PM Narendra Modi On Why Sharad Pawar Could Never Become Prime Minister - Sakshi
Sakshi News home page

శరద్‌ పవార్‌ అందుకే ప్రధాని కాలేకపోయారు: మోదీ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Aug 9 2023 11:44 AM | Last Updated on Wed, Aug 9 2023 1:05 PM

PM Modi On Why Sharad Pawar Could Never Become Prime Minister - Sakshi

ముంబై: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే శరద్‌ పవార్‌ ప్రధానమంత్రి కావాలన్న కల నెరవేరలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్‌కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. కాగా శరద్ పవార్‌ సమీప బంధువు అజిత్‌ పవార్‌ ఎన్సీపీని మహారాష్ట్ర కేబినెట్‌లో చేరిన అనంతరం ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంచరించుకుంది.

మహారాష్ట్ర ఎన్డీయే కూటమి ఎంపీలతో మంగళవారం మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగాంగా ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని అన్నారు. అనేక మంది గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు.

ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బంధుప్రీతి కారణంగా కాంగ్రెస్‌ ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని విమర్శించారు.
చదవండి: అవిశ్వాస తీర్మానంపై  రాహుల్‌ ప్రసంగం.. నో క్లారిటీ

శివసేన(యూబీటీ)తో బీజేపీ తెగదెంపులు చేసుకోలేదని ఉద్ధవ్‌ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారే కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామన్నారు. కొన్నిసార్లు క్షమించామని తెలిపారు. ఓ వైపు అధికారంలో ఉండాలని, మరోవైపు విమర్శించాలనుకున్నారు, ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయి? అని ప్రశ్నించారు. కాగా 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తలెత్తిన రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

గతకొన్ని రోజులుగా వారసత్వ రాజకీయాలపై మోదీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 9న  క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని తెలిపారు.  చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (74)తో పోలిస్తే జేడీయూకి(జనతాదళ్ యునైటెడ్) తక్కువ సీట్లు (43) వచ్చినప్పటికీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమిలో తమ మిత్రపక్షాలే ముఖ్యమని, అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. బీజేపీకి కాంగ్రెస్‌లా అహంకారం లేదని, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ఆయన తేల్చిచెప్పారు.
చదవండి: సోదరులిద్దరూ కలిసేనా? ఏకతాటిపైకి ఉద్ధవ్‌ ఠాక్రే.. రాజ్‌ ఠాక్రే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement