వైద్య శిబిరంలో మందులు పంపిణీ చేస్తున్న సిబ్బంది (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పది కోట్ల పేద కుటుంబాలకు ఏటా ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య రక్షణ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఇది ప్రపంచంలోనే ప్రభుత్వం నిర్వహిస్తున్న అతిపెద్ద స్కీమ్ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో చెప్పుకొచ్చారు. మోదీ కేర్‌గా కూడా పిలుస్తున్న ఈ పథకం వాస్తవానికి కొత్తదేమీ కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకం గురించి చెబుతున్నదే. రెండేళ్ల క్రితం 2016 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే పేద కుటుంబాలకు ఏటా ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.
నాడు ఇచ్చిన హామీని ఆరోగ్య బీమా అనగా, నేడు ఆరోగ్య రక్షణ అంటున్నారు. నాడు కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించగా నేడు ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. పెరిగిన వైద్యం ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ పెరుగుదల పెద్ద ఎక్కువేమీ కాకపోవచ్చు. ఇప్పటికే ఇలాంటి కేంద్ర పథకం ఒకటి అమల్లో ఉంది. దాని పేరు ‘రాష్ట్రీయ స్వస్త్య భీమా యోజన’. 2008లో ప్రవేశపెట్టిన ఆ పథకం కింద కుటుంబానికి 30 వేల రూపాయల వరకు ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. ఇప్పుడు దాన్నే ఐదు లక్షల రూపాయలకు పెంచి అమలు చేయవచ్చు! మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం అడిగినట్లు ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది కీలక ప్రశ్న.
రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన పథకానికి 2016–17 సంవత్సరానికి 466 కోట్ల రూపాయలను కేటాయించగా, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలకు కేటాయించారు. సవరించిన బడ్జెట్ అంచనాల్లో మరో 471 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ సారి రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి పేద కుటుంబానికి ఏటా ఐదు లక్షల వరకు ఆరోగ్య రక్షణ కల్పించాలంటే ఈ సొమ్ము సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మూడు శాతం విధిస్తున్న విద్యాసెస్సును విద్యా, ఆరోగ్య సెస్సుగా మార్చి ఇప్పుడు నాలుగు శాతంగా విధిస్తున్నామని, ఈ సెస్సు కింద అదనంగా 11వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. వాటిని ఈ స్కీమ్‌కు మళ్లిస్తే స్కీమ్‌ను అమలు చేయవచ్చేమో!
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, స్వస్తత కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి మరో 1200 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతమున్న ప్రాథమిక ఆరోగ్య, సబ్ సెంటర్లనే ఆ సొమ్ముతోని అభివద్ధి చేస్తే సరిపోతుంది. ఈ విషయంలో కూడా కేంద్ర మంత్రి స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment