సభా వేదికను పరిశీలించేందుకు నిచ్చెన సాయంతో పైకి ఎక్కుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ రెండు పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే బట్టలూడదీసి కొడతారని టీడీపీకి చెందిన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారే హెచ్చరిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికి లేదని, బిహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఆర్‌జేడీ అంతర్థానమైపోయిందని, టీడీపీ కూడా అలాగే నామరూపాల్లేకుండా పోయిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో ఎన్ని పార్టీలు కలిసినా టీఆర్‌ఎస్‌కు ఒంటరిగానే 100 సీట్లు ఖాయమన్నారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ సీట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయన్నారు. ప్రతిపక్షాలన్నీ గుంపుగా వచ్చినా టీఆర్‌ఎస్ సింహంలాగా ఒంటరిగానే పోరాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీతో పొరపాటున కూడా ఎలాంటి అంటూసొంటూ టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. బీజేపీతో ఎలాంటి రాజకీయ భావసారూప్యత లేదన్నారు. ప్రధాని మోదీతో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో ఒక్క సీటూ గెలవలేదన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో భవిష్యత్తులో చాలా మంది చేరుతారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లు కూడా అధికారంలో టీఆర్‌ఎస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కోర్టుకు వెళ్తే వద్దంటామా..?
ప్రగతి నివేదన సభలో అధికార దుర్వినియోగం గురించి కోర్టుకు పోతామని కోదండరాం చేసిన హెచ్చరికపై మాట్లాడుతూ కోర్టుకు పోయే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందన్నారు. కోర్టుకు వెళ్తే వద్దంటామా అని ప్రశ్నించారు. ఎన్నికల వాతావరణంలోకి వచ్చిన సమయంలో జరుగుతున్న సభ కాబట్టి, ఎన్నికలకు సన్నద్ధంగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఏనాడో మరిచిపోయారని, మీడియా మాత్రమే ప్రతిపక్షాలను గుర్తు పెట్టుకుందన్నారు.
ఎన్నికలెప్పుడో కేసీఆర్‌దే నిర్ణయం
ముందస్తు ఎన్నికలని మీడియాలోనే చూస్తున్నామని, దీనిపై ఎక్కడా తాము చెప్పలేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయనేది కాకుండా, ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం, కేబినెట్ మంత్రుల నిర్ణయం ప్రకారం అసెంబ్లీని రద్దు చేస్తారని, ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఉండదన్నారు. ముందస్తు ఎన్నికలొస్తాయని ఎంపీ సీతారాంనాయక్ అంటే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ ఏడాది చివరలోగా సభను నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ ప్లీనరీలోనే కేసీఆర్ చెప్పా రని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 51 నెలల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు వచ్చే ఐదేళ్లలో అధికారమిస్తే ఏం చేస్తామో ప్రగతి నివేదన సభలో చెబుతామని కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment