సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైన మరుసటి రోజే నేతల పార్టీ మార్పులు షురూ అయ్యాయి. ఆశావహులు, టికెట్లు రాని నేతలు, పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉన్నట్టుండి ఆయన నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లడం, గంటపాటు చర్చలు జరిపిన అనంతరం పార్టీ మారుతున్నట్టు సురేశ్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సురేశ్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ షాక్‌కు గురైంది. అయితే ఆ పార్టీలోకి కూడా వలసలు ప్రారంభమవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి చేరారు.
అనూహ్యంగా.. పకడ్బందీగా..
సురేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పకడ్బందీగా వ్యవహరించారు. నాలుగైదు రో జులుగా ఆయనతో సంప్రదింపులు జరుగుతు న్నా.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ ఆయనను పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మంచి వక్తగా, అసెంబ్లీ నియమావళి, చట్టసభల అంశాలపై పూర్తి అవగాహన ఉన్న నేతగా గుర్తింపు ఉన్న సురేశ్‌రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది. కాంగ్రెస్‌లోని ముఖ్యుల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో పెద్ద వికెట్లే పడిపోతున్నాయనే భావన కలిగించడమే ఈ ఆపరేషన్ వెనుక టీఆర్‌ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. సురేశ్‌రెడ్డితోపాటు మరికొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలకు టీఆర్‌ఎస్ గాలం వేసి ఉంచినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా తమతో 10 మంది వరకు కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని, సమయానుకూలంగా ఈ జాబితాలోని ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటామని టీఆర్‌ఎస్ నేత ఒకరు వెల్లడించడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీ ముమ్మరం చేసిందని తెలుస్తోంది.
కాంగ్రెస్‌లోకీ.. క్యూ
టీఆర్‌ఎస్ వ్యూహం అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా పకడ్బందీగానే ముందుకెళుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు, నలుగురు నేతలను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ నేతలు మరికొందరిపై దృష్టి పెట్టారు. టీఆర్‌ఎస్ టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న వారిని, పార్టీలో ఎన్నాళ్లు పనిచేసినా గుర్తింపు దక్కలేదనే భావనలో ఉన్న వారిని సంప్రదిస్తూ ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి త్వరలోనే పార్టీలోకి వస్తారని చెప్పడం గమనార్హం. మరోవైపు బీజేపీ నేత, మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నేత చారులతా రాథోడ్, టీఆర్‌ఎస్ నేత శ్రీరంగం సత్యం, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తంరావు కుమారుడు హరీశ్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
12న కాంగ్రెస్‌లోకి డీఎస్?
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈనెల 12న రాహుల్‌గాంధీ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే కాకుండా ఇతర రాజకీయ పార్టీల్లోకి కూడా వలస పక్షుల ప్రయాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, టీజేఎస్‌లు కొందరిని పార్టీల్లో చేర్చుకోవడంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పొత్తులు కుదిరి, టికెట్లు ఖరారయ్యేంత వరకు నేతల పార్టీ మార్పులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment