మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో బోటు షికారు చేస్తున్న కేటీఆర్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ నిత్యం రకరకాల విమర్శలు చేస్తోంది. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మీ సంకీర్ణ ప్రభుత్వం చేసిందేంటి? తెలంగాణలో మాదిరే రూ.34 వేల కోట్ల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేస్తామని ప్రకటించారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలేమో ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కర్ణాటకలో చేతకానిది తెలంగాణలో ఎట్లా చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’అని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్‌ను నిలదీశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్న పెద్దచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో ఆ పార్టీ కర్ణాటకలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తూ, మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ‘కర్ణాటకలో మా సంకీర్ణ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల రుణాలను విజయవంతంగా మాఫీ చేసింది’అని చేసిన ట్వీట్‌ను చూసి నవ్వుకున్నట్లు చెప్పారు.
కుటుంబ పాలనెవరిదో దేశమంతా తెలుసు
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అంటూ విమర్శించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2014 వరకు ఎవరిది కుటుంబ పాలనో దేశమంతా తెలుసునన్నారు. ‘‘జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా నాలుగు తరాలు పాలించి దేశానికి మొండిచేయి చూపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వరుసలో ఉన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటు’’అని అన్నారు. గతంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గ్రామాలకు రోడ్లు, విద్యుత్, ఆఖరికి తాగునీళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు, పాలమూరులో వలసలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
వాళ్ల కంటికి అలాగే కనిపిస్తది..
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తదన్నట్లు.. స్కామ్‌లు చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ నేతలకు ప్రతీ పనిలో స్కాంలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయను కమీషన్ల కాకతీయ అని, మిషన్ భగీరథతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని.. ఇలా ప్రతీది వారి కోణంలోనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దరిద్రపు ఆలోచనలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్రజానీకం చూస్తోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారన్నారు.
ఐటీ టవర్‌కు నిధులు కేటాయింపు
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పాలమూరు ప్రాంతానికి కొత్త వైభవం తీసుకొస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 400 ఎకరాల్లో చేపట్టిన ఐటీ, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పాలమూరు ఐటీ పార్కు త్వరగా అభివృద్ధి చేసేందుకు పెద్ద టవర్ నిర్మిస్తామని, అందుకు రూ.50 కోట్లు నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 6 నుంచి 9 నెలల కాలంలో పనులన్నీ పూర్తి చేసుకుని కంపెనీలు నెలకొల్పేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment