సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో గాలి కుంటు వ్యాధి వల్ల పశు సంపదను కోల్పోయిన రైతులు కొత్తగా ఆవులను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ హామీ ఇచ్చారు. ఇక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బుధవారం వ్యవసాయ విశ్వ విద్యాలయాల ఎనిమిదో జాతీయ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
ఆవులను పోగొట్టుకున్న రైతులకు నష్ట పరిహారం అందించడానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరడాన్ని ప్రస్తావిస్తూ, నష్ట పరిహారం ఇవ్వడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే కొత్తగా ఆవుల కొనుగోలుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వక్క రైతులకు జరిగిన నష్టంపై అంచనా వేయడానికి ఇటీవల పంపిన కేంద్ర బృందం నివేదికను సమర్పించిందని వెల్లడించారు. దాని ఆధారంగా రూ.175 కోట్ల నష్ట పరిహారాన్ని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
స్థిరంగా వృద్ధి
దేశంలో గత దశాబ్దంగా ఆహార ధాన్యాల ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నామని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం హెక్టారుకు జాతీయ ఆహార ధాన్యాల ఉత్పాదకత స్థాయి 2,059 కిలోలకు పెరిగిందని వెల్లడించారు. 2002-03తో పోల్చుకుంటే 34 శాతం అధికమన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఉత్పాదకతలో జాతీయ సగటును మించి పోయాయని కొనియాడారు. చిరు, ముతక ధాన్యాల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. దీనిని ఇలాగే కొనసాగిస్తూ పప్పు దినుసులు, వంట నూనెల ఉత్పాదకతలో కూడా అదే వృద్ధిని చూపించాలని కోరారు.
ప్రస్తుతం రూ.10 వేల కోట్ల విలువైన పప్పులను, రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. దీనిని నివారించడానికి స్థానికంగా ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అదే సమయంలో పంట మార్పిడి విధానాలను అవలంబించడం ద్వారా ఉత్పాదకతను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘పాడి’ని ఆదుకుంటాం
Published Thu, Oct 24 2013 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement