= ఆర్థిక సంఘానికి సీఎం వినతి
= శాఖల్లో అసమానతలను తొలగించడానికిరూ.16 వేల కోట్లు అవసరం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోనే రెండో జాతీయ నగరంగా పేరు పొందిన బెంగళూరులో ప్రాథమిక సదుపాయాల కల్పనకు విరివిగా నిధులు మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ వైవీ. రెడ్డి, ఇతర సభ్యులతో గురువారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. బెంగళూరులో తాగు నీరు, రోడ్లు తదితర ప్రాథమిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించడానికి అవసరమైన నిధులను ఉదారంగా ఇవ్వాలని కోరారు. 12వ పంచ వర్ష ప్రణాళిక లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వ్యవసాయ, తోటలు, పశు సంవర్ధక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల్లో నెలకొన్న అసమానతలను తొలగించడానికి రూ.16 వేల కోట్లు అవసరం ఉందన్నారు. ఈ మొత్తాన్ని మంజూరు చేయించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఇస్తున్న 32 శాతాన్ని 42 శాతానికి పెంచాలని అభ్యర్థించారు.
కేంద్రం గ్రాంట్లను ఇచ్చేటప్పుడు హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రాజ్యాంగంలో 371జే అధికరణను చేర్చడం ద్వారా ఆ ప్రాంతానికి లభించిన ప్రత్యేక హోదాను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ఆయన ఏకరువు పెడుతూ, వాటికి తగ్గట్టుగా నిధులు ఇవ్వాలని అర్థించారు.