కుండల నిండా అన్నంతో, చూస్తూనే చవులూరించేలా రకరకాల కూరలతో, నోరూరించే అనేకానేక ఆదరువులతో... బకాసుర సంహారానికి బయల్దేరిన భీమసేనుడి బండి అక్షరాలా అన్నపు కొండనే తలపిస్తుంది! అలాగే మన దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వ్యవసాయ రంగానికి తాజా బడ్జెట్ కేటాయింపుల్లో ఇతోధిక ప్రాధాన్యమిచ్చారు జైట్లీ...
►మత్స్య, పశు సంవర్థక రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం 10,000 రూ. కోట్లలో
►వ్యవసాయ రుణ మంజూరు లక్ష్యం 11,00,000 రూ. కోట్లలో
న్యూఢిల్లీ :బడ్జెట్‌లో కీలక రంగాలపై దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... వ్యవసాయ రంగానికి భారీ వరాలు గుప్పించారు. వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ కేటాయింపులను గతేడాది (రూ.51,576 కోట్లు) కన్నా 13 శాతం అధికంగా రూ. 58,080 కోట్లకు పెంచారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఈసారి రూ.13,000 కోట్లు కేటాయించారు. దీనికి గతేడాది కేటాయింపులు రూ.10,698 కోట్లే.
ఖరీఫ్ పంటలకు మద్దతు
వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాల వంటి ఖరీఫ్ పంటలకు కచ్చితమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఆయా పంటల ఉత్పాదక వ్యయానికి 50 శాతం అదనంగా జోడించి మద్దతు ధర అందిస్తామని ప్రకటించారు. పంట ఉత్పత్తుల ధరలు పడిపోయినా రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రైతులకు తగిన మద్దతు ధర అందించేలా వ్యవస్థీకృత ఏర్పాట్లపై నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తుందని తెలిపారు. రబీ పంటల మద్దతు ధరలను ఇప్పటికే పెంచినట్లు చెప్పారు. వ్యవసాయ భూముల యజమానులకు ఎలాం టి సమస్య తలెత్తకుండానే... కౌలు రైతులకు రుణాలు, నిధులు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వా లతో నీతి ఆయోగ్ సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు.
భారీగా వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం
వివిధ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశం నుంచి ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయోత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని.. ఇవి 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.4 లక్షల కోట్లు)కు చేరే అవకాశముందని పేర్కొన్నారు. ముఖ్యంగా టీ, కాఫీ, పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహిస్తామని, ఇందుకోసం నిబంధనలను సరళీకరిస్తామని ప్రకటించారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం
ఫుడ్ ప్రాసెసింగ్‌కు గతేడాదికన్నా వంద శాతం అధికంగా రూ.1,400 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను రక్షించుకునేందుకు విదేశాల నుంచి దిగుమతయ్యే పలు ప్రాసెస్డ్ ఫుడ్‌పై కస్టమ్స్ సుంకాలను సవరిస్తున్నట్లు తెలిపారు. ఆరెంజ్ జ్యూస్‌పై 30 నుంచి 35 శాతానికి, ఇతర పళ్ల రసాలు, కూరగాయల జ్యూస్‌లపై 30 శాతం నుంచి 50 శాతానికి సుంకాన్ని పెంచారు. సోయా ప్రొటీన్ మినహా ఇతర వ్యవసాయ ప్రాసెస్డ్ ఉత్పత్తులపైనా సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ముడి జీడిపప్పు దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. కాగా ఫుడ్ ప్రాసెసింగ్‌కు నిధులు పెంచడంపై ఆ శాఖ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
కూరగాయల ధరల నియంత్రణకు ‘ఆపరేషన్ గ్రీన్స్’
ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే ఉల్లి, టమాటా వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ధరల నియం త్రణ, పర్యవేక్షణ కోసం ‘ఆపరేషన్ గ్రీన్స్’ను చేపడతామని జైట్లీ ప్రకటించారు. దేశంలో పాల ఉత్పత్తి పెంపునకు దోహదపడిన ‘ఆపరేషన్ ఫ్లడ్’తరహాలో దీనిని చేపడతామని చెప్పారు. ‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)’లను ప్రోత్సహించేందుకు.. ఆయా ఉత్పత్తుల నిల్వ, రవాణా, ప్రాసెసింగ్, నిర్వహణ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రూ.100 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఎఫ్‌పీవోలకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
లక్ష్యాలివీ..
►రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.లక్ష కోట్లు అదనం.
►ఒక్కో జిల్లా పరిధిలో ఒక్కో తరహా పంట పండించేలా ‘క్లస్టర్’ఆధారిత వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు. ఇందుకోసం ప్రస్తుత పథకాల్లో మార్పులు చేర్పులు.
►మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10,000 కోట్లతో ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు.
►జాతీయ వెదురు మిషన్‌కు రూ.1,290 కోట్లు.. ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకానికి రూ.200 కోట్లు.
►ఈ–నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) కింద ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల అనుసంధానం.
►దేశవ్యాప్తంగా మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటు. ప్రస్తుతమున్న 42 మెగా ఫుడ్‌పార్కుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు చర్యలు. శీతల గిడ్డంగుల నిర్మాణం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’కింద రూ.1,313 కోట్లు కేటాయింపు.
►వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇన్‌ఫ్రా ఫండ్ కింద రూ.2,000 కోట్లు కేటాయింపు. దేశవ్యాప్తంగా 22 వేల సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు.
►వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు నిధులు అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆగ్రో–ప్రాసెసింగ్ ఫైనాన్షియల్’సంస్థల ఏర్పాటు.
►మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు.
రైతుల ఆదాయం రెట్టింపు
రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే మా లక్ష్యం. ప్రస్తుతం సాగు చేస్తున్న విస్తీర్ణంలో.. తక్కువ ఖర్చుతో ఇప్పటికన్నా ఎక్కువ దిగుబడి సాధించాలి. ఇదే సమయంలో పంటలకు ప్రస్తుతం కన్నా అధిక ధర పొందాలి. కేవలం మద్దతు ధరే కాదు.. అంతకన్నా ఎక్కువ ధర లభించాలి. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నదే మా లక్ష్యం..
– అరుణ్ జైట్లీ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు
ఇది వినూత్న బడ్జెట్. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది..
– ఇఫ్కో ఎండీ అవస్తీ
ఇది రైతుల బడ్జెట్
బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది రైతుల బడ్జెట్. ఇక ముందు వ్యవసాయం నష్టదాయకం కాబోదు. దీనివల్ల యువత కూడా వ్యవసాయం వైపు మళ్లుతుంది.
– చౌదరి బీరేందర్‌సింగ్, కేంద్ర మంత్రి
47% దాకా ‘మద్దతు’
ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం ఖరీఫ్ పంటలకు మద్దతు ధర 47% వరకు పెరుగుతుంది. పంటను బట్టి 8 శాతం నుంచి 47% వరకు పెరగవచ్చు. క్వింటాల్ రూ. 1,900గా ఉన్న రాగుల మద్దతు ధర రూ. 2,791కు చేరుతుంది.
– రమేశ్ చాంద్ (నీతి ఆయోగ్ సభ్యుడు)
అపూర్వ బడ్జెట్: అడ్వాణీ
న్యూఢిల్లీ: కేంద్రం అపూర్వమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ కొనియాడారు. ‘ప్రజా సంక్షేమం కేంద్రంగా ఆర్థికవృద్ధిపై బీజేపీ దృష్టి సారించడం ఆనందంగా ఉంది. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఉన్నత స్థాయి లక్ష్యాలు, నిబద్ధత ఉన్న ఇలాంటి బడ్జెట్‌ను గతంలో నేనెన్నడూ చూడలేదు. భారత్ ఉజ్వలమైన భవిష్యత్‌వైపు దూసుకెళ్తుంది. ఈ బడ్జెట్ దేశాన్ని, బీజేపీని గర్వపడేలా చేసింది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని హృదయ పూర్వకంగా అభినందిస్తు్తన్నా’అని అడ్వాణీ తెలిపారు.
రెట్టింపు ఆదాయం అసాధ్యం: మన్మోహన్
న్యూఢిల్లీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అసాధ్యమని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ వృద్ధిరేటు 12 శాతానికి చేరనిదే ఆ లక్ష్యం నెరవేరదన్నారు. ఆర్థిక లోటు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హామీలను ప్రభుత్వం ఎలా నెరవేరుస్తుందో చూడాలన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ప్రకటించిన ఇలాంటి బడ్జెట్‌ను తాను తప్పు పట్టడంలేదని అన్నారు. ఈ బడ్జెట్ సంస్కరణల ఆధారితమా అని ప్రశ్నించగా..‘సంస్కరణలు’అనే పదాన్ని అతిగా వాడి దుర్వినియోగం చేశామని అన్నారు.
హమ్మయ్యా.. మరో ఏడాదే మోదీ పాలన: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ప్రజల అదృష్టం కొద్దీ మోదీ ప్రభుత్వ పాలన ఇంకా ఏడాది మాత్రమే ఉందన్నారు. ‘అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయిపోయినా.. ఇంకా రైతుల పంటకు మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ హామీలు ఇస్తూనే ఉంది. నాలుగేళ్లలో దేశంలోని యువతకు ఎలాంటి ఉద్యోగావకాశాలు కల్పించలేదు. మన అదృష్టం కొద్దీ మోదీ పాలన ఇంకో ఏడాది మాత్రమే ఉంటుంది’అని రాహుల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment