సాక్షి, బెంగళూరు : ప్రతి జిల్లా కేంద్రంలోనూ వాల్మీకి స్మారక భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఒక్కొక్క భవనానికి రూర. 3 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు చెప్పారు. విధానసౌధాలోని బ్యాంక్వెట్ హాల్‌లో వాల్మీకి జయంతి ఉత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి, ప్రసంగించారు. వాల్మీకి భవనాలతో పాటు రాష్ర్టంలోని ఎంపిక చేసిన 30 తాలూకా కేంద్రాల్లో షెడ్యూల్ తెగల ప్రజలకు ఉపయోగపడేలా ప్రత్యేక కమ్యూనిటీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఎస్‌టీ సముదాయానికి చెందిన మహిళా రైతు కూలీలు పొలం కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది అందివ్వనున్నట్లు చెప్పారు. అలాగే 7600 మంది ఎస్‌టీ రైతుల పొలాల్లో బోరు బావులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఎస్‌టీ సముదాయానికి చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందివ్వడంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా 15 వాల్మీకి ఆశ్రమ పాఠశాలలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా ఇదే సామాజిక వర్గానికి చెందిన పిల్లల కోసం 30 ప్రత్యేక పాఠశాలల కూడా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. తళవార, పరివార కులాలకు చెందిన వారిని షెడ్యూల్ తెగలలో చేర్చే విషయం పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన క్షీరభాగ్య పథకాన్ని రాష్ట్రంలోని హాస్టల్ సదుపాయం కలిగిన అన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు తెలిపారు. కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను సేకరించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్ధిష్టంగా రూపొందిచడంతో పాటు, అమలు చేయడానికి సులువుగా ఉంటుందన్నారు.
తాను గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇందు కోసం రూ. 2 కేట్లు విడుదల చేశానని గుర్తు చేశారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది లోపు రాష్ర్టంలో కుల ప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ ప్రారంభించి, త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వాల్మీకి పురస్కారాన్ని వాల్మీకి మహా సంస్థ పీఠాధిపతి దివంగత పుణ్యానంద తరుఫున ప్రసన్నానంద స్వామీజీ అందుకున్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వాల్మీకి భవనం
Published Sat, Oct 19 2013 2:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement