తగ్గని షుగర్‌ ప్రాబ్లం | 3 constituencies will be affected about Nizam Sugars | Sakshi
Sakshi News home page

తగ్గని షుగర్‌ ప్రాబ్లం

Published Wed, Nov 14 2018 1:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

3 constituencies will be affected about Nizam Sugars  - Sakshi

నిజామాబాద్‌ జిల్లాలో 2014 ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మరోసారి ‘కారు’ జోరు కొనసాగించేందుకు మంచి గేరు మీదుంది. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్‌లకే సీట్లు ఖరారు చేసింది. కాంగ్రెస్‌ మహాకూటమి పేరుతో రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పోరు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అయితే కూటమిలోని పక్షాలు ఏ మేరకు సమన్వయంతో కలిసి పనిచేస్తాయన్నదే సమస్య. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో పసుపు, ఎర్రజొన్న సాగు అంశాలు, కామారెడ్డి, బోధన్, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో నిజాం చక్కెర కర్మాగారం అంశం ప్రభావం చూపనుండగా, నిజామాబాద్‌ అర్బన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలే ప్రచారాస్త్రాలు కానున్నాయి. 

టీఆర్‌ఎస్‌కు దన్ను.. ‘ఎర్రజొన్న’
జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో ఎర్రజొన్న రైతులు ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. వీరికి గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.9 కోట్లను విడుదల చేయడంతో పాటు, రైతుల నుంచి ఆ పంట మొత్తాన్ని కొనేలా ప్రభుత్వం తీసుకున్న చొరవను అనుకూలంగా మలుచుకుని టీఆర్‌ఎస్‌ విస్తృత ప్రయోజనం పొందనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎర్రజొన్నల కొనుగోలు వ్యవహారంలో జరిగిన కాల్పుల ఘటనను టీఆర్‌ఎస్‌.. ఇప్పటికీ తాజాగానే ఉంచుతోంది. బకాయిల చెల్లింపు విషయంలో మాట నిలుపుకున్న విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనాలని రైతులు రోడ్డెక్కడంతో.. జిల్లా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఒప్పించి ఎర్రజొన్న మొత్తాన్ని కొనేలా చేశారు. దీంతో రైతులు సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వాణిజ్య పంట అయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేసి రైతులను ఏటా మోసం చేస్తున్న సీడ్‌ వ్యాపారులకు చెక్‌ పెట్టడం 40 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని రైతులు, రైతు నాయకులు అంటున్నారు.

కేంద్రం వల్లే పసుపు బోర్డు ఆగిందని..
జిల్లాలో పసుపు ఎక్కువగా పండించే రైతులు అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని టీఆర్‌ఎస్‌ హామీనిచ్చింది. నిజామాబాద్‌ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా.. సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. రాందేవ్‌ బాబాను కలిసి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేశారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడిపెట్టి పసుపు సాగుచేస్తే.. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక, ధర సరిగా రాక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ పసుపుబోర్డు ఏర్పాటైతే మార్కెటింగ్‌ సౌకర్యం మెరుగు పడుతుంది. కానీ కేంద్రం తీరు వల్ల రైతులకు మేలు జరగడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. 

గల్ఫ్‌..బీడీ.. వగైరా
- తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు కార్మికులు వలస వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్‌ఎస్‌.. ఎన్ని కల సందర్భంగా గల్ఫ్‌ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని హామీనిచ్చింది. 2018–19 బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతలు ఏకంగా గల్ఫ్‌ దేశాల్లో పర్యటించి అక్కడి కార్మికుల స్థితిగతులను పరిశీలించమే కాక, రూ.500 కోట్లతో గల్ఫ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు హామీనిచ్చారు.   
జిల్లాలో బీడీ కార్మికులు లక్షన్నర వరకు ఉంటారు. వీరికి కనీస వేతనాలు లేవు. నెలలో పనిదినాలూ తక్కువే. ఈ అంశంపై ఏ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
డబుల్‌ బెడ్రూమ్‌ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని విపక్షాలు దుమ్మెత్తిపోయనున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ప్రతిపక్షం ఎక్కుపెట్టనుంది.
పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీని నింపడానికి ప్రభుత్వం చేపట్టిన పథకంతో.. జిల్లా రైతాంగానికి సాగునీటికి ఢోకా ఉండదని అధికార పక్షం చెబుతోంది. రైతుబంధు, బీమా పథకాలతోపాటు వివిధ వర్గాలకు ఇస్తున్న పెన్షన్లు, పథకాలను అధికార పక్షం ప్రచారం చేసుకోనుంది.

టీఆర్‌ఎస్‌ ఇలా..
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ప్రధాన హామీ.. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించ డం. ప్రభుత్వ సంస్థగా కాక, రైతులు సహకార సంస్థగా ఏర్పాటు చేసుకుని నడిపించుకుంటే చేదోడుగా నిలుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు రైతులు అంగీకరించక.. ప్రభుత్వమే నడిపించాలని పట్టుబట్టారు. అనంతరం ఫ్యాక్టరీ స్వాధీనం, భవిష్యత్తు నిర్వహణపై ప్రభుత్వం అధ్యయన కమిటీని వేసింది. నివేదిక రాలేదు. ఈలోపు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఏళ్లుగా కర్మాగారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు, చెరకు ప్రధాన పంటగా సాగు చేస్తున్న రైతులు ఫ్యాక్టరీ మూతతో రోడ్డునపడ్డారు. ఈ అంశాన్ని టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.

కాంగ్రెస్‌ అలా..
నిజాం షుగర్స్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా ఎందుకు మార్చలేదంటూ టీఆర్‌ఎస్‌ను నిలదీయడానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. చంద్రబాబు  హయాంలో జాయింట్‌ వెంచర్‌ పేరుతో ఈ కర్మాగారంపై పెత్తనాన్ని ప్రైవేట్‌ సంస్థకు అప్పగించా రు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. 2004లో అప్పటి సీఎం డాక్టర్‌ రాజశేఖరరెడ్డి శాసనసభ కమిటీని వేశారు. కానీ, కమిటీ సిఫారసు అమలు కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయడానికి యత్నించగా, రైతులు, కార్మికులు స్టే తెచ్చుకున్నారు. ఆ తరుణంలోనే టీఆర్‌ఎస్‌.. తాము అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందని పేర్కొంది. దీన్నే కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది.  
..::కె.శ్రీకాంత్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement