మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు నేతలతో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గలీజ్ చరిత్ర అని, ఆ పార్టీ నిండా నీతిమాలిన నేతలే ఉన్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇంటింటికీ ప్లోరోసిస్‌ను చేర్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతల ఆకారాలు, ఆస్తులు, అహంకారాలు పెరగడం తప్ప సామాన్యుల జీవితాల్లో మార్పేమీ రాలేదన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చిట్యాల వద్ద డ్రై పోర్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. పవర్‌లూమ్, హ్యాండ్ లూమ్ రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఇంకా ఏమన్నా మిగిలితే అవి కూడా మాఫీ చేసే బాధ్యత తమదేనన్నారు. నల్లగొండకు మెడికల్ కాలేజీ కావాలన్నది ప్రజల చిరకాల కోరిక అని, ఇప్పుడు రెండు కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు ఎయిమ్స్ కూడా నల్లగొండకే వస్తోందన్నారు.
జాతీయస్థాయిలో విధానాలుండవా?
గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లే యాదగిరిగుట్ట అభివృద్ధి చెందలేదని మంత్రి విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఇప్పుడు ఎట్లున్నదో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. 15 ఏళ్ళు మంత్రిగా పని చేసిన జానారెడ్డి రికార్డు దేనికి పనికొస్తదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు కారులో రూ.2 కోట్లు కాలబెట్టిన ఉత్తమ్ కూడా నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇక్కడి తెలంగాణ రైతులను మోసం చేయడానికే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. నీతిమాలిన కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో విధివిధానాలుండవా అని ప్రశ్నించారు. అదే వేదికపై ఉన్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రజల విశ్వాసాలు దెబ్బ తినకుండా అందరం కలసి పనిచేయాలి. ఈ సమయంలో అస్త్ర సన్యాసం మంచిది కాదు. మీ సేవలు పార్టీకి, ప్రభుత్వానికి అవసరం. అన్ని అస్త్రాలను ఉపయోగించి పనిచేద్దాం’అని కోరారు.
అందుకే రిటైర్ అవుతానన్నా: సోమారపు
టీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదని సోమారపు సత్యనారాయణ అన్నారు. టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ‘15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ప్రజల కోసమే పని చేస్తున్నా. రాజకీయాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ మేయర్‌ను దింపడానికి సిద్ధమయ్యారు. అందరు వచ్చారు కాబట్టి నేను వ్యతిరేకించలేదు. అవిశ్వాసం ఉపసంహరింపజేయాలని సంకేతాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను’ అని వివరించారు. అవిశ్వాసంపై వెనకడుగు వేసేది లేదని కార్పొరేటర్లు చెప్పారని, స్వంత కార్పొరేటర్లు కూడా తన మాట వినకపోవడంతో ఆ రాత్రంతా నిద్రపోలేదని చెప్పారు. కార్పొరేటర్లను ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి, రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించినట్లు వివరించారు. రిటైర్‌మెంట్ ప్రకటన సింగరేణి కార్మికుల ముందే చేశానన్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment