంత్రి -
చర్చలు సఫలం
వైద్యుల డిమాండ్లకు సర్కార్ ఓకే 14 డిమాండ్లలో పదింటికి అంగీకారం రాజీనామాలను వెనక్కు తీసుకున్న డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదంటూ మండిపాటు నేడు కోర్టుకు హాజరుకావాలంటూ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడికి ఆదేశం సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ప్రభుత్వ వైద్యుల సంఘం, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాము ఇచ్చిన రాజీనామాలను వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు అంగీకరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది సోమవారం నుంచి రెండు రోజులు సామూహిక రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. సమస్యల పరి ష్కారం కోసం ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ అధ్యక్షతన పలుదఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కనబడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వైద్యుల 14 డిమాండ్లలో పదింటిని పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య క్షమాపణలు కూడా చెప్పారు. ఇకపై వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాకు కాని, రాజీనామాలకు కాని పాల్పడకూడదన్నారు. ఏ విషయమైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు విరుద్ధంగా జరిగి తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్యవసర సేవల పరిధిలో ఉన్న వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగితే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించకుండా ఎందుకు ఊరికే ఉన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు సామూహిక రాజీనామాలకు దిగుతున్న నేపథ్యంలో వారి లెసైన్సులను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్పీ అమృతేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కేఎల్ మంజునాథ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వైద్యుల సామూహిక రాజీనామాలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘డిమాండ్ల పరిష్కారం కోసమంటూ ప్రభుత్వ వైద్యులు ప్రతిసారీ ఇలాగే రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించలేదు. అత్యవసర సేవల పరిధిలోని వైద్యులు సమ్మెలకు దిగిన సందర్భాల్లో ఎస్మాను తప్పక ప్రయోగించాల్సిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం ఎందుకు పాటించలేదు. ఈ విషయంలో ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసును ఎందుకు నమోదు చేయకూడదు’ అంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యాజ్యంపై విచారణను గురువారానికి వాయిదా వేయడంతో పాటు ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య స్వయంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. -
అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం వెనకడుగు....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని చర్చించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. హాసనలోని హాసనాంబ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గృహనిర్మాణ సహకార సంఘానికి చెందిన ఇళ్ల పంపిణీలో తాను అక్రమాలకు పాల్పడ్డానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపితే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని, స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై విమర్శలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నభాగ్య పధకం పూర్తిగా విఫలమైందని, అన్నభాగ్య పథకం పూర్తిగా ధనవంతులు, దళారులకు ప్రయోజనాలు చేకూరుస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. డి.కె.శివకుమార్ అద్దాల మేడలో కూర్చున్నారని, అక్రమంగా ఆస్తులను సంపాదించడంతో పాటు ఆ సంపదతో మంత్రి పదవిని కూడా పొందారని మండిపడ్డారు. అదే సందర్భంలో దేవెగౌడ కుటుంబం అద్దాల మేడలో లేదని, వీధుల్లో సామాన్య ప్రజలతోనే వారి సమస్యలను చర్చిస్తూ ఉందని అన్నారు. జేడీఎస్‌లో 11 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీని రూపొందించామని, మరో రెండు మూడు రోజుల్లో కోర్ కమిటీలోని సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కోర్ కమిటీని ప్రకటించిన అనంతరం జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందువల్ల త్వరలోనే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో కలిసి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. -
నిబంధనలకు నీళ్లు
సాక్షి, బెంగళూరు : పాఠశాలల్లో అత్యాచారాలు, పిల్లలపై భౌతిక దాడులను అరికట్టడానికి వీలుగా పోలీస్ శాఖ ఆగస్ట్‌లో రూపొందించిన భద్రతా చర్యలను రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. దీంతో ‘విబ్‌గయార్’ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం మరో బాలికపై అత్యాచారం జరిగడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు పోలీసు శాఖ సూచనలు పాటిస్తే ఆర్థికంగా అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనేది పాఠశాల యాజమాన్యం వాదన. ఇక గత జూలైలో బెంగళూరులోని విబ్‌గయార్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలిక పై అదే పాఠశాలలో స్కేటింగ్ ఇన్‌స్ట్రక్షర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సిద్ధరామయ్య ప్రభుత్వం పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసు శాఖ ప్రైవేటు పాఠశాలలకు కొన్ని నూతన మార్గదర్శకాలను సూచించింది. వీటిని అమలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 30 వరకూ సమయం కూడా ఇచ్చింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మాత్రం వీటిని అమలు చేయడం పట్ల విముఖత ప్రదర్శిస్తోంది. పోలీసుశాఖ ఇచ్చిన గడువు పూర్తయి దాదాపు రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు పాఠశాల్లో కనీసం 20 శాతం సంస్థలు కూడా సూచనలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసు శాఖ ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దడం సరికాదని నగరంలోని విశ్వ పబ్లిక్ స్కూల్ సంస్థ డెరైక్టర్ వివేక్ పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు శాఖ సూచనలు ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్నవని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం చెబుతోంది. పోలీసు శాఖ చేసిన చేసిన సూచనల్లో ముఖ్యమైనవి కొన్ని... పాఠశాలల్లో సీసీ కెమరాలు తప్పక ఏర్పాటు చేయాలి. విద్యార్థులను రవాణా చేసే వాహనాల్లో తప్పక ఒక మహిళా సహాయకురాలు ఉండాలి. విద్యాసంస్థలోని ఆటమైదానాల్లో ఇరవైనాలుగు గంటల పాటు తప్పక సెక్యూరిటీ గార్డ్ల పహారా ఉండాలి. పాఠశాల సిబ్బంది వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. కొత్తగా విధుల్లో చేరే వారితోపాటు ఉద్యోగం వదిలి వెళ్లిన సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలి. పాఠశాలల్లో జరిగే ఉత్సవాలు, ముఖ్యఅతిథిగా వస్తున్న వారి వివరాలు కనీసం 48 గంటల ముందు పోలీసులకు తెలియజేయాలి. తరుచుగా పాఠశాల పరిసరాల తనిఖీకి పోలీసులను అనుమతించాలి పాఠశాల యాజమాన్యం చెబుతున్న అభ్యంతరాలు... సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. ఈ ఆర్థిక భారాన్ని చివరికి విద్యార్థుల తల్లిదండ్రుల పై వేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ గార్డులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించడానికి ఎక్కువ జీతాలను డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులను రవాణా చేసే వాహనాల్లో డ్రైవర్లగా పురుషులు ఉండటం వల్ల వాహనాల్లో మహిళా ఉద్యోగులను నియమించడం సరికాదు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పాఠశాలలో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఇవ్వడం శ్రమతో కూడుకున్నది. ఇందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాలపై ఆర్థిక భారాన్ని మోపనుంది. తనిఖీ పేరుతో పోలీసులు తరుచుగా పాఠశాలల్లోకి రావడం పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. నివేదిక కోరాను.. విద్యార్థుల రక్షణ కోసం తీసుకోవలసిన రక్షణ చర్యల విషయమై పోలీసు శాఖ రూపొందించిన మార్గదర్శకాలు చాలా పాఠశాలలు పాటించడం లేదు. తాజాగా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఘటన నేపథ్యంలో, పాఠశాలలు పాటిస్తున్న భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డిని ఆదేశించాను. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతాం. - కే.జే.జార్జ్ , రాష్ట్రహోం శాఖ మంత్రి -
జంప్..
బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ముఖ్యమంత్రి సిద్ధుకు షాక్ సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి వరకూ ఆయన వెంట తిరిగిన గుల్బర్గా జిల్లా అళింద నియోజకవర్గ శాసనసభ్యుడు బీఆర్ పాటిల్ తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు సోమవారం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే సరైన విలువ దక్కడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇంకా ఆయన వెంటే ఉండడం సరికాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు. అధికారికంగా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కానున్న నేపథ్యంలో బీఆర్ పాటిల్ సిద్ధరామయ్యను కాదని బీజేపీలో చేరుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ పాటిల్ కర్ణాటక జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పేరుకు ఆయన కేజేపీ శాసనసభ్యుడే అయినా అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో తరుచుగా కనిపించేవారు. యడ్యూరప్ప కేజేపీను వదిలి తిరిగి మాతృ పక్షమైన బీజేపీలో చేరిన సమయంలో కూడా బీఆర్ పాటిల్ తటస్థంగా ఉండిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అంతేకాక అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య వెంట ఎక్కువగా కనిపించేవాడు. అయితే తాజాగా సిద్ధు రాజకీయ స్నేహాన్ని వద్దనుకుని బీఆర్ పాటిల్ బీజేపీ గూటిని చేరనున్నారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
అమలుకు నోచుకోని ‘జ్యోతి సంజీవిని’ నగదు రహిత వైద్య సేవల కోసంఎదురుచూపులు సీఎం ప్రకటించి ఎనిమిది నెలలైనా కార్యరూపం దాల్చని వైనం సాక్షి,బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీని వల్ల ఆ పథకంపై ఆశలు పెట్టుకున్న లక్షల మంది ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు ‘జ్యోతి సంజీవిని’ మినహాయింపు కాదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్య ఖర్చులను ప్రభుత్వ ఉద్యోగులు ఆస్పత్రికి మొదట చెల్లించి ఆపై ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంటుంది (మెడికల్ రీ ఎంబర్స్ మెంట్). తమకు నగదు రహిత వైద్య సేవలు అందేలా నిబంధనల్లో మార్పుచేయాలని చాలా ఏళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించే నిమిత్తం ‘జ్యోతి సంజీవిని’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేస్తామని సిద్ధరామయ్య ఈ ఏడాది (2014-15) బడ్జెట్ లో ఆర్భాటంగా ప్రకటించారు. 30 లక్షల మంది ఎదురు చూపులు ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 5,54,036 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ‘జ్యోతి సంజీవిని’ పథకం అనుసరించి ఉద్యోగి, అతని భాగస్వామి, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ పథకం అమలుకు మాత్రం నోచుకోలేదు. ముఖ్యంగా గ్రూప్ సీ, డీ తదితర కిందిస్థాయి సిబ్బంది వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పథకం అమలు కోసం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్యను ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. ఈ పనిని సిబ్బంది, పరిపాలన నిర్వహణ శాఖకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నా.. రేపు, ఎల్లుండి అని సంబంధిత అధికారులు తిప్పించుకుంటున్నారని రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ‘జ్యోతి సంజీవిని’ అమలు కోసం ఏర్పాటు చేసిన సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బోరేగౌడ మాట్లాడుతూ... ‘జ్యోతి సంజీవిని పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. మానవ వనరుల కొరత, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. త్వరలో పథకాన్ని అమలు చేస్తాం’ అని తెలిపారు. -
కార్పొరేషన్లు, బోర్డులకు ప్రాధాన్యం
మండ్య: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మొదట కార్పొరేషన్లు, బోర్డు ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పాండవపుర తాలూకా బన్నంగాడి గ్రామంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లు, బోర్డుల్లో నియమాకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలోనే అభ్యుర్థులను నియమించడానికి అన్ని చర్య లూ తీసుకున్నామన్నారు. త్వరలోనే జాబితా విడుదల చేస్తామని చెప్పా రు. బోర్డుల నియామకం అనంతరం మంత్రి వర్గ విస్తరణను చేపడతామని వివరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడిపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే ఆమె దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. అధికారుల నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నగరంపై ఉగ్రవాదులు దృష్టిసారించిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ఐసీఎస్ ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసిన విషయం తెలిసిందన్నారు. ఉగ్రవాదుల దాడికి ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. -
ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను పారిశ్రామిక రంగంలో సృష్టించాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో కూడా స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (ఇండస్ట్రియల్ పాలసీ) సీఎం సిద్ధరామయ్య శుక్రవారం సాయంత్రం విధాన సౌధాలోని బాంక్వెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నూతనంగా రూపొందించిన పాలసీ ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు (2014-2019 వరకూ) అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రూ. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 15 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పాలసీను అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్ధతిలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసే విధానాన్ని మొదటి సారిగా ఇదే పాలసీలో పొందుపరిచామన్నారు. ప్రతి ఏడాది ఒక్కొక్కటి 5,000 నుంచి 8,000 ఎకరాల విస్తీర్ణంలో కనిష్టంగా ఐదు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా పరిశ్రమల స్థాపన మైనింగ్ రంగంతో ముడిపడి ఉంటుందన్నారు. అందువల్ల నూతన మైనింగ్ పాలసీను రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో ఏరోస్పేస్, మిషన్టూల్, స్టీల్, సీమెంట్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అతిచిన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని కూడా రెట్టింపు చేశామన్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన తరగతులు, మహిళలు, వికలాంగులకు, విశ్రాంత సైనికులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఎక్కువ సబ్సిడీలు కల్పించనున్నామన్నారు. అదేవిధంగా పరిశ్రామిక వాడకు కేటాయించిన మొత్తం భూమి విస్తీర్ణంలో 22.5 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి తప్పక కేటాయించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించమని తెలిపారు. అదే విధంగా నూతన పాలసీ వ్యవధి లోపు రెండు పారిశ్రామిక వాడలను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పారిశ్రామిక వాడ విస్తీర్ణంలో ఐదు శాతాన్ని వారికి తప్పక కేటాయిస్తామని సిద్ధరామయ్య వివరించారు. -
అన్యాయం
కార్మిక చట్టాలను మార్చడంపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకే లబ్ధి అని ఆరోపణ కేంద్ర ప్రభుత్వ చర్యలపై మండిపాటు కార్మికుల సంక్షేమంపై తమకూ ప్రత్యేక శ్రద్ధ ఉందన్న కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి, బెంగళూరు : అనేక సంవత్సరాలుగా ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంపై కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన మార్పుల వల్ల కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాల్లో మార్పులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే పై విధంగా స్పందించారు. శుక్రవారమిక్కడి వసంతనగర్‌లో నవీకరించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌ల కాలంలో రూపొందించినవని చెప్పారు. ఈ చట్టాల్లో ఏవైనా చిన్నపాటి సవరణలు చేయవచ్చు కానీ పూర్తిగా చట్టాలనే మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఇప్పుడున్న కార్మిక చట్టాలతోనే జీడీపీ 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, జీడీపీ నెపాన్ని చూపుతూ కార్మిక చట్టాల్లో మార్పులకు సన్నద్దం కావడం సరికాదని అన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుపై మరోసారి ఆలోచించాల్సిందిగా ప్రధానికి సూచించాలని అదే వేదికపై ఉన్న కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను ఖర్గే కోరారు. అనంతరం కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ టీ అమ్ముకుంటూ ప్రధాని స్థానానికి చేరుకున్నారని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల గురించి త్వరలోనే కేంద్ర కార్మికశాఖ మంత్రితో చర్చిస్తానని అనంతకుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రి ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధూ వేస్ట్..
ఆయనో అసమర్థ ముఖ్యమంత్రి చెరుకు రైతుకు అందని మద్దతు ధర దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక స్థితి కరువు బాధితులను ఆదుకోవడం పూర్తిగా విఫలం మాజీ సీఎం, ఎంపీ యడ్యూరప్ప ధ్వజం సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసమర్థతే అందుకు కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బెల్గాంలో గతంలో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన చెరుకు మద్దతు ధర ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. మొదట ఆ బాకీ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సిద్ధరామయ్య త్వరలో జరగబోయే బెల్గాం చట్టసభల్లో పాల్గొనాలని ఘాటు వాఖ్యలు చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పన్నుల వసూలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసే స్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమనంలో ప్రయాణిస్తోందని విమర్శించారు. అతివృష్టి వల్ల పంటలు, పశువులు, ఇళ్లను కోల్పోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కరువు తాలూకాలు ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. కరువు ప్రాంతాల్లో ప్రజలకు మేలుచేకూరే పనులు ఒక్కటి కూడా జరగడం లేదని విమర్శించారు. అధికారులపై తరుచుగా ఆగ్రహం వ్యక్తం చేసే బదులు వారి ఆలోచనలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని యడ్యూరప్ప సీఎం సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జలాశయాలు దాదాపు గరిష్ట నీటిమట్టాన్ని కలిగి ఉండి అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా కూడా ప్రజలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటుండటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇందుకు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ సమాధానం చెప్పితీరాలని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చెత్త ఉద్యోగులపై చర్యలు
సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక ‘బీవీజీ’ నిర్లక్ష్యం వల్లే చెత్త సిటీగా బెంగళూరు నిర్లక్ష్యపు గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి సాక్షి, బెంగళూరు : చెత్త సేకరణ, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. మరోసారి బెంగళూరులో చెత్త సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. స్థానిక మహాలక్ష్మి లే అవుట్లో రూ.3 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు చెత్తసిటీగా పేరు తెచ్చుకోవడానికి చెత్త నిర్వహణ పనులు దక్కించుకున్న బీవీజీ సంస్థ నిర్వాహకమే కారణమని ఆరోపించారు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 130 వార్డులో చెత్త తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. ఈ చెత్త నిర్వహణలో విఫలమైన గుత్తేదారులపై చట్టపరమైన చర్యలకు వెనకాడవద్దని అధికారులను హెచ్చరించారు. పన్నుల వసూలు విషయంలో సంబంధిత అధికారులకు విధించించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయూలన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.. వాననీటిలో కొట్టుకుపోయి ఓ చిన్నారి మరణించిన ఘటనకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్షపడలేదని గీతాలక్ష్మి ఉదంతాన్ని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఉటంకించారు. ఇదే సంఘటన పాశ్చాత్య దేశాల్లో జరిగితే సంబంధిత అధికారికి ఎంతటి కఠిన శిక్ష విధించే వారో ఊహించలేనిదని బీబీఎంపీ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హితవు పలికారు. కార్యక్రమంలో మేయర్ శాంతకుమారి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాకీ గతేంటి?
అధికారుల తీరుపై సీఎం సిద్ధు సీరియస్ మీ నిర్లక్ష్యంతో మాకు ఇబ్బందులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష నిర్వహించాలి జిల్లా ఇన్చార్జ మంత్రి గైర్హాజర్ అయితే చర్యలు పన్నుల వసూలుపై నిర్లక్ష్యం వీడండి సహాయక చర్యల్లో అవకతవకలు, జాప్యం చేయొద్దు సాక్షి, బెంగళూరు : కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తుండటంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులోని విధానసౌధాలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. అందులో వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అధికారుల తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నిర్ధిష్ట సమయంలోపు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం సరిగా విధులు నిర్వహిస్తే ప్రజల సమస్యల్లో 80 శాతం అప్పటికప్పుడు పరిష్కారమవుతాయన్నారు. ఇందు కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రులతో పాటు కలెక్టర్లు రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొనని జిల్లా ఇన్చార్జ్ మంత్రుల పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పన్నులు వసూలు చేయండి.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో అనుకున్నంత మేరకు పన్నులు వసూలు కావడం లేదని సిద్ధరామయ్య సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఖాతా పొందన భవన యజమానులు చాలా ఏళ్లుగా పన్నులు కట్టకున్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. పన్నుల రాబడి పెంచడం కోసం ఎన్ని సమావేశాలు నిర్వహించామన్నది ముఖ్యం కాదని.. ఎంత పన్నులు వసూలు చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. ఇక అభివృద్ధి పనుల్లో కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఇందుకు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లే ప్రత్యక్ష ఉదాహరణమని అసహనం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి ఏర్పడిన వైనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సహాయ చర్యలకు అవసరమైన నిధుల కొరత లేదని అధికారులకు స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్నవారికి ప్రత్యాన్మాయ పనులు చూపించడంలో విఫలమైతే వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అవకతవకలు జరిగినా, ఆలస్యమైనా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. -
గుండె దడ!
పదవుల పంపకంపై సమావేశం నేతలతో చర్చించిన సిద్ధు, పరమేశ్వర్ ఎన్నికల్లో ఓడినవారిని గుర్తించాలని పలువురి విజ్ఞప్తి సామర్థ్యాన్ని బట్టి కేటాయిస్తామన్న సీఎం ఓడిన అందరికీ కేటాయించలేమన్న కేపీసీసీ చీఫ్ సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేతల్లో గుండె దడ పెరిగిపోతోంది. ఆశించిన పదవులు దక్కుతాయో లేదో అన్న ఆందోళన ఆశావహుల్లో చోటు చేసుకోగా, పదవులు కట్టబెట్టడంలో ఏమైనా పొరబాట్లు జరిగితే పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదముందని అగ్రనేతలతో దడ మొదలైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తమకూ తగిన ప్రాధాన్యతనివ్వాలంటూ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్‌తో నెల నరేంద్రబాబు, బి.ఎల్. శంకర్, అంజనామూర్తితో సహ 60 మంది ఆదివారం సమావేశమై తమ ప్రధాన డిమాండ్‌ను వినిపించారు. తమ అభ్యర్థనను మన్నిస్తే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకునేందుకు అవకాశముంటుందని సూచన చేశారు. అతి తక్కువ ఓట్ల తేడాతో తాము ఓటమి పాలయ్యామని, ఈ విషయాన్ని గమనిస్తే తమకు నైతికంగా ప్రజల మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోందని వివరించారు. ఎమ్మెల్యేలకు మాత్రమే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యతనివ్వడం సబబుగా లేదని పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విడుదల, ప్రభుత్వ కార్యాక్రమాల్లో వారికే పెద్ద పీట వేస్తున్నారని నిష్టూరమాడారు. కనీసం నామినేటెడ్ పోస్టుల విషయంలోనైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ... శక్తిసామర్థ్యాలను బట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇదే సమయంలో పరమేశ్వర్ మాట్లాడుతూ.. ఓటమి పాలైనవారందరికీ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే స్థానికంగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మొత్తం పోస్టుల్లో 30 శాతం వరకూ కేటాయిస్తామని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని సీనియర్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో తాము ఆశించిన పదవులు దక్కలేదన్న అక్కసుతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. -
.. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : అక్రమాస్తుల కేసులో ఇక్కడి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కారాగార వాసాన్ని అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆ రాష్ట్ర జైలుకు తరలించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయం కృష్ణాలో మంగళవారం ఆయన జనతా దర్శన్‌లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయను తమిళనాడు జైలుకు తరలించాలని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే బెంగళూరులో జయ కేసు విచారణ జరిగిందే తప్ప, రాష్ట్రం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. జయను జైలు నుంచి విడుదల చేయకపోతే కన్నడిగులను ముట్టడిస్తామని తమిళనాడులో కొందరు హెచ్చరించడం సరికాదని హితవు పలికారు. మనమంతా సమైక్య వ్యవస్థలో నివసిస్తున్నందున రాష్ట్రంలోని తమిళులకు, తమిళనాడులోని కన్నడిగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కాగా విజయ దశమి సందర్భంగా చాముండి దేవికి పూలమాల వేసే సందర్భంలో తాను బూట్లు ధరించానని కొన్ని ఛానెళ్లు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. తాను సాక్స్ మాత్రమే ధరించానని, దీనిపై ఆ ఛానెళ్లకు నోటీసులిస్తానని వెల్లడించారు. -
ఆగని విమర్శలు
సాక్షి, బెంగళూరు : మహాత్ముడి విగ్రహావిష్కరణకు సంబంధించి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తిపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిచి తప్పుచేశాం’ అని ఘాటుగా స్పందించారు. విధానసౌధ, వికాస సౌధ మధ్య ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహవిష్కరణ గురువారం జరిగింది. ఇందుకు ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్పీకర్ కాగోడు తిమ్మప్ప, మండలి అధ్యక్షడు శంకరమూర్తితో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు చక్రవర్తి సూలిబెరె ప్రసంగించారు. అనంతరం కేపీసీసీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకకు సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ... గాంధీజీ ని ఆర్ఎస్ఎస్ పొట్టన బెట్టుకుందని, ఆ సంస్థకు చెందిన చక్రవర్తిసూలిబెరెను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకుడిగా ఆహ్వానించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఆయన ప్రసంగించిన చాలా ప్రాంతాల్లో మతఘర్షణలు జరిగిన విషయం ప్రభుత్వం ృష్టికి రాలేదా? అని నిలదీశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో యుద్ధభయం పెరుగుతోందపి వీరప్పమొయిలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన అనుసరిస్తున్న విదేశాంగ విధానాలే కారణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ చక్రవర్తి సూలిబెరెను కార్యక్రమానికి ఆహ్వానించి తప్పు చేశామన్నారు. ఆయన కార్యక్రమానికి వస్తున్నట్లు తనకు ముందు తెలియదన్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను మండలి అధ్యక్షుడు శంకరమూర్తికి అప్పగించి పొరపాటు చేశామన్నారు. అయితే కార్యక్రమం మధ్యలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించడం మహాత్మాగాంధీని అవమానించినట్లవుతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయానని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. కాగా, అంతకు ముందు విగ్రహవిష్కరణ సందర్భంగా మాట్లాడిన సిద్ధరామయ్య జాతి, కుల, మత వర్గాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలనుృసష్టించాలని ప్రయత్నిస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అహింసను బోధించిన గాంధీ మహాత్ముని మార్గంలో పయనించినప్పుడే శాంతియుత జీవనానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా విగ్రహ రూపకర్తలు రామ్ వీ. సుతార్, ఆయన కుమారుడు అనిల్ ఆర్ సుతార్‌లను మండలి అధ్యక్షుడు డీ.హెచ్ శంకరమూర్తి మైసూరు పేటా, శాలువాతో సత్కరించారు. -
ఆవిష్కరణ వివాదం
ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం ఆహ్వాన కమిటీ చైర్మన్ శంకరమూర్తిపై విమర్శలు ప్రొటోకాల్ మేరకే ఆహ్వానమన్న మండలి అధ్యక్షుడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వాటల్ వినతి గాంధేయవాదులను విస్మరించారని ఆరోపణ ఆహ్వాన పత్రికలో నగర ప్రథమ మహిళ పేరును ప్రస్తావించకపోవడంపై అసహనం సాక్షి, బెంగళూరు : జాతిపిత విగ్రహావిష్కరణ కార్యక్రమం నేతల మధ్య వివాదానికి తెరలేపింది. విధానసౌధ, వికాససౌధ మధ్య 22 అడుగుల ఎత్తై గాంధీ విగ్రహాన్ని నేడు(గురువారం) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ప్రోటోకాల్‌కు తిలోదకాలిచ్చారంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమాలను విస్మరించారని అసహనం వ్యక్తంచేశారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం శివాజీనగర నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేనైన తానే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని శాసన మండలి అధ్యక్షుడు డి.హెచ్.శంకరమూర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారని మండిపడ్డారు. కాగా, అసెంబ్లీ, మండలి సభా కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక చానల్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతి తెలిపారని అన్నారు. త్వరలో చానల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ప్రోటోకాల్ మేరకే ఆహ్వానం మహాత్ముడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించే విషయంలో తాము పారదర్శకంగానే ఉన్నామని విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రాష్ట్ర మంత్రి రోషన్‌బేగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆవిష్కరణకు సంబంధించి తన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పారదర్శకంగానే వ్యవహరిస్తోందని అన్నారు. శాసనసభ, మండలి విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, ఎస్ఎం ృ ష్ణను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కొద్ది మంది పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు చెప్పారు. విగ్రహావిష్కరణను వాయిదా వేయండి గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని శాసనమండలి అధ్యక్షుడు డీహెచ్ శంకరమూర్తిని మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విధానసౌధలో శాసనమండలి అధ్యక్షున్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలోని గాంధేయవాదులతోపాటు అర్హులైన చాలామందిని ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. అంతేకాక ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లను ముద్రించక పోవడం వల్ల వారికి అవమానం జరిగిందని చెప్పారు. నగర ప్రథమ మహిళ, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి పేరు కూడా ఆహ్వాన పత్రికలో లేకపోవడం ఇందుకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రోటోకాల్ పాటిస్తూ అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. -
ప్రతి ఇంటికీ సైన్స్
అన్ని జిల్లాల్లో విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి మూఢ నమ్మకాలతో సమాజాభివృద్ధి కుంటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళూరులోని పిలికులలో బుధవారం ఆయన ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ విజ్ఞాన శాస్త్రం ప్రతి ఇంటి ముంగిట చేరాలని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ఉద్బోధించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని చెప్పారు. మూఢ నమ్మకాలను ఇంకా ఆచరిస్తూ ఉంటే సమాజం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. బసవన్న లాంటి వారు కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించారని గుర్తు చేస్తూ, అనేక మంది ఇంకా జన్మ, పునర్జన్మలను విశ్వసిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత జన్మ, వచ్చే జన్మ అంటూ ఉండదని, వాటి గురించి ఎవరికీ తెలియదని అన్నారు. బసవన్న వాస్తవాన్ని స్వర్గంగా, మూఢ నమ్మకాన్ని నరకంగా అభివర్ణించారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 51 ఏహెచ్ అధికరణకు సవరణను తీసుకొచ్చారని తెలిపారు. అయినప్పటికీ మనం అడుగు ముందుకు వేయలేక పోతున్నామని, తద్వారా సమాజం వృద్ధి చెందలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళయానం విజయవంతంగా పూర్తయిందని, తొలి ప్రయత్నంలోనే సఫలం కావడం ద్వారా ప్రపంచ పటంలో ఇండియా లీడర్‌గా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించదల్చితే, కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రమానాథ్ రై ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పాయి. -
బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు
సీఎం సిద్ధరామయ్య సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.850 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలను, జిల్లా ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అనేక సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ బళ్లారి తాలూకాలో రెండు రోజుల పాటు ఉండి తన శాఖ పరిధిలో బళ్లారి జిల్లాకు రూ.204 కోట్ల నిధులు కావాలని కోరారన్నారు. ఆయన కోరిన విధంగా బళ్లారి జిల్లాకు నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేశానన్నారు. ప్రస్తుతం బళ్లారి జిల్లాకు రూ.850 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేశామని, ఇందులో రోడ్లు, మంచినీటి సమస్య తీర్చేందుకు, విద్యుత్, ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారన్నారు. మంచినీటి సమస్య ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. బళ్లారి తాలూకాలోని సిరివార, చాగనూరు వద్ద విమానాశ్రయ నిర్మాణం గురించి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వ్యతిరేకించానని, అయితే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని భూమిని కొనుగోలు చేసిందన్నారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ మా లేక మరేదైనా నిర్మాణం చేపట్టాలా? అనే విషయంపై ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డీకే శివకుమార్, అంబరీష్, పరమేశ్వరనాయక్, ఉమాశ్రీ పాల్గొన్నారు. -
ఆధునికత దిశగా వ్యవసాయం
సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు. -
మేము కాదు!
జయలలితకు శిక్ష ప్రకటనపై కర్ణాటకకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరప్పన అగ్రహార ఎదుట జయలలిత మద్దతుదారుల నిరసన తమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేత సాక్షి, బెంగళూరు : అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడటానికి కర్ణాటక ఏమాత్రం కారణం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కేసు విచారణ జరిగినందువల్లే జయలలితకు శిక్ష పడిందంటూ తమిళనాడులో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య ఈ విధంగా సమాధానమిచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదని అన్నారు. అసత్య వదంతులను నమ్మి శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి విధానసౌధ ఎదుట నిర్వహించిన యువచేతన బైక్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానంలో జరిగిన విచారణలో జయలలిత దోషి అని తేలిందని, ఇందులో కర్ణాటక ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. అనవసరంగా కర్ణాటకనుగానీ, ఇక్కడి ప్రభుత్వాన్ని గానీ ఈ విషయానికి సంబంధించి బాధ్యులను చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు. పరప్పన ఎదుట ఆందోళన.... ఇక పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమ నాయకురాలు జయలలితను కలిసేందుకు ఆదివారం తమిళనాడు రాష్ట్ర మంత్రులతో పాటు వందల సంఖ్యలో మద్దతుదారులు, అన్నా డీఎంకే కార్యకర్తలు వచ్చారు. అయితే వీరిని జైలులోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ కాసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తమ ‘అమ్మ’ లేకుండా తమిళనాడు రాష్ట్రం అనాధ అయిపోయిందంటూ పరప్పన అగ్రహార వద్దకు చేరుకున్న మహిళలు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు జయలలిత మద్దతుదారులందరినీ అక్కడినుండి పంపివేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. కేఎస్ఆర్టీసీ బస్‌ల నిలిపివేత.... ఇక అన్నాడీఎంకే అధినేత్రికి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లే అన్ని బస్ సర్వీసులను కేఎస్ఆర్టీసీ నిలిపివేసింది. జయలలితకు శిక్షను ఖరారుచేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్‌లకు ఏదైనా హాని కలగవచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తరువాత బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.