కృషి మేళాలో ముఖ్యమంత్రి
= పౌల్ట్రీ, పశు, చేపల పెంపకాలూ వృద్ధి
= ‘మెట్ట’లోనూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించాలి
= వ్యవసాయం మానుకుంటున్న రైతులు
= ఉపాధి కోసం పట్టణాలకు వలస.. ‘సాగు’పై యువత విముఖత
= క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులు.. తగ్గుతున్న దిగుబడులు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మెట్ట వ్యవసాయ అభివృద్ధికి నూతన పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ పాలసీ వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన పౌల్ట్రీ, పశు, చేపల పెంపకం తదితర విభాగాలూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. బెంగళూరులో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ కృషి మేళాను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. విస్తీర్ణం పరంగా దేశంలో వర్షాధార (మెట్ట) వ్యవసాయం ఆధారిత రాష్ట్రాల్లో రాజస్థాన్ మొదటి.. కర్ణాటక రెండవ స్థానంలో ఉన్నాయన్నారు.
అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో మెట్ట వ్యవసాయం రైతులకు భారంగా మారిందన్నారు. దీంతో పంట పెట్టుబడులూ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం నూతన పాలసీని ప్రవేశపెడతామని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మెట్ట భూముల్లో అధిక దిగుబడి ఇచ్చే వాటితోపాటు రోగనిరోధక వంగడాలను సృష్టించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలను సంబంధిత విశ్వవిద్యాలయా లు, పరిశోధనా కేంద్రాలకు అందిస్తుందని భరోసా ఇచ్చా రు.
అతివృష్టి, అనావృష్టి వల్ల వ్యవసాయ రంగం నష్టాల ఊబిలో కూరుకుపోతోందని, దీంతో అనేక మంది రైతులు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యువత ఈ రంగంపై తీవ్ర విముఖత వ్యక్తం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంలో మొత్తం జనాభాలో 80 శాతం మంది గ్రామాల్లో నివసించేవారని, నేడు అది 61 శాతానికి పడిపోవడమే ఇందుకు తార్కాణమని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలపై కూడా ఉందన్నారు.
క్షేత్రస్థాయికి చేరని ఫలాలు ..
వ్యవసాయ రంగం అభివృద్ధిలో ప్రాథమిక సూత్రమైన ‘ల్యాబ్ టూ ల్యాండ్’ను మరిచిన వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం లేదన్నారు. ప్రభుత్వం అందించే కోట్లాది రూపాయల సబ్సిడీని మాత్రం రైతులకు అందిస్తూ కార్యాలయాలకే పరిమితమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమక్కై.. అర్హులకు చెందాల్సిన సబ్సిడీనీ స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇండీ గ్రామంలో వరి పంటకు విచిత్ర తెగులు సోకి దిగుబడి పూర్తిగా తగ్గిందని, తరచుగా వ్యవసాయ శాఖ అధికారులు పొలాలను పరిశీలిస్తూ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ భైరేగౌడ, విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ నారాయణగౌడ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పంటల ఉత్పత్తిలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరత్‌పవార్ గైర్హాజరయ్యారు.