ఆప్ ఉద్యమ బాట
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో అవినీతిపరులైన రాజకీయ నేతలు, అధికారుల సంఖ్య పెరిగిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ ప్రతినిధి రవికృష్ణారెడ్డి మాట్లాడుతూ.... బీజేపీ ప్రభుత్వంలో అవినీతి కార్యకలాపాలు అధికం కావడంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతి పరులకే మద్దతు తెలపడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సామాన్యుడికి ఏ పని కావాలన్నా డబ్బు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు చేరక వారి పరిస్థితి దుర్భరంగా మారిందని అన్నారు. అందుకే ఆప్ ఆధ్వర్యంలో నేటి(శనివారం) నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘అవినీతి పరులారా అధికారాన్ని వదలి పోండి’ నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.