వరాలు కురిపిస్తారా! | minister arun jaitley will introduce union budget in lok sabha | Sakshi
Sakshi News home page

వరాలు కురిపిస్తారా!

Published Thu, Feb 1 2018 2:13 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

minister arun jaitley will introduce union budget in lok sabha - Sakshi

2018–19 బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

.. వీటన్నింటికీ కొద్దిగంటల్లోనే జవాబు లభించనుంది. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ టర్మ్‌లో చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కావడం.. సుమారు ఏడాది వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు, ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. నోట్లరద్దు, జీఎస్టీలతో క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యతిరేకతను తొలగించాలన్న లక్ష్యం.. వెరసి మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్‌ ప్రవేశపెట్టవచ్చని, గ్రామీణ ఓటర్లే లక్ష్యంగా పథకాలు ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. ఆదాయ, కార్పొరేట్‌ పన్నుల్లో భారీగా ఊరట కల్పించవచ్చనే ఆశలూ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కొద్దిగంటల్లోనే అందరి ఆశలు, సందేహాలకు సమాధానాలు లభించనున్నాయి.   

సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోసారి బడ్జెట్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఎనిమిది కీలక రాష్ట్రాల ఎన్నికలకుతోడు సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో అటు ప్రజాకర్షక మంత్రాన్ని జపిస్తూనే, ఇటు ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీపై పడింది. మంద గమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, ఉద్యోగాల సృష్టి, వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వంటి అంశాలు ఈ బడ్జెట్లో కీలకమవుతాయని భావిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తొలి బడ్జెట్‌ ఇదే. ఈ బడ్జెట్‌ వస్తువుల ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా మధ్య తరగతి, వేతన జీవులతో పాటు కార్పొరేట్‌ వర్గాలు మాత్రం పన్నుల ఊరట కోసం ఆశగా చూస్తున్నాయి.

తాయిలాలు ఉంటాయా? 
అరుణ్‌ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే. దీనికితోడు త్వరలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏవైనా తాయిలాలు ఇవ్వాలంటే.. ఈ బడ్జెట్‌లోనే సాధ్యం. ఈ నేపథ్యంలో జైట్లీ గ్రామీణ భారతావనిపై దృష్టి పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త గ్రామీణ పథకాలతోపాటు ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ), పల్లెల్లో ఇళ్ల నిర్మాణం, వ్యవసాయానికి భారీ నిధులను కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ బీమాకు కూడా నిధులను కుమ్మరించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఆదాయ పన్ను ఊరట
ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కనుక ఎన్నికల్లో మధ్య తరగతి, వేతన జీవులను తమవైపు తిప్పుకోవటానికి ఆదాయ పన్ను ఊరట అస్త్రాన్ని జైట్లీ ప్రయోగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడం, పన్ను శ్లాబ్‌లలో మార్పులు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని చాలాకాలంగా డిమాండ్లు ఉన్నాయి. కానీ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం.. దీనిపై ఏ మేరకు ముందుకెళుతుందనే సందేహం నెలకొంది. 

మౌలిక రంగానికి చేయూత 
ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2017–18లో నాలుగేళ్ల కనిష్టానికి (6.75) పడిపోవచ్చని తాజాగా ఆర్థిక సర్వే సైతం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచేందుకు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారించే అవకాశముంది. జాతీయ రహదారులు, రైల్వేల ఆధునీకరణకు భారీ కేటాయింపులు ఉంటాయనే అంచనాలున్నాయి. 

ద్రవ్యలోటు గుబులు 
బడ్జెట్‌ వరాలకు అడ్డం కిగా నిలిచేదేమైనా ఉంటే అది కచ్చితంగా ద్రవ్యలోటే (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటికే ఆ పరిధి దాటిపోయింది. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకువచ్చి, ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడకపోతే స్టాక్‌ మార్కెట్లకు ప్రతికూల సంకేతాలు పంపే ప్రమాదముంది. భారత రేటింగ్‌పైనా ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇక ముడి చమురు ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్బణం, కరెంట్‌ ఖాతా లోటు పెరిగిపోతాయన్న ఆందోళనలు ఉన్నాయి. 

స్టాక్‌ మార్కెట్లకు షాకిస్తారా..? 
ఈసారి బడ్జెట్‌పై అత్యంత ఉత్కంఠతో ఉన్నది స్టాక్‌ మార్కెట్‌ వర్గాలే. ఎందుకంటే షేర్లపై ఆదాయానికి పన్ను మినహాయింపు వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచవచ్చన్న భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం షేర్లు కొని ఏడాది తర్వాత విక్రయిస్తే... తద్వారా వచ్చే లాభాలపై పన్ను లేదు. ఆలోపు విక్రయిస్తే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. అయితే మోదీ ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్‌ నుంచి మరిన్ని నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఉందని.. ఏడాది దాటితే వచ్చే మూలధన లాభాలపై 7 నుంచి 10 శాతం పన్ను విధించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాకాకుండా పన్ను మినహాయింపు పరిమితిని మూడేళ్లకు పెంచవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. అంటే షేర్లు కొని మూడేళ్లలోపు విక్రయిస్తే వచ్చే లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఇక విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) ప్రస్తుతం ఎలాంటి మూలధన లాభాల పన్ను లేదు. ఇప్పుడు అమల్లోకి తేవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయాల్లో ఏవైనా గురువారం స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గిస్తారా? 
కార్పొరేట్‌ సంస్థలపై పన్నును ప్రస్తు తమున్న 30 శా తం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని 2015లో జైట్లీ హామీనిచ్చారు. కానీ గతేడాది బడ్జెట్లో కొన్ని వర్గాలకు మాత్రమే కాస్త ఊరట (29 శాతానికి తగ్గించారు) ఇచ్చారు. మొత్తం అన్ని కంపెనీలకూ ఈసారి కార్పొరేట్‌ పన్నును తగ్గించాలన్న డిమాండ్‌ వస్తోంది. ఇక డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) తొలగింపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను ఎత్తివేయడం వంటి డిమాండ్లపైనా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారింది.

జీఎస్టీ, నోట్ల రద్దు ‘గాయాల’కు చికిత్స!
వస్తు సేవల పన్ను (జీఎస్టీ), నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయ ని ఇటీవలి ఎన్నికల్లో బయటపడింది. దీంతో బీజేపీకి సంప్రదాయ మద్దతు దారులైన చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా.. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం నుంచి కొంతైనా బయటపడేలా ప్రోత్సాహకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

పరోక్ష పన్నుల ప్రస్తావన లేనట్టే!
కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులను జీఎస్టీలో కలిపేయడంతో.. ఈసారి బడ్జెట్లో పరోక్ష పన్నుల ప్రస్తావన పెద్దగా ఉండదని భావిస్తున్నారు. దీంతో కస్టమ్స్‌ సుంకంలో మాత్రమే మార్పుచేర్పులు చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే జీఎస్టీ రేట్లను సవరించే అధికారం జీఎస్టీ మండలికి మాత్రమే ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement