ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 2018–19 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఈ బడ్జెట్ అభివృద్ధి అనుకూల, నవభారత నిర్మాణ లక్ష్యాలను బలపరిచేలా ఉంది. జైట్లీ, బడ్జెట్ బృందానికి అభినందనలు. రైతులు, దళితులు, గిరిజనులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. గ్రామీణ భారతంలో కొత్త అవకాశాలు పెరిగేందుకు ఇది దోహదపడనుంది. రైతు, సామాన్యుడు, వ్యాపారస్తుల అనుకూల బడ్జెట్ ఇది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల మొండి బకాయీలను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనుంది’ అని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి మౌలిక వసతుల వరకు అన్ని రంగాల దృష్టిని ఆకర్షిం చేలా బడ్జెట్ ఉందన్నారు. ‘దేశాభివృద్ధిని పరుగులు పెట్టించేలా పద్దును రూపొందిం చారు. జీవించేందుకు అనుకూల, వ్యాపారాను కూల వాతావరణాన్ని ఈ బడ్జెట్ సృష్టించింది. చాలాకాలంగా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం పన్నుల భారాన్ని మోస్తోంది. బడ్జెట్‌లో ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ పన్నులను తగ్గించాం. గతంలో ఉన్న 30 శాతానికి బదులుగా ఇకపై 25 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది’ అని ప్రధాని తెలిపారు.
పేదల బతుకుల్లో ‘ఆయుష్మాన్’
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పేదలు ఏడాదికి రూ.5లక్షల వరకు ఆసుపత్రి చికిత్స ఖర్చులను పొందవచ్చన్నారు. ‘నాణ్యమైన వైద్యం అందుకోలేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఇదో గొప్ప అవకాశం. పదికోట్ల కుటుంబాలు (40–50 కోట్ల మంది) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో జరిగే అతిపెద్ద వైద్య సహాయం ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే ట్రాక్‌లు, మెట్రో ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ‘125కోట్ల మంది భారతీయుల కలల బడ్జెట్ ఇది. మన రైతులు రికార్డు స్థాయిలో ధాన్యాలు, కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అమలుచేస్తోందన్నారు.
పరిశీలనలో రైల్వేల ప్రైవేటీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు రైల్వే లైన్లను సొంతంగా నిర్మించి, నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని రైల్వే బోర్డు సీనియర్ అధికా రులు గురువారం చెప్పారు. ప్రాజెక్టులకు మొత్తం వ్యయాన్ని ప్రైవేటు సంస్థలే భరించి, రైల్వేకు లైసెన్సు ఫీజు మాత్రం చెల్లించేలా ఈ ప్రతిపాదన ఉందని వారు వెల్లడించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘రైల్వే రంగంలోనూ ప్రైవేటు కంపెనీలు రావాలి. ప్రై వేటును అనుమతిస్తేనే రైల్వేల సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ పెట్టుబడులు వస్తాయి’ అని అన్నారు. 150 ఏళ్ల నాటి సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని, వచ్చే ఆరేళ్లలో మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment