ప్రజలే మాకు బాస్‌లు | Second phase of KCR campaign from tomorrow | Sakshi
Sakshi News home page

ప్రజలే మాకు బాస్‌లు

Published Sat, Nov 24 2018 2:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Second phase of KCR campaign from tomorrow  - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సూర్యాపేట: ‘‘58 ఏళ్లు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్లీ ఈ తెలంగాణ వలస ఆధిపత్యంలోకి పోవాలా? మళ్లా చంద్రబాబు నాయుడు పెత్తనం మన తెలంగాణకు కావాలా? చంద్రబాబు లాంటి దరిద్రాన్ని తెచ్చి కాంగ్రెసోళ్లు మన నెత్తిన పెడ్తరంట. మనం దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోవాలా? కాంగ్రెస్‌ వాళ్లేమో ఢిల్లీకి గులాంలు. కానీ మాకు బాస్‌లు సభలో కూర్చు న్న జనమే. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు. బీడీ కార్మికుల ప్రాంతానికి పోతే 2014 వరకు ప్రావిడెంట్‌ కటాఫ్‌ ఉందని.. 2018 వరకు పెంచాలని కోరారు. అప్పటికప్పుడే నిర్ణ యం తీసుకున్నాం. తెలంగాణ చేతిలో అధికారం ఉంటే ఇక్కడికిక్కడే నిర్ణయాలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేనికైనా ఢిల్లీకి పోవాలి. మాట్లాడితే ఢిల్లీ.. ఊ అంటే ఢిల్లీ... పొద్దుగాల విమానం.. మధ్యాహ్నం విమానం.. రాత్రి విమానం. ఇక్కడ ఏమీ నిర్ణయాలు జరగవు. వాళ్లు ముందే ఢిల్లీకి గులాంలంటే మనం మళ్లీ అమరావతికి గులాంలు కావాలా? చంద్రబాబు నాయుడికి గులాంగిరీ చేయాలా? తెలంగాణ కాం గ్రెస్‌ నాయకుల టికెట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్‌ చేసిండు. ఇంతకన్నా దౌర్భాగ్యం, అధ్వానం ఇంకోటి ఉంటదా? దాసి దాసి రాష్ట్రాన్ని దెయ్యాల పాలు జేయాలా? పోయిన దరిద్రాన్ని మళ్లీ తెచ్చుకోవాలా? ప్రజలు ఇవన్నీ ఆలోచన చేయాలి’’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, మానుకోట, మరిపెడ, జనగామతోపాటు సూర్యాపేట జిల్లా కేంద్రం, తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. ఆయా సభల్లో కేసీఆర్‌ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే... 

పోడు భూములకు 6 నెలల్లో పరిష్కారం... 
రాష్ట్రంలో రూ. 45 వేల కోట్లతో సంక్షేమం జరుగుతోంది. సిద్ది పేట, ములుగు ప్రాంతంలోని గిరిజన తండా లో అగ్నిప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయిన ఆడపిల్ల తండ్రి వేదన చూసి చలించి కల్యాణ లక్ష్మీ ప్రకటించాం. ఏ ప్రభుత్వాలూ ఆలోచించని రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 10 ఉత్తమ పథకాల్లో రైతు బంధు ఒకటి. నిన్న ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ పోడు భూములకు పరిష్కారం చూపుతామంటున్నారు. పోడు భూములు పరిష్కారం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలకు 58 ఏండ్లు చాలలేదా? అన్ని రోజు లు ఏంజెసిన్రు? నేను ఒక్కటే హామీ ఇస్తున్నా. భూ వివాదాల పరిష్కారంలో ఇరుకున్న పార్ట్‌–బీ భూములుగానీ, పోడు భూములుగానీ లేదా అక్కడ ఉండే గిరిజనేతరుల భూములుగానీ, గిరిజనుల భూములుగానీ... వీటన్నింటినీ ఎన్నికల అనంతరం ఆరు నెలల్లో పరిష్కరిస్తాం. వారందరికీ రైతు బంధు చెక్కులు అందేవిధంగా, రైతు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటాం. పెన్షనర్ల కోసం డైరెక్టరేట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. 

రైతు బంధుకు ఐక్యరాజ్యసమితి కితాబు... 
రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 10 ఉత్తమ కార్యక్రమాలను గుర్తిస్తే అందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం ఉంది. వాళ్లు నన్ను అమెరికాకు ఆహ్వానించారు. ఎన్నికలు ఉండటంతో నేను వెళ్లలేదు. రైతు బీమా పథకం ఇండియాలో ఎక్కడా లేదు. గుంట భూమి, పావు ఎకరం, అరెకరం ఉన్నా.. ఆ రైతు చనిపోతే రూ. 5 లక్షలు వారం రోజుల్లో వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్‌ ఆన్‌ అయితే సూర్యాపేటకు రెండు పంటలకు నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గతంలో ఉన్న వాళ్లు సూర్యాపేట పట్టణవాసులకు మూసీ మురికినీళ్లు తాగించారు. కానీ జగదీశ్‌రెడ్డి... మిషన్‌ భగీరథతో స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన శుద్ధ జలాలను మీకు అందిస్తున్నారు. ఆడబిడ్డల ఇబ్బందులు పోవాలని ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమం చివరి దశకు వచ్చింది. నెల రోజుల్లో ఇది పూర్తి అవుతుంది.

పోరాటాల గడ్డ తుంగతుర్తి.... 
పోరాటాల గడ్డ తుంగతుర్తి ప్రజల్లో చైతన్యం ఎక్కువ. ఈ ప్రాంతం 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనతో అభివృద్ధిలో ముందంజలో ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న నియోజకవర్గంలో రుద్రమదేవి, వెంపటి చెరువులను రిజర్వాయర్లుగా మార్చి సాగునీటి సమస్యను తీర్చుతాం. ఎన్నికలు కాగానే సీఎంగా వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తా. తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నాయకుడు గ్యాదరి కిశోర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన ఉద్యమ నాయకుడు. కాగా, సూర్యాపేట సభకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తిరుమలగిరిలో జరిగిన సభకు ఎమ్మెల్యే అభ్యర్థి గ్యాదరి కిశోర్‌ అ«ధ్యక్షత వహించారు. ఈ సభల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి పొల్గొన్నారు.

రెడ్యానాయక్‌ ఆట పాట 
డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్‌ సభలో తాజా మాజీ ఎమ్మె ల్యే డీఎస్‌ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్‌ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. సభకు వచ్చిన జనాన్ని తమ ఆటపాటలతో అలరించారు.

చంద్రబాబు పెత్తనం కావాలా?
చంద్రబాబు తెలంగాణపై మళ్లీ పెత్తనం చేస్తే ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వబోమని 35 ఉత్తరాలు రాసిండు. చంద్రబాబు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నడు.. పడదామా? మీ వేలుతోనే మీ కన్ను పొడిపిస్త అంటున్నడు. మీ దగ్గరే 10–11 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంట అంటున్నడు. సూర్యాపేట పొలాలకు కాళేశ్వరం నీళ్లు కావాలా? చంద్రబాబు పెత్తనం కావాలా? మన దగ్గర 119 ఉంటే ఏపీ వాళ్లకు 175 నియోజకవర్గాలున్నాయి. అక్కడ చంద్రబాబు చేసింది ఏమీ లేదు. ఈసారి అక్కడ డిపాజిట్లు కూడా రావని చెబుతున్నరు. మన దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు అక్కడ లేవు. గోల్‌మాల్‌ చేస్తరు. రైతులకు రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను మోసం చేసిండు.

ఎవరినీ వదిలిపెట్టం... 
కాంగ్రెస్‌ హయాంలో దొంగ లెక్కలు జెప్పిన్రు. అప్పటి హౌసింగ్‌ మంత్రిగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే రూ. కోట్ల సొమ్ము మింగిండు. ఆయన హయాంలో హౌసింగ్‌ శాఖలో రూ. 5 వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఒక ఇల్లు కట్టి పది ఇళ్లకు బిల్లులు తీసుకున్నారు. కాంగ్రెసోళ్లు.. ఏమాయె కేసీఆర్, డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడతనంటివి, ఏమాయే అంటున్రు. ఏమాయే... ఏమాయె అంటే అయి బిస్కెట్లా? మీ లెక్క అబద్ధాలు జెప్తమా? 4 రోజులు ఆలస్యమైనా 2.60 లక్షల ఇళ్లు కడతామన్నాం.. కడుతున్నాం. ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లకు సమానం. ఒక్కసారి కడితే రెండు తరాలకు నిలవాలె. అయ్యే పనే జెప్పాలె.. బాజాప్తుగా చెయ్యాలె.. కట్టాలె. మంథని అని ఒక నియోజకవర్గం ఉంది. ఇండ్లు అవసరం ఉన్నోళ్లు నూరు మంది ఉంటే 140 మందికి ఇళ్లు కట్టిళ్లు. మరి ఎటుబాయే ఇండ్లన్నీ? ఏమాయె? ఎంక్వైరీల బయటబడ్డరు. నేను దొరకబట్టి మొత్తం కక్కిత్తుంటిని... కానీ కేసీఆర్‌ జూసిండ్రా మా మీద పగబట్టిండు.. మా ఎమ్మటే బడ్డడు అని బద్నాం జేద్దురు. పొయిన టర్మ్‌ అందుకే ఎవ్వని తెరువు పోలే. ఇప్పుడు మాత్రం ఎవరెవరు ఎన్ని మింగిర్రో కక్కించి తీరుతం. ఎవరి చరిత్ర ఏమిటో బయటికి తీత్తం. ఇక చూపిస్తాం.. వదిలిపెట్టం.

రేపటి నుంచి కేసీఆర్‌ రెండో విడత ప్రచారం
టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం ఒక్కరోజు విరామం తర్వాత మళ్లీ మొదలుకానుంది. నవంంబర్‌ 19 నుంచి 23 వరకు వరుసగా 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఆదివారం నుంచి బుధవారం వరకు మళ్లీ వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం జరగనుంది. రెండోదశ ప్రచారంలో 37 నియోజకవర్గాలను పూర్తి చేస్తారు. ఇలా ఈ నెలలో 28 కల్లా 62 సెగ్మెంట్లు పూర్తి కానున్నాయి. అసెంబ్లీ రద్దు తర్వాత సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి బహిరంగసభల్లో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారు.  కేసీఆర్‌ నవంబర్‌ 19న ఖమ్మంలో బహిరంగసభతో పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభిం చారు. పాలేరు, ఖమ్మం సెగ్మెంట్లకు కలిపి నిర్వహించిన ఈ సభలో పాల్గొన్నారు. అనంతరం అదేరోజు పాలకుర్తి సభలో ప్రసంగించారు. ఇలా 23 వరకు కేసీఆర్‌ ప్రచారం కొనసాగింది. సిద్దిపేట, దుబ్బాక, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డి, జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్, ఖానాపూర్, బోధ్, నిర్మల్, ముథోల్, ఆర్మూరు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి), జనగామల్లో ప్రచారం పూర్తి చేశారు.
 
రేపు ఆరు సెగ్మెంట్లలో...
కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ఆదివారం నుంచి మళ్లీ మొదలుకానుంది. తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సీఎం ఆదివారం ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఊపు తెచ్చేలా డిసెంబర్‌ 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై ఆయన శనివారం పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది.

మేనిఫెస్టో ముసాయిదా పూర్తి
కీలకమైన మేనిఫెస్టో ప్రకటనపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజాకూటమి ఎన్నికల ఎజెండాను పరిశీలించిన తర్వాతే టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండనుంది. దీన్ని సాదాసీదాగా రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ తమ పని పూర్తి చేసింది. ముసాయిదా మేనిఫెస్టోను కె.కేశవరావు శనివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే... పాక్షిక మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో సాదాసీదాగా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement