త్వరలో ప్రధానిని కలుస్తా: శరద్‌పవార్
రైతు రుణాలపై చర్చించనున్నట్లు వెల్లడి
ముంబై: రైతు రుణాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలిపారు. కరవు పరిస్థితులతో రైతులు అల్లాడుతున్నారని, వారికి తక్షణ సాయం అవసరం అని ఆయన చెప్పారు. మూడు రోజుల మరాఠ్వాడా పర్యటనలో భాగంగా పర్భానీలో సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఒక వేళ ప్రధాని దేశంలోనే ఉంటే కలుస్తాం. అలాగే ఆరుణ్ జైట్లీని కలసి రైతు రుణాల అంశంపై చర్చిస్తాం. రైతు సమస్యలపై రాజకీయాలు ఉండవు’ అని చెప్పారు. నెలరోజుల్లో మరాఠ్వా డా నుంచి దాదాపుగా 50 వేల మంది పుణే వద్ద ఉన్న పింప్రి చించ్‌వడ్‌కు తరలి వెళ్లారని పేర్కొన్నారు. ‘ఇక్కడి ప్రజలు, పశువులు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక విలవిలలాడుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి నిధులు పొందలేదు’ అని పవార్ ఆరోపించారు.