
బొంరాస్‌పేట: ‘రేవంత్‌రెడ్డి అనే నేను.. ప్రజలకు అండదండగా నిలబడి అభివృద్ధి చేసి చూపుతానని, ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర కమీషన్లు అడగలేదని, అక్రమాలకు పాల్పడలేదని మీ అందరి ముందు సగర్వంగా చెబుతున్నా. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపాను. ఇక నన్నెందుకు ఓడించాలి. పనిగట్టుకొని టీఆర్‌ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపానని, నన్నెందుకు ఓడించాలని టీఆర్‌ఎస్ పార్టీని ప్రశించారు. కోస్గిలో జరిగిన కేసీఆర్ సభలో కొడంగల్ అభివృద్ధి పనులకు అర్ధ రూపాయి విలువ చేసే హామీలు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ నల్లత్రాచు లాంటివారని, తోకపై కాకుండా పడగమీద పాదం మోపి టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ‘కొండలనైనా పిండిగొట్టే నేను.. కర్రపుల్ల లాంటి కేసీఆర్ నాకెంత’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment