కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రాథమికంగా ఆంగ్లంలో ఉపన్యాసం ప్రారంభించి మధ్యలో హిందీ భాషలోకి దిగారు. ఆయన తన తత్వానికి భిన్నంగా ఎక్కువసేపు హిందీలోనే మాట్లాడారు. అందుకోసం కొన్ని పదాలను తడుముకోవాల్సి కూడా వచ్చింది. ఆయన ఎందుకు హిందీలో మాట్లాడారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. బీజేపీ బలంగా ఉన్న హిందీ భాషా రాష్ట్రాల ప్రజలను ఆకర్షించడం కోసమే ఆయన హిందీలో మాట్లాడారు.
ప్రధానంగా రైతులు, పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన చెప్పుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగంపై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై ఈసారి బడ్జెట్‌లో దృష్టి ఎక్కువగా కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. ఈ దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తానని గతంలో చెప్పిన మాటలను పునరుద్ఘాటిస్తూ ఆ లక్ష్యం దిశగా ఎలా ముందుకెళ్లవచ్చో అరుణ్ జైట్లీ తన ప్రసంగంలోనే చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో రైతులు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు లాభాలు వచ్చేలా చూస్తామని, అందుకు తగిన విధంగా గిట్టుబాటు ధరలను కల్పిస్తామని, తదనుగుణంగా నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు.
ఖరీఫ్ పంటలకు పెట్టిన పెట్టుబడులకు ఒకటిన్నర రెట్లు లాభం వచ్చేలా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తాను తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. కనీస మద్దతు ధరలను ప్రకటించినంత మాత్రాన రైతులకు న్యాయం జరిగినట్లు కాదని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేలా నీతి ఆయోగ్‌తో కలిసి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఆయుష్‌మాన్ భారత్ స్కీమ్ పేరిట ‘మోడీకేర్’గా ప్రాచుర్యంలోకి రానున్న కీలకమైన వైద్య పథకాన్ని ప్రకటించారు.
పదికోట్ల మంది పేదలు, అణగారి వర్గాల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి ఈ ఆరోగ్య పథకం కింద లబ్ధి చేకూరుతుందని జైట్లీ చెప్పారు. ప్రపంచంలోనే ఓ ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద ఆరోగ్య పథకం ఇదేనన్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి ఏటా ఐదులక్షల ఆరోగ్య వసతులు సమకూరుతాయని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి వ్యవసాయానికి, ఆరోగ్య రక్షణ స్కీమ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరిళియే కారణమని స్పష్టం అవుతుంది. గుజరాత్‌లో పట్టణ ప్రాంతాల ప్రజలు బీజేపీకి ఓట్లు వేయగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. రానున్న ఎనిమిది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల ఓట్లే కీలకం కనుక వారిని మంచి చేసుకోవడం కోసమే వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment