శనివారం కల్వకుర్తి రోడ్‌షోలో అభివాదం చేస్తున్న వంశీచంద్, రేవంత్ రెడ్డి
కల్వకుర్తి: మరోసారి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో అసంపూర్తిగా ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పక్కన పెట్టి కమీషన్ల కోసం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు చేపట్టారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా శనివారం కల్వకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ ప్రసంగించారు. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయకుండా పాలమూరు పథకాన్ని కొత్తగా చేపట్టి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో మందుల తయారీ ఫ్యాక్టరీని పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులనీ పూర్తి చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీని గెలిపిస్తే ఇద్దరం రామలక్ష్మణుల్లా కల్వకుర్తిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతకు ముందు కడ్తాల్ నుంచి కల్వకుర్తి వరకు రోడ్డు షో, ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment