బడ్జెట్‌ ఫోకస్‌ అంతా మాటల్లోనే.... | union Budget focus only on growth revival | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ఫోకస్‌ అంతా మాటల్లోనే....

Published Fri, Feb 2 2018 4:16 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

union Budget focus only on growth revival - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం పరిస్థితులు అంతగా బాగా లేవని, ఈ రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం ఇటు పార్లమెంట్‌లో, అటూ దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆయన మాటలకు వాస్తవ కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదు. కొత్తగా ప్రకటించిన కొన్ని పథకాలకు నిధులే కేటాయించకపోగా, కొన్ని పథకాలకు కసురుకున్నట్టు కొసరు నిధులను మాత్రమే కేటాయించారు. ఇక వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ సంక్షేమాభివృద్ధి పథకాలకు గతేడాది కేటాయింపుల్లో పెంచిన శాతం కన్నా తక్కువ శాతంలో కేటాయింపులను పెంచారు. మరికొన్ని పథకాలకు తగ్గించారు.

ఉదాహరణకు వ్యవసాయరంగానికి కేటాయింపులను మొత్తం ఈ ఏడాది 12.8 శాతం పెంచారు. అందులో గ్రామీణ రంగానికి పెంచినది 1.8 శాతం. అంతకుముందు బడ్జెట్‌లో ఈ పెంపు 19 శాతంగా ఉంది. అలాగే సామాజిక రంగానికి సంబంధించిన స్కీములకు కేటాయింపులు 14.5 శాతం పెంచారు. అదే 2016–2017 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ కేటాయింపుల పెంపు 21.4 శాతంగా ఉండింది. ఆరోగ్య రంగానికి కూడా కేటాంపుల పెంపు 2.8 శాతం మాత్రమే ఉంది. అంతుకుముందు బడ్జెట్‌లో ఈ పెంపు ఏకంగా 36.5 శాతంగా ఉండింది.

గ్రామీణ వ్యవసాయ, మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అట్టహాసంగా ‘ఫిషరీస్‌ ఆక్వాకల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ను పదివేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిధికి ప్రస్తుత బడ్జెట్‌లో 47 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. పదివేల కోట్లు కావాలంటే కేంద్రానికి ఎన్ని వాయిదాలు కావాలి, ఎన్ని బడ్జెట్‌లు కావాలి?
అలాగే ప్రస్తుతం దేశంలోవున్న 585 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల యార్డులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా 22 వేల గ్రామీణ మార్కెట్‌ యార్డులను ఏర్పాటుకు మార్కెట్‌ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధికి రెండువేల కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిధుల కేటాయింపుల గురించి జైట్లీ ప్రసంగంలోగానీ, బడ్జెట్‌ ప్రతిపాదనల్లోగానీ ప్రస్థావనే లేదు. ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గ్రామీణలు ఇళ్లల్లో విద్యుత్‌ వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ కోసం 16000 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెల్సిందేనని జైట్లీ చెప్పారు.

వాస్తవానికి 2017–19 సంవత్సరం వరకు అంటే, రెండేళ్లకు కేంద్రం ఇప్పటికే 16,320 కోట్ల రూపాయల మంజూరుకు అనుమతి తెలిపింది. ఆ మొత్తంలో 12,320 కోట్ల రూపాయలు కేంద్రం వాటాకాగా, మిగతా సొమ్మును ఆయా రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తంలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 3,600 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2028–19 ఆర్థిక సంవత్సరానికి 8,720 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉండగా, బడ్జెట్‌లో 3,500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం కోసం అమలు చేస్తున్న ‘దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ్‌ జ్యోతి యోజన’ అనే మరో కేంద్ర విద్యుత్‌ పథకానికి ఈసారి 30 శాతం నిధులను తగ్గించారు.

గ్రామీణ ప్రాంతాల్లో వెదురు పంటను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1290 కోట్ల రూపాయలతో ‘జాతీయ వెదురు మిషన్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే బడ్జెట్‌లో మాత్రం అందుకు 300 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. పేద ప్రజల సొంతింటి కలను పరిపూర్ణం చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 51 లక్షల ఇళ్లను నిర్మించేందుకు కేటాయింపులను గతేడాదికన్నా తగ్గించారు. గతేడాది 23 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, ఈసారి 21 వేల కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వం బృహత్తర పథకమైన ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ పథకం’కు కూడా ఈసారి కేటాయింపులను పెంచలేదు. గతంలోలాగానే 56,000 కోట్లకు పరిమితం చేశారు.

ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా గతంకంటే కేటాయింపులు ఎక్కువగా లేవు. బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఎలాంటి ఫోకస్‌ లేదు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి మాటల్లో మాత్రం ఫోకస్‌ బలంగా ఉంది.  



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement