సాక్షి, కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి 4పస్ల్4 గన్‌మెన్ సెక్యూరిటీని పోలీసుశాఖ కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు ఎస్కార్ట్ వాహనాలతో భద్రతా సిబ్బందిని పోలీసుశాఖ సమకూర్చింది. 4ప్లస్4 సెక్యూరిటీని రేవంత్‌రెడ్డి స్వీకరించారు. ఎన్నికల ఫలితాల వరకు ఆయనకు ఈ సెక్యూరిటీ ఉంటుంది.
రేవంత్‌రెడ్డి భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనకు 4+4 భద్రత కల్పించాలని, 24 గంటల ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రత వల్ల తన కదలికలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పెద్దలకు ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై ఆయన ఏదైనా ఫిర్యాదు ఇస్తే దానిపై విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో 4+4 భద్రతను కల్పించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజకీయంగా ఎదుర్కొలేకనే..
రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక భౌతికంగా తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పరిపాలనా వైఫల్యాలు, నిర్ణయాల్లో లోపాలు, టెండర్లలో అవినీతి, అక్రమాలు, అక్రమ భూ కేటాయింపులు, కుటుంబ పాలన, రాచరిక పోకడలు, పాలనలో నిర్ణయాలను ప్రశ్నిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకే తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కుటిల పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment