నేను కష్టసుఖాలు తెలిసిన కాపోణ్ణే.. | TRS Will Work For Farmers Development Says KCR | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 21 2018 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

TRS Will Work For Farmers Development Says KCR - Sakshi

సిద్దిపేట సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌. చిత్రంలో హరీశ్, రామలింగారెడ్డి

సాక్షి, సిద్దిపేట/కరీంనగర్‌/సిరిసిల్ల/కామారెడ్డి: ‘నేనూ రైతు బిడ్డనే.. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా.. వ్యవసాయంలో కష్టసుఖాలు తెలిసిన కాపోణ్ణే. కష్టాలుపడ్డ రైతులను ధనవంతులుగా చూడాలన్నదే నా తపన.
అందుకోసం వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి రైతులను ధనవంతులను చేయలన్నదే నా కోరిక’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్నదాతల అప్పులన్నీ
తీరిపోయి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు జమ కావాలన్నదే తన కోరిక అన్నా రు. ఇందుకోసం పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కొత్త పథకానికి రూపకల్పన చేశానని, రాబోయే
ప్రభుత్వంలో దాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చా రు. అలాగే తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తామని, పంటల కొనుగోలు కోసం ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పంటల కొనుగోలు కోసం ఐకేపీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని, మళ్లీ అధికారంలోకి రాగానే వారిని క్రమబద్ధీకరిస్తామన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా కేసీఆర్‌ మంగళవారం
సుడిగాలి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట, హుజూరాబాద్, ఎల్లారెడ్డి, సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభ ల్లో ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలో తమ ప్ర భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనువివరించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంటు కష్టాలు మొదలవుతాయన్నారు. సిద్దిపేట సభ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి, ఆయన అనుచరులకు కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...

సిద్దిపేటలో... 
వ్యవసాయ రంగంలో వినూత్న విప్లవం
ఇంతకాలం ప్రణాళిక లేకుండా రైతులు వ్యవసాయం చేయడంతో ఏటా నష్టాలే చవిచూశారు తప్ప.. ఏనాడూ రూపాయి కూడగట్టుకోలేదు. ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలు అందచేసింది. పెట్టుబడి సాయం చేస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే సాగునీటికి ఇబ్బందులు ఉండవు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారుతోంది. అయితే రైతులు గుడ్డిగా వ్యవసాయం చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. ఏపంటలు ఏ ప్రాంతంలో వేయాలి, ఎక్కడ వేస్తే దిగుబడి వస్తుంది, అధిక ధర పలుకుతుందనే విషయాన్ని అధ్యయనం చేసి పంటల కాలనీలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల సాగుఉంటుంది. రైతులు పండించిన పంటను డిమాండ్‌ రేటుకు అమ్మేలా మార్కెటింగ్‌ వ్యవస్థలో మార్పులు తెస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తులను నిల్వ చేయడం, వాటిఆధారంగా వినియోగ వస్తువులుగా తయారు చేసి జాతీయ, అంతర్జాతీయంగా ఎగుమతులు పెంచుతాం. పప్పు, ఉప్పు, నూనెలు ప్రతిదీ కల్తీ అవుతోంది.. మనం పండించిన పంటలను మనమే తినే విధంగా తయారుచేసుకోవాలి. అలా అయితేనే ఆరోగ్యంగా ఉంటాం. 

తెలంగాణ మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతాం... 
తెలంగాణ మహిళా శక్తిని ప్రపంచానికి చాటే విధంగా ఉత్పత్తి రంగంలో వారి సేవలు వినియోగించుకుంటాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని మహిళా సంఘాలకు అప్పచెబుతాం. రైతులు పండించిన పంటలను డిమాండ్‌
రేటుకు మహిళా సంఘాలే కొనుగోలు చేస్తాయి. తాత్కాలికంగా వినియోగించే ఉత్పత్తులతోపాటు కందులను పప్పులుగా చేయడం, కారం పొడి, నూనెలు ఇలా వస్తువులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తాం.ఇలా ఐకేపీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటాం. వారిని పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తిస్తాం. ముంబైలోని ధారావి అనే మురికివాడ నుంచి పుట్టుకొచ్చిన లిజ్జత్‌ పాపడ్‌ అనే కంపెనే ఈ విషయంలో మనకు ఆదర్శం.అక్కడ ఓ మహిళ.. పేద ఆడవాళ్లందరినీ కూడగట్టి పాపడ్‌ తయారు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ రూ. 1,176 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 

ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లోనే: హరీశ్‌ 
‘గత నాలుగున్నర ఏళ్లుగా చేసిన పని మీ అందరి ముందు ఉంది. కష్టాల్లో, సుఖాల్లో, అభివృద్ధిలో అన్నింటా మీ కుటుంబ సభ్యుడిగా పని చేశా. ఎన్నికల పరీక్ష వచ్చింది. మీ కొడుకుగా, బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగానిలబడ్డా. ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు వేసి గెలిపిస్తారో మీ చేతుల్లో ఉంది’అని మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.  

హుజూరాబాద్‌ సభలో... 
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్‌ పోతుంది... 
తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ మనకథ మొదటికే వస్తుంది. ఆ పార్టీ గెలిస్తే కరెంట్‌ పోతుంది. మన ప్రభుత్వంలో కరెంట్‌ పోనేపోదు. గత పాలకులు తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రం నాలుగేళ్లపసిగుడ్డు. అయినా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పెరుగుదలలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలో 70 శాతం మంది రైతులున్నారు. పంటలకు గిట్టుబాటు అయ్యేలా బ్రహ్మాండమైనపథకానికి నేనే రూపకల్పన చేసిన. రాబోయే ప్రభుత్వంలో అమలు చేస్తా. ప్రతి తాలుకా.. ప్రతి ప్రాంతం.. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు వస్తాయి. మహిళా సంఘాలు ఆ పరిశ్రమలను నిర్వహిస్తాయి.అధికారంలోకి రాగానే ఐకేపీ ఉద్యోగులు 5–6 వేల మందిని క్రమబద్ధీకరిస్తా. 

తెలంగాణ... దేశంలోనే నంబర్‌ వన్‌ 
తెలంగాణ ఉద్యమంలో భిక్షపతి అనే మిత్రుడు కరెంట్‌ బిల్లు చెల్లించలేక పురుగుల మందు తాగి చనిపోతే మేమంతా జమ్మికుంటకు వచ్చినం. కంటనీరు పెట్టుకున్నం. ఉద్యమ సమయంలో కరెంట్‌ కోతలు, బిల్లుల
మోతలను అనుభవించాం. మీ దీవెనలతో ఇక నుంచి అలాంటి కరెంట్‌ బాధలు లేవు. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా రైతులకు 24 గంటలు ఉచిత విద్యత్‌ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఆర్థిక పెరుగుదలలోనూ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. 

తెలంగాణకు వాటర్‌ జంక్షన్‌గా కరీంనగర్‌ 
జూన్‌ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైతే ఈ ప్రాంతానికి డోకా ఉండదు. 50 టీఎంసీల ప్రాజెక్టులు రెండు హుజూరాబాద్‌ నెత్తిమీదనే ఉన్నయి. ఎల్‌ఎండీ, మిడ్‌మానేరుతో కరీంనగర్‌ వాటర్‌ జంక్షన్‌ కాబోతోంది. కాళేశ్వరంపూర్తయితే 365 రోజులు నీళ్లు వస్తయి. తెలంగాణలో కో టి ఎకరాల మాగాణి నెరవేరుతుంది. ఎ స్సారెస్పీలో నీళ్లున్నయి. అవి ఎగ్జిబిషన్‌ పె ట్టుకునేందుకు కావు. పంటలు పండాలె. ప్రజలు రందిపడాల్సిన అవసరం లేదు.పంట కోత దశ వరకు 4–5 తడులకు బాజాప్తగా నీళ్లిస్తాం.  

ఈటల నా కుడి భుజం... 
ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ను అభివృద్ధిలో అద్భుతంగా మలిచారు. రూ. వందల కోట్లు ఖర్చు పెట్టి చెక్‌డ్యాంలు కట్టించారు. మనకు నీటి కష్టాలే ఉండవు. ఆయన పనితీరుపై నాకు ఇప్పుడే సర్వే రిపోర్టు వచ్చింది.ఈటలకు 80% ఓట్లు వచ్చి గెలుస్తడని సర్వే చెబుతోంది. రాజేందర్‌ నా కుడి భుజం. ఆయన్ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. 

సిరిసిల్ల సభలో...
వెనుకపడేయబడిన ప్రాంతం... సిరిసిల్ల 
సిరిసిల్ల వెనుకబడిన ప్రాంతం కాదు. వెనుకపడేయబడిన, వివక్షకు గురైన ప్రాంతం. వచ్చే జూన్‌ తర్వాత ఎగువమానేరు, మిడ్‌మానేరు, లోయర్‌మానేరులతో సహా మంథని దాకా ఉన్న మానేరు నది నేను చిన్నప్పుడు చూసినట్లుగా ఏడాది పొడవునా జీవకళను సంతరించుకోనుంది. సజీవమైన జీవధారతో ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుంది. ఇటువంటి గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టును కాం గ్రెసోళ్లు కట్టే ప్రయత్నం చేయకపోగా అడ్డుకొనే ప్ర యత్నాలు చేస్తున్నారు. వాళ్ల బతుకంతా ఆంధ్రోళ్లకు సంచులు మోసి బతికారు. ఒకప్పుడు ఆత్మహత్యలకు నెలవైన సిరిసిల్ల బాగుపడాలి. ఇక్కడే రెడీమేడ్‌ దుస్తు లు తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయాలి. 

కాంగ్రెస్‌ గొర్రెలకు అర్థమైతలేదు.. 
కాంగ్రెస్‌ పాలన కాలంలోనే కులవృత్తులు నాశనమయ్యాయి. తెలంగాణలో 30 లక్షలకుపైగా యాదవులు ఉండగా బయటి నుంచి రోజూ 1,200 లారీల గొర్రెలు ఎందుకు దిగుమతి కావాలి? కాంగ్రెస్‌ పాలనలో వారికి
ప్రోత్సాహం కరువైంది. అందుకే మేము రూ. 4 వేల కోట్లతో 65 లక్షల గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టాం. వాటికి 45 లక్షల గొర్రెలు పుట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా కోటీ పది లక్షల గొర్రెలతో మొత్తం రూ. 1,500 కోట్లసంపద సృష్టించాం. ఇది కాంగ్రెస్‌ గొర్రెలకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికీ పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారు. కుల వృత్తులు కూలిపోబట్టే మన బిడ్డలు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బాట పట్టారు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పి నా నోరు కరాబ్‌ చేసుకోను. 

ఈసారి రాజన్నకే... 
వేములవాడ రాజన్న ఆలయానికి ఇప్పటివరకు నిధులు, స్థలం సమకూర్చాం. ఇప్పటివరకు యాదాద్రి మీద దృష్టిపెట్టాం. వచ్చేసారికి వేములవాడను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. కేసీఆర్‌ సీఎం కాకపోయుంటే జన్మలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు. ఇదంతా వేములవాడ రాజన్న స్వామి దయ. 

నేను చెప్పేది అబద్ధమైతే డిపాజిట్‌ కూడా రాకుండా చేయండి.. 
సంపద పెంచుడంటే తానా తందానా అన్నట్లు కాదు. కడుపు, నోరు కట్టుకొని పనిచేయాలె. కుంభకోణాలు, లంబకోణాలు చేయకుండా సంపద పెంచుకొని పథకాలన్నీ అమలు చేసినం. నేను చెప్పేది నిజమైతే కేటీఆర్,రమేశ్‌బాబు ఇద్దర్నీ లక్ష మెజారిటీతో గెలిపించండి. అబద్ధమైతే డిపాజిట్‌ రాకుండా చేయలె. ఇక నుంచి ఇంటింటికీ వచ్చే భగీరథ నీళ్లలో ప్రతిరోజూ కేసీఆర్‌ కనిపిస్తాడు. కాళేశ్వరం నీటితో పంటలు కళకళలాడటం కంటే నాకు జీవితంలో గొప్ప కోరిక లేదు. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బహిరంగ సభకు హాజరైన ప్రజలు

ఎల్లారెడ్డి సభలో... 
రైతు బంధు దేశానికే ఆదర్శం... 
రైతు బంధుతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు. గుంట భూమి ఉన్న రైతుకు సైతం బీమా వర్తింపజేశాం. బీమా పథకం అమలులోకి వచ్చాక రాష్ట్రంలో చనిపోయిన 3,344 మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా అందించాం. గిరిజన తండాలను పంచాయతీలు చేస్తామని చాలా ప్రభుత్వాలు మోసం చేశాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే తండాలను పంచాయతీలుగా చేసి మాట నిలుపుకుంది. గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించలేదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తాం. 

కేసీఆర్‌కు రూ. 11,016 అందించిన బాలిక
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాంధారి మండలం చద్మల్‌ తండాకు చెందిన ఏడో తరగతి బాలిక మంజా గురువాణి రూ. 11,016 విరాళం అందించింది.కాయతీ లంబాడీ వర్గానికి చెందిన గురువాణి.. తమను బీసీ–డీలో కొనసాగిస్తున్నారని, భాష సమస్యతో బీసీలతో పోటీపడి గురుకులాల్లో సీట్లు సాధించలేకపోతున్నామని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తమ కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం తనవంతుగా చిన్నప్పటినుంచి గల్లాపెట్టెలో దాచుకున్న రూ. 11,016 విరాళంగా అందిస్తున్నానని పేర్కొంది. చిన్నారి గురువాణిని కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement