మెతుకుసీమగా పేరొందిన ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌కు బలమైన రాజకీయ వేదిక. జిల్లాలో ఈసారి ఎన్నికల పోరు హోరాహోరీ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మరో కీలక నేత తన్నీరు హరీశ్‌రావుల ‘కారు’ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే.. ఇక, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి వంటి ముఖ్యనేతల గడ్డ ఇది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. మహా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ 7, టీజేఎస్ 3చోట్ల పోటీ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ, బీఎల్‌ఎఫ్ అన్నిచోట్లా పోటీకి దిగాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 8 స్థానాల్లో గెలవగా, నారాయణఖేడ్ ఉప ఎన్నికలో గెలిచి 9కి బలాన్ని పెంచుకుంది. ఈసారి జిల్లా అంతటా గులాబీ జెండా ఎగురవేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అందోలు (ఎస్సీ): వేడెక్కిన రాజకీయాలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), క్రాంతికిరణ్ (టీఆర్‌ఎస్) పోటీ పడుతుండగా, టీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కక.. బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ‘కమలం’ గుర్తుపై పోటీకి దిగారు. ముగ్గురి పోటీతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. క్రాంతికిరణ్ నియోజకవర్గానికి చెందినప్పటికీ స్థానిక రాజకీయాలకు కొత్త. కిందిస్థాయిలో అంతగా పరిచయాలు లేకున్నా ప్రచారం మాత్రం జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు తోడుగా పార్టీ కేడర్ దన్నుతో ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజనర్సింహకు వ్యక్తిగత పరిచయాలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వంటివి కలిసొచ్చే అంశాలు. గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈసారి గెలవాలన్న తపనతో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
జహీరాబాద్ (ఎస్సీ): ఎటో యువత మొగ్గు?
ఇక్కడ పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి ఈసారి ఇవే చివరి ఎన్నికలంటూ ప్రచారం సాగిస్తున్నారు. అందుబాటులో ఉండరని, నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదనే విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో తీవ్ర పోటీనిచ్చిన మాణిక్‌రావు ఈసారి కచ్చితంగా గెలవాలనే కసితో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసొచ్చే అంశం. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్.. మైనార్టీ ఓట్లను టీఆర్‌ఎస్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న జంగం గోపి కూడా ప్రచారాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ యువత బీజేపీకి మద్దతునిస్తున్నారు. వీరి తీర్పే ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనుందని అంచనా.
మెదక్: ఎవరి ప్రభావం ఎంత?
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్) ఐదోసారి పోటీ చేస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీజేఎస్ నుంచి న్యాయవాది జనార్దన్‌రెడ్డి (టీజేఎస్), చివరి నిమిషంలో కాంగ్రెస్ బీ ఫాం దక్కించుకున్న ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి స్థిరాస్తి వ్యాపారి ఆకుల రాజయ్య బరిలో ఉన్నారు. మెదక్‌లో తాగునీటి సమస్యకు తోడు రోడ్లు బాగా లేవనే అసంతృప్తి కొంత ఉంది. అయితే, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమాతో పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ శశిధర్‌రెడ్డి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ ప్రచారం పుంజుకోలేదు. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నది ఈయన సోదరుడు ఉపేందర్‌రెడ్డి కావడం విశే షం. అలాగే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజయ్య ఇక్కడ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ ఎవరెవ రు ఎంత ప్రభావం చూపుతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఓట్లలో కొంతమేర చీలిక రావచ్చని అంచనా.
సిద్దిపేట: మెజారిటీ ఎంత?
టీఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన నేత హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఆరోసారి పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి మొదటి నుంచీ ఈ నియోజకవర్గం కంచుకోట. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకెళ్లడం ఆయన ప్రత్యేకత. ఈ సెగ్మెంట్లో పార్టీలకు అతీతంగా హరీశ్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వ్యక్తిగత పరపతితో ఆయన గెలుపు లాంఛనం కాగా, మెజారిటీ ఎంతన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం కావడం విశేషం. ఇక్కడ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీజేఎస్ నుంచి భవానీరెడ్డి బరిలో ఉన్నారు. స్థానికంగా గుర్తింపు లేకపోవడంతో పాటు ప్రచారమూ అంతంతగానే ఉంది. బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి కూడా పోటీలో ఉన్నారు.
మద్దతిస్తేనే రైతుకు లబ్ధి
మా ప్రాంతంలో ప్రధాన పంట చెరకు. ఏటా సగటున 6 లక్షల టన్నుల చెరకు పండుతుంది. ఇంత పెద్దమొత్తంలో పంట పండుతున్నా.... రైతుకు మాత్రం గిట్టుబాటు లేదు. మరోవైపు క్రష్ మొదలయ్యాక ధర పెంచితే రైతులకు పెద్దగా లాభం కలగదు. సాగునీటి ప్రాజెక్టులు లేనందున భూగర్భజలాలపై ఆధారపడి చెరకును పండిస్తున్నాం. ఎకరాకు సగటు 40 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ 25 క్వింటాళ్లు మించడం లేదు. ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మంచిది.
– శంకర్, మన్నాపూర్, జహీరాబాద్
సంగారెడ్డి: మైనార్టీలే కీలకం
సంగారెడ్డి బరిలో తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (టీఆర్‌ఎస్), జగ్గారెడ్డి (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. ఇప్పటికే సెగ్మెం ట్ అంతా చుట్టేసిన ప్రభాకర్.. మరోమారు ప్రచారాన్ని ముమ్మ రం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలనే నమ్ముకున్న ఆయన.. మైనార్టీలను మచ్చిక చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక, బలమైన నాయకుడిగా ఉన్న జగ్గారెడ్డికి ప్రస్తుతం అనుచరగణం తగ్గింది. మెజార్టీ నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరడం, వ్యక్తిగత విమర్శలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు ఆయన సతీమణి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ దాదాపు 35 వేల వరకు ఉన్న మైనార్టీ ఓటర్లే గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్న రాజేశ్వరరావు దేశ్‌పాండే.. కొన్ని ఓట్లలో చీలిక తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నర్సాపూర్: ఇద్దరి మధ్యే వార్
కాంగ్రెస్ కోటగా పేరున్న నర్సాపూర్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. మరోమారు గెలి చేందుకు తాజా మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి (టీఆర్‌ఎస్), మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న గోపి కొన్ని ఓట్లు పొందుతారని అంచనా. సౌమ్యుడిగా పేరున్న మదన్‌రెడ్డి.. సంక్షేమ పథకాలకు తోడు అభివృద్ధి పనులు గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నా రు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనా.. కేడర్ ను మాత్రం సునీతారెడ్డి కాపాడుకుంటూ వచ్చారు. అందరికీ అందుబాటులో ఉంటారనే పేరుంది. గతంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆమెకు కలిసొచ్చే అంశాలు.
పటాన్‌చెరు: తేల్చేది సెటిలర్
పరిశ్రమల కేంద్రమైన పటాన్‌చెరులో తాజా మాజీ ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్) ఉధృతంగా ప్రచా రం నిర్వహిస్తూనే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులపై ఆశ పెట్టుకున్నారు. బీజేపీ నుంచి కరుణాకర్‌రెడ్డి, కూటమి తరఫున చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్ ప్రచారాన్ని ఆలస్యంగా మొదలు పెట్టారు. కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు ‘కాటా’కు అంతంతగానే సహకరిస్తున్నారు. మరోవైపు పెద్దసంఖ్యలో ఉన్న సెటిలర్స్ ఓట్లు కీలకం కానున్నాయి. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కూటమి అభ్యర్థికి మద్దతునిస్తే కొన్ని ఓట్లు పెరగచ్చు.
నారాయణఖేడ్: పోటీ ఖతర్నాక్
కాంగ్రెస్, టీడీపీల కోటగా ఉన్న నారాయణ్ ఖేడ్‌లో గత ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాగా వేసింది. అప్పుడు గెలిచిన తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి తాజాగా పోటీకి దిగగా కూటమి తరపున మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన సంజీవరెడ్డి.. పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్ తరపున వికలాంగ సంఘ నాయకుడు బస్వరాజ్ పోటీ చేస్తున్నా.. ప్రధానంగా భూపాల్‌రెడ్డి, షెట్కార్, సంజీవరెడ్డి మధ్యే పోటీ ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా.. కూటమి, బీజేపీ అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల మొగ్గు తమవైపే ఉంటుందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు పార్టీ మారి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి కాంగ్రెస్ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీడీపీ సీనియర్ నేత విజయ్‌పాల్‌రెడ్డి కూటమి తరఫున రంగంలోకి దిగితే కాంగ్రెస్‌కు ఓట్లు పెరిగే అవకాశం ఉంది.
‘నారింజ’ కింద పండని గింజ
మా ప్రాంతంలోని నారింజ ప్రాజెక్టు గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ కురిసిన వర్షపు నీరంతా కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుంది. ఇలా ఏటా దాదాపు 2 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఈ ప్రాజెక్టును ఆధునీకరించి, ఈ నీటిని నిల్వ చేస్తే మా ప్రాంతంలో ఒక పంట పుష్కలంగా పండుతుంది. ఏళ్లుగా పేరుకున్న పూడికను తీసినా కొంత మేలు కలుగుతుంది. ప్రాజెక్టు డిజైన్‌లో కొన్ని మార్పులతోనే నీటి సామర్థ్యం పెంచే వీలుంటుంది. ఈ దిశగా స్పష్టమైన హామీని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాలి.
– కిషోర్, బూచినెల్లి రైతు, జహీరాబాద్
దుబ్బాక: కూటమిలో తికమక
పూర్తి గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన దుబ్బాకలో పోటీ రక్తి కట్టిస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఐదోసారి పోటీ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించడంతో రాజ్‌కుమార్ బరిలో ఉన్నారు. చివరి నిమిషంలో మద్దుల నాగేశ్వరరెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇవ్వడంతో ఆయనా పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు. కూటమి తరపున రాజ్‌కుమార్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ సైతం స్నేహపూర్వక పోటీకి దిగడంపై గందరగోళం నెలకొంది. దీనికితోడు పార్టీలో కొత్తగా చేరిన నాగేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ పార్టీ సీనియర్ ముత్యంరెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌కు బలం చేకూరింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కొంచెం పోటీనిచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సానుభూతి ఆయనకు కలిసొచ్చే అంశం.
గజ్వేల్: గెలుపు జిగేల్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పోటీ చేస్తున్న నియోజ కవర్గం కావడంతో రాష్ట్రమంతా ఫలితంపై ఆసక్తిగా చూ స్తోంది. కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపడుతూనే సొంత నియోజకవర్గంలో భారీ మెజార్టీ తో గెలిచేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ ని యోజకవర్గంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా రు. ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మోడల్ హౌ స్ కాలనీ ఏర్పాటుతో పాటు రహదారుల అభివృద్ధికి భారీ గా నిధులు వెచ్చించడం టీఆర్‌ఎస్‌కు అనుకూలించే అంశాలు. మెదక్ ఎంపీ కొత్త ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గంలో ప్ర త్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు కూడా కార్యకర్తలు, నాయకులతో మమేకమవుతూ ప్రచార వ్యూహాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి హడావుడి చేస్తూ గెలుపునకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ కాం గ్రెస్‌లోని కీలక నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడంతో ఆ పార్టీకి కష్టంగా మారింది. ఈ క్రమంలో రహదారి భద్రత సంస్థ చైర్మన్ నర్సారెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం కాస్త ఊరట. బీజేపీ తరపున ఆకుల విజయ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేసిన ఈమె ఈసారి కేసీఆర్‌పై పోటీకి దిగారు.
‘మెతుకుసీమ’ మనోగతం
- అత్యధికంగా పండే చెరకు పంటకు మద్దతు ధర పెంచాలి. స్థానికంగా
- ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు లాభదాయకం.
- నిజాం షుగర్స్ పునరుద్ధరణపై శ్రద్ధ చూపాలి
- భారీ పరిశ్రమలున్నా.. అరకొర ఉద్యోగాలే ఉన్నాయి. యువతకు ఉపాధి
- అవకాశాలు పెంచేందుకు మరిన్ని బడా కంపెనీలు ఏర్పాటు చేయాలి
- సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించి మారుమూల ప్రాంతాలకూ సాగునీరు ఇవ్వాలి. మెదక్, అందోల్, నర్సాపూర్, దుబ్బాక, పటాన్‌చెరు సెగ్మెంట్లకు తాగునీటి సరఫరా
- గ్రామీణ నియోజకవర్గాల్లో అంతర్గత రహదార్ల నిర్మాణం అవసరం..
- నిర్మాణంలో ఉన్న పలు రోడ్లను తొందరగా పూర్తి చేయాలి
- జహీరాబాద్ నిమ్జ్‌పై ప్రత్యేక చొరవ తీసుకుని పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలి
- నారింజ ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు
- జాజిమల్కాపూర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment