నేను ప్రజలకే ఏజెంటు | KCR Comments on BJP and Congress Party | Sakshi
Sakshi News home page

నేను ప్రజలకే ఏజెంటు

Published Tue, Dec 4 2018 1:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KCR Comments on BJP and Congress Party - Sakshi

సోమవారం నల్లగొండ టౌన్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు పోటెత్తిన జనం

నేను పేద ప్రజలు, రైతులకు మాత్రమే ఏజెంటును. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు ఏజెంటుగా వ్యవహరించాల్సిన అగత్యం నాకు లేదు. ఒక కేసీఆర్‌ను ఢీకొట్టడానికి, టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి... కాంగ్రెస్, సీపీఐ, టీడీపీలు ఏకమయ్యాయి. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు సహా ప్రతిపక్షనేతలందరూ నన్ను శత్రువుగా భావిస్తున్నారంటే.. కేసీఆర్‌కు ఉన్న ప్రజాబలం ఏమిటో వారికి అర్థమైంది. 

చంద్రబాబు నేనే హైదరాబాద్‌ కట్టానంటుండు. సంతోషం నువ్వే కట్టావు.. నువ్వు మహా మేధావివి. మరి కరెంట్‌ ఎందుకు ఇవ్వలే? కాంగ్రెస్‌లో ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా అంతా మేధావులే. నాకంటే రెండింతల లావుగా, నా కన్నా ఒక ఫీటు ఎత్తు ఉంటరు. మరి కరెంట్‌ ఎందుకు ఇవ్వలే. మీ మేధావితనం, మీ గొప్పతనం మీ తెలివితేటలు ఎటు పోయాయి? నాలుగు దశాబ్దాలు ఢిల్లీలో మీరే.. ఇక్కడ మీరే.. ఉన్నది నాశనం బట్టిచ్చారు తప్ప.. కరెంటివ్వలే. 

సాక్షి నెట్‌వర్క్‌: ‘నేను పేద ప్రజలు, రైతులకు మాత్రమే ఏజెంటును. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు ఏజెంటుగా వ్యవహరించాల్సిన అగత్యం నాకు ఎంతమాత్రం లేదు’అని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఏజెంటు అంటారని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఇక్కడకు వచ్చి కేసీఆర్‌ బీజేపీ ఏజెంటు అంటారని విమర్శించారు. తమ పాలన ద్వారా దేశాన్ని భ్రష్టుపట్టించిన పార్టీలకు ఏజెంటుగా ఉండాల్సిన అవసరం తనకు లేదని, తాను ముమ్మాటికీ పేద ప్రజల ఏజెంటునేనని ఉద్ఘాటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. ఒక కేసీఆర్‌ను ఢీకొట్టడానికి, టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్, సీపీఐ, టీడీపీలు ఏకమయ్యాయని.. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ తనను శత్రువుగా భావిస్తున్నారంటే కేసీఆర్‌కు ఉన్న ప్రజాబలం ఏమిటో వారికి అర్థమైందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రులే పచ్చి అబద్ధాలు చెప్పే దేశం మనదని విమర్శించారు. నిజామాబాద్‌ సభలో ప్రధాని మోదీ తెలంగాణలో కరెంటు కష్టాలున్నాయని అబద్ధాలు మాట్లాడవచ్చా అని నిలదీశారు. ‘మీరు పాలించే రాష్ట్రాల్లో పది శాతం కూడా మంచి లేదు. మీరు ఇక్కడకు వచ్చి మాట్లాడితే మేం ఎడ్డిపోసుగాల్లలాగా కనిపిస్తున్నమా’అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... 

బాటిలిచ్చారని.. బామ్మర్ది చెప్పిండని ఓటేయొద్దు.. 
‘ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థికవృద్ధి సాధించినం. గ్రామాలలో చేసిన పనులన్నీ మీ కళ్ల ముందే ఉన్నయి. పేదింటి అమ్మాయి పెళ్లి జరిగితే లక్షా నూటపదహారు రూపాయలు ప్రభుత్వం ఇస్తదని అనుకున్నమా? ఈ రోజు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ మీ ఊళ్లలోను ఉన్నయి. రూ.వెయ్యి ఇచ్చే ఆసరా పింఛన్లు మీ ఊళ్లలోనే ఉన్నయి. దివ్యాంగులకు రూ.1500 వచ్చేది మీ గ్రామాల్లోనే ఉంది. మహిళలు ప్రసూతికి పోతే అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు, కేసీఆర్‌ కిట్టు ఇస్తున్నం. మీరందరూ సంతోషించే విధంగా అన్ని రకాల ఆసరా పింఛన్లు పెంచుతున్నం. రూ.వెయ్యి పింఛన్‌ రూ.2,016కు, వికలాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచుతం.

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 చొప్పున భృతి కల్పిస్తం. వీటన్నింటినీ మించి ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు పథకం తెచ్చినం. ఇకపై ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తం. ఏ ప్రభుత్వంలోనైనా భూములు సర్వే చేసి మీ పాస్‌ పుస్తకాలు మీకు ఇచ్చిండ్రా? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో ఇవన్నీ జరుగుతయని అనుకున్నమా..? కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఈ ఆలోచన వస్తదా..? 58 ఏళ్ల పాలనలో కరెంటు సరఫరా ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో గమనించాలె. పార్టీలు, అభ్యర్థులు చాలా మంది పోటీ చేసినా ప్రజలు గెలవాలె. మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే మంచి పనులు జరుగుతయి. మందుబాటిల్లు ఇచ్చిండ్రని, బావమర్ది చెప్పిండని ఓట్లు వేస్తే ఏమీ జరగదు. 

‘సీతారామ’ను ఎందుకు అడ్డుకున్నడో?
తెలంగాణ ప్రజల అండదండలు ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరినైనా వ్యతిరేకిస్తది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మాకు ముఖ్యం. కాంగ్రెస్, బీజేపీలకు నేనంటే వణుకు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఢిల్లీ స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్త. ఇందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలె. ఇన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉంది. మీరున్నారన్న ధైర్యంతోనే చెడును వ్యతిరేకిస్తూ.. మంచికోసం నిలబడుతున్న. 58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశ ప్రజలకు చేసిందేమీ లేకపోగా.. నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నయి. రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలు సిద్ధాంతరహితంగా ఏకమై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నయి. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం రూపొందించిన సీతారామ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖలపై ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పి తీరాలె. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునే పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలె. 

తాలూకాకో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ.. 
పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా తాలూకాకు ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను నెలకొల్పి, ఐకేపీ మహిళలకు అప్పగిస్తం. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్‌ చేస్తం. పరిశ్రమల్లో కల్తీ లేని సరుకులు డీలర్ల ద్వారా విక్రయిస్తం. దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న థర్మల్‌ ప్లాంట్‌ పూర్తయితే ఆర్థిక వికాసం చెందుతుంది. నల్లగొండ అభ్యర్థిని గెలిపిస్తే.. ఈ నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకుంట. ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి నేనే పోటీ చేయాలనుకున్న. భూపాల్‌రెడ్డి రాకతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్న. 

బాబు కరెంట్‌ ఎందుకు ఇవ్వలే.. 
‘చంద్రబాబు నేనే హైదరాబాద్‌ కట్టానంటుండు. సంతోషం నువ్వే కట్టావు.. నువ్వు మహా మేధావివి. మరి కరెంట్‌ ఎందుకు ఇవ్వలే? కాంగ్రెస్‌లో ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా అంతా మేధావులే. నాకంటే రెండింతల లావుగా, నా కన్నా ఒక ఫీటు ఎత్తు ఉంటరు. మరి కరెంట్‌ ఎందుకు ఇవ్వలే. మీ మేధావితనం, మీ గొప్పతనం మీ తెలివితేటలు ఎటు పోయాయి? నాలుగు దశాబ్దాలు ఢిల్లీలో మీరే.. ఇక్కడ మీరే.. ఉన్నది నాశనం బట్టిచ్చారు తప్ప.. కరెంటివ్వలే. హుజుర్‌నగర్‌లో సైదిరెడ్డి గాలి బాగుంది. ఇంత పెద్దగా జనం వచ్చారంటే సైదిరెడ్డి 100 శాతం విజయం సాధించినట్లే. ఇది జనమా.. ప్రభంజనమా..? అన్నట్టుగా వచ్చారు. ఓటు వేసే ముందు ఆలోచించి వివేచనతో.. ప్రజలకు ఏది మంచి అయితే అది చేయాలె. పోయినసారి మీరు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చింది. మళ్లీ 100 శాతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తేనే మీకు లాభం జరుగుతది. 

నేడు కొడంగల్‌కు సీఎం కేసీఆర్‌ 
5 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం 
టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మంగళవారం ఐదు సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌తో పాటు ఆలంపూర్, గద్వాల, మక్తల్, వికారాబాద్‌ ప్రజా ఆశీర్వాదసభల్లో ఆయన పాల్గొంటారు. సీఎం ఎన్నికల ప్రచార పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసే రేవంత్‌ సొంత సెగ్మెంట్‌లో జరుగుతున్న ఈ ప్రజా ఆశీర్వాదసభపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement