వ్యూహం మార్చిన ఆప్!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల రాజోరీ గార్డెన్ ఉప ఎన్నికలో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార వ్యూహాన్ని మార్పు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారం చేయడానికి బదులు తమ ప్రభుత్వ పనితీరును, హామీలను గురించి ప్రచారం చేయాలని ఆప్ నిర్ణయించింది. ఆప్ ప్రభుత్వం నీటి బిల్లును మాఫీ చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే హౌస్ టాక్స్‌కు మాఫీ చేస్తామని ఆప్ ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి.
రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు ఇప్పుడు ఎమ్సీడీ ఎన్నికల్లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల కోసం పాటించిన వ్యూహాన్నే ఇక పాటించాలని ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవల నిర్ణయించింది. 49 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించుకుని ఆప్ 2015 ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గడనానికి కూడా రెండు సంవత్సరాల్లో ఆప్ ప్రభుత్వం చేసిన పనులను వివరించాలని పార్టీ నిర్ణయించింది.
మోదీ ప్రభజంనం బలంగా ఉన్నందువల్ల ఆయన వ్యతిరేక ప్రచారం చేసినట్లయితే తమకు ఎదురు దెబ్బ తగలవచ్చన్న విషయాన్ని ఆప్ యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల ద్వారా గ్రహించింది. అందుకే ఆప్ నేతలు తమ ప్రచారంలో నరేంద్ర మోదీ పేరెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజోరీ గార్డెన్ ఎన్నికలో ఓటమి తరువాత కూడా ఆప్ నేతలు గతానికి భిన్నంగా వ్యవహరించి జర్నైల్ సింగ్ రాజీనామా కారణంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహమే తమను విజయానికి దూరం చేసిందని పార్టీ నేతలు అంటున్నారు.